English | Telugu
రియల్ పాన్ ఇండియా స్టార్.. టాప్-5 లో మూడు సినిమాలు ప్రభాస్ వే!
Updated : Jun 17, 2023
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ తన బాక్సాఫీస్ స్టామినా మరోసారి చూపించారు. ఆయన నటించిన తాజా చిత్రం 'ఆదిపురుష్' మొదటిరోజు ప్రపంచవ్యాప్తంగా రూ.140 కోట్ల గ్రాస్ రాబట్టింది. అత్యధిక ఓపెనింగ్స్ రాబట్టిన ఇండియన్ సినిమాలలో ఇది నాలుగో స్థానంలో నిలిచింది. అంతేకాదు ఫస్ట్ డే కలెక్షన్స్ పరంగా టాప్-5 ఇండియన్ సినిమాలలో మూడు సినిమాలు ప్రభాస్ వే కావడం విశేషం.
మొదటిరోజు ప్రపంచవ్యాప్తంగా రూ.225 కోట్ల గ్రాస్ తో 'ఆర్ఆర్ఆర్' మొదటిస్థానంలో ఉంది. రూ.214 కోట్ల గ్రాస్ రెండో స్థానంలో 'బాహుబలి-2', రూ.163 కోట్ల గ్రాస్ మూడో స్థానంలో కేజీఎఫ్-2 ఉండగా.. రూ.140 కోట్ల గ్రాస్ తో 'ఆదిపురుష్' నాలుగో స్థానంలో నిలిచింది. రూ.126 కోట్ల గ్రాస్ తో 'సాహో' ఐదో స్థానంలో ఉంది. ఇలా ప్రభాస్ నటించిన మూడు సినిమాలు 'బాహుబలి-2', 'ఆదిపురుష్', 'సాహో' ఫస్ట్ డే కలెక్షన్స్ పరంగా టాప్-5 ఇండియన్ సినిమాల లిస్టులో నిలిచాయి.
'ఆదిపురుష్' మొదటి రోజు రూ.140 కోట్ల గ్రాస్ రాబట్టడం ప్యూర్ ప్రభాస్ బాక్సాఫీస్ స్టామినా అంటూ ఫ్యాన్స్ సంబరపడుతున్నారు. తెలుగు రాష్ట్రాల్లో దాదాపు రూ.50 కోట్ల గ్రాస్ రాబట్టిన 'ఆదిపురుష్', హిందీలో కూడా అదేస్థాయిలో దాదాపు రూ.45 కోట్ల గ్రాస్ తో సత్తా చాటింది. ఓ సౌత్ హీరో సినిమాకి హిందీలో ఈ స్థాయి ఓపెనింగ్స్ రావడం నిజంగా విశేషమే. సినిమాకి డివైడ్ టాక్ వచ్చినప్పటికీ హిందీలో రెండో రోజు, మూడో రోజు అడ్వాన్స్ బుకింగ్స్ రికార్డు స్థాయిలో ఉన్నాయి. ఫుల్ రన్ లో తెలుగు వసూళ్లను హిందీ వసూళ్లు మించిపోయినా ఆశ్చర్యంలేదు. 'బాహుబలి-2' తర్వాత ప్రభాస్ నటించిన 'సాహో' హిందీలో ఘన విజయం సాధించింది. 'రాధేశ్యామ్' నిరాశపరిచినప్పటికీ మరోసారి 'ఆదిపురుష్'తో సత్తా చాటారు. సౌత్, నార్త్ అనే తేడా లేకుండా 'ఆదిపురుష్'కి రికార్డు స్థాయి ఓపెనింగ్స్ రావడం చూసి, అసలుసిసలు పాన్ ఇండియా స్టార్ ప్రభాసే అనే కామెంట్స్ వినిపిస్తున్నాయి.