English | Telugu
తెలుగు హెరిటేజ్ డేగా ఎన్టీఆర్ శతజయంతి.. అమెరికన్ నగర మేయర్ కీలక ప్రకటన
Updated : May 14, 2023
తెలుగు వారంతా గర్వించే ఒక అరుదైన ఘట్టం చోటు చేసుకుంది. ఆంధ్రుల ఆరాధ్య దైవం శ్రీ నందమూరి తారక రామారావు శతజయంతి ఉత్సవాలను ఆయన కుటుంబ సభ్యులు అభిమానులు పెద్ద ఎత్తున జరుపుకుంటున్న నేపథ్యంలో అమెరికాలోని టెక్సాస్ రాష్ట్రంలోని ఫ్రిస్కో నగర మేయర్ ఒక కీలకమైన ప్రకటన చేశారు.
తెలుగు ప్రజలందరూ అన్నగారిగా భావించి గౌరవించే శ్రీ నందమూరి తారకరామారావు పుట్టిన మే 28వ తేదీని ప్రిస్కో నగర తెలుగు హెరిటేజ్ డే గా ఆ నగర మేయర్ జెఫ్ చేనీ ప్రకటించారు. ఈ మేరకు ఒక ప్రెస్ నోట్ కూడా విడుదల చేశారు. ఎన్టీఆర్ స్ఫూర్తితో తెలుగు ప్రజలందరూ ముందుకు వెళుతున్నారని, ఆయన శతజయంతి ఉత్సవాలను అత్యంత ఘనంగా జరుపుకుంటున్న నేపథ్యంలో తమ తరఫున ఆయనకు గౌరవార్థంగా ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లుగా ప్రెస్ నోట్లో పేర్కొన్నారు.
ఎక్కడో అమెరికాలో ఒక నగర మేయర్ ఈ మేరకు తెలుగు జాతి గుండెల్లో పెట్టుకున్న మహానుభావుడికి గౌరవార్థంగా తెలుగు హెరిటేజ్ డే గా ఆయన జయంతిని ప్రకటించడం తెలుగు వారందరికీ గర్వకారణం.