English | Telugu
పెద్ద ప్లానే ఇది.. ఎన్టీఆర్ టార్గెట్ పాన్ వరల్డ్!
Updated : Apr 13, 2023
'ఆర్ఆర్ఆర్'తో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న జూనియర్ ఎన్టీఆర్ ఆ తర్వాత తన 30వ సినిమాని మొదలు పెట్టడానికి చాలా సమయం తీసుకున్నాడు. దీంతో ఎన్టీఆర్ తన ప్రైమ్ టైంని వేస్ట్ చేసుకుంటున్నాడని అటు ఆయన అభిమానులతో పాటు సినీ ప్రియులు కూడా అభిప్రాయపడ్డారు. అయితే ఆ ఆలస్యం వెనక పెద్ద పెద్ద ఆలోచనలు ఉన్నాయని తెలిసి ఇప్పుడు అందరూ ఆశ్చర్యపోతున్నారు.
మొన్నటిదాకా అసలు ఎన్టీఆర్ కొత్త సినిమా ఎప్పుడు మొదలవుతుందా అని అందరూ ఎదురుచూశారు. కానీ ఇప్పుడు ఎన్టీఆర్ మళ్ళీ కొత్తగా ఏం సర్ ప్రైజ్ ఇస్తాడా అని ఎదురుచూస్తున్నారు. ఓ వైపు 'ఎన్టీఆర్ 30' షూటింగ్ మొదలు పెట్టాడు. మరోవైపు బాలీవుడ్ మూవీ 'వార్-2'లో ఎన్టీఆర్ నటించనున్నాడనే న్యూస్ రావడంతో అందరూ ఆశ్చర్యపోయారు. ఇక ఇప్పుడు అంతకుమించిన సర్ ప్రైజ్ ఇచ్చాడు.
బుధవారం సాయంత్రం హైదరాబాద్ లోని తన నివాసంలో సినీ సెలబ్రిటీలకు ఎన్టీఆర్ పెద్ద పార్టీ ఇచ్చాడు. ఆ పార్టీకి అమెజాన్ స్టూడియోస్ ఇంటర్నేషనల్ వైస్ ప్రెసిడెంట్ జేమ్స్ ఫరెల్ హాజరు కావడం విశేషం. దీంతో ఎన్టీఆర్ ఆలోచనలు గ్లోబల్ రేంజ్ లో ఉన్నాయనే అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. ఇదే ఫ్లోలో ఎన్టీఆర్, అమెజాన్ స్టూడియోస్ తో హాలీవుడ్ ప్రాజెక్ట్ ప్రకటించినా ఆశ్చర్యంలేదు అంటున్నారు.
మరోవైపు ఈ పార్టీకి టాలీవుడ్ కి చెందిన పలువురు దర్శకనిర్మాతలు కూడా హాజరయ్యారు. వారిలో దర్శకులు రాజమౌళి, కొరటాల శివ, త్రివిక్రమ్, నిర్మాతలు శోభు యార్లగడ్డ, నవీన్ యెర్నేని, వై.రవిశంకర్, నాగవంశీ, స్వప్నదత్ తదితరులు ఉన్నారు. దర్శకుడు సుకుమార్, నిర్మాత దిల్ రాజుకి ఆహ్వానం అందినా.. వారు హైదరాబాద్ లేకపోవడంతో హాజరుకాలేకపోయారని సమాచారం.
ఇక ఈ పార్టీలో త్రివిక్రమ్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. నిజానికి ఎన్టీఆర్ తన 30వ సినిమాని త్రివిక్రమ్ దర్శకత్వంలో చేయాల్సి ఉంది. కానీ ఏవో కారణాల వల్ల ఆ ప్రాజెక్ట్ కి బ్రేక్ పడింది. అయితే ఇటీవల నాగవంశీ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. ఎన్టీఆర్-త్రివిక్రమ్ కాంబోలో సినిమా ఖచ్చితంగా ఉంటుందని, పాన్ వరల్డ్ రేంజ్ లో ప్లాన్ చేస్తున్నామని చెప్పాడు. ఇప్పుడు ఎన్టీఆర్ హోస్ట్ చేసిన పార్టీకి త్రివిక్రమ్, నాగవంశీ హాజరు కావడం చూస్తుంటే.. ప్రస్తుతం ఎన్టీఆర్ చేతిలో ఉన్న సినిమాలు పూర్తయ్యాక ఈ భారీ ప్రాజెక్ట్ దిశగా అడుగులు పడతాయి అనిపిస్తోంది.