English | Telugu
ఎన్టీఆర్ సినిమాల బడ్జెట్ 1200 కోట్లు.. షేక్ అవుతున్న ఇండస్ట్రీ!
Updated : Nov 25, 2023
ఈమధ్యకాలంలో స్టార్ హీరోల సినిమాలకు బడ్జెట్ ఒక్కసారిగా పెరిగిపోయింది. ఏ స్టార్ హీరో సినిమా చూసినా వందల కోట్లు బడ్జెట్ అంటున్నారు. ఇప్పటివరకు ఎన్టీఆర్ సినిమాల బడ్జెట్ ఓ రేంజ్ వరకు ఉండేది. ఇప్పుడు ఎన్టీఆర్ సినిమాలకు కూడా బడ్జెట్‌ను భారీగా పెంచేస్తున్నారు. ఎందుకంటే ‘ఆర్‌ఆర్‌ఆర్’ సినిమా తర్వాత గ్లోబల్ స్టార్ ఇమేజ్‌ను సంపాదించుకున్న ఎన్టీఆర్‌తో భారీ బడ్జెట్ సినిమాలు నిర్మించేందుకు నిర్మాతలు ఆసక్తి చూపిస్తున్నారు. ప్రస్తుతం ఎన్టీఆర్, కొరటాల శివ కాంబినేషన్‌లో ‘దేవర’ చిత్రం రూపొందుతున్న విషయం తెలిసిందే. ఫిక్షన్ సబ్జెక్ట్‌తో పీరియాడిక్ మూవీగా తెరకెక్కుతున్న ఈ సినిమాను రెండు భాగాలుగా విడుదల చేస్తామని కొరటాల శివ గతంలోనే ప్రకటించారు. 300 కోట్ల రూపాయల భారీ బడ్జెట్‌తో ఈ సినిమా రూపొందుతోంది. ఇప్పటివరకు ఎన్టీఆర్ చేసిన సినిమాల్లో ఇదే భారీ బడ్జెట్ సినిమా కావడం విశేషం.
‘దేవర’ తర్వాత ఎన్టీఆర్ చేయబోయే సినిమా ‘వార్2’. హృతిక్ రోషన్, ఎన్టీఆర్ కాంబినేషన్‌లో రూపొందుతున్న మల్టీస్టారర్ ఇది. ఈ సినిమా షూటింగ్ ఆల్రెడీ స్టార్ట్ అయ్యింది. ఈ సినిమాలో ఎన్టీఆర్ నెగెటివ్ షేడ్స్ ఉన్న క్యారెక్టర్ చెయ్యబోతున్నారని తెలుస్తోంది. ఆర్‌ఆర్‌ఆర్‌లో తన నట విశ్వరూపాన్ని చూపించిన ఎన్టీఆర్ ‘వార్2’లో తన పెర్‌ఫార్మెన్స్‌తో డెఫినెట్‌గా బాలీవుడ్‌లో జెండా పాతే అవకాశం ఉంది. ఈ సినిమా ఎప్పుడు స్టార్ట్ అవుతుందా, ఎప్పుడు రిలీజ్ అవుతుందా అని ఎన్టీఆర్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ సినిమా 500 కోట్ల రూపాయల భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. యష్‌రాజ్ ఫిలింస్ బేనర్‌పై ఆదిత్య చోప్రా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ‘బ్రహ్మాస్త్ర’ చిత్రాన్ని మూడు భాగాలుగా రూపొందిస్తున్న అయాన్ ముఖర్జీ ‘వార్ 2’ చిత్రాన్ని డైరెక్ట్ చేస్తున్నారు. గత సంవత్సరం ‘బ్రహ్మాస్త్ర’ విడుదలైన విషయం తెలిసిందే. ‘వార్ 2’ పూర్తయిన తర్వాత మిగతా రెండు భాగాలను తెరకెక్కిస్తాడు అయాన్. హృతిక్ రోషన్, ఎన్టీఆర్ వంటి స్టార్ హీరోలతో సినిమా కావడంతో ఎంతో ప్రెస్టీజియస్‌గా తీసుకున్న అయాన్ ‘వార్ 2’ను ఒక విజువల్ వండర్‌గా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తున్నాడు. ఈ సినిమా తర్వాత ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో మైత్రి మూవీ మేకర్స్ నిర్మించే భారీ చిత్రంలో జాయిన్ అవుతాడు ఎన్టీఆర్. ఈ సినిమాను 400 కోట్ల రూపాయల భారీ బడ్జెట్‌తో నిర్మించనున్నారు. ఇది కూడా రెండు భాగాలుగా నిర్మించేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి.
‘దేవర’, ‘వార్ 2’, ప్రశాంత్ నీల్ సినిమా.. ఈ మూడు సినిమాల బడ్జెట్ మొత్తం 1200 కోట్ల రూపాయలు అవుతోంది. ఒక్కసారిగా ఇమేజ్ పెరిగిపోయి గ్లోబల్ స్టార్‌గా ఇండస్ట్రీని షేక్ చేస్తున్న ఎన్టీఆర్ బడ్జెట్ పరంగా కూడా అందరికీ షాక్ ఇస్తున్నాడు. ఈ భారీ బడ్జెట్స్ చూస్తుంటే ప్రభాస్ తర్వాత ఎన్టీఆర్‌కే ఆ ఘనత దక్కిందని అభిమానులు ఆనందంగా చెబుతున్నారు. కథల ఎంపిక విషయంలో ఆచి తూచి అడుగేస్తున్న ఎన్టీఆర్ భవిష్యత్తులో హీరోగా కొత్త రికార్డులు సృష్టిస్తాడని, బాలీవుడ్‌లోనూ చక్రం తిప్పుతాడని ఎన్టీఆర్ అభిమానులు ఎంతో కాన్ఫిడెంట్‌గా ఉన్నారు.