Read more!

English | Telugu

'భగవంత్ లాల్ కేసరి'గా బాలకృష్ణ!

నటసింహం నందమూరి బాలకృష్ణ తన 108వ సినిమాని అనిల్ రావిపూడి దర్శకత్వంలో చేస్తున్న సంగతి తెలిసిందే. షైన్ స్క్రీన్స్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో కాజల్ అగర్వాల్, శ్రీలీల ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు. ఈ సినిమా దసరా కానుకగా అక్టోబర్ లో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్ కి ప్రేక్షకుల నుంచి మంచి స్పందన లభించింది. ఇదిలా ఉంటే ఈ సినిమాలో బాలకృష్ణ 'భగవంత్ లాల్ కేసరి' అనే పవర్ ఫుల్ పాత్రలో కనిపించనున్నట్లు న్యూస్ వినిపిస్తోంది. అంతేకాదు ఈ సినిమాకి ఆయన పాత్ర పేరునే టైటిల్ గా నిర్ణయించినట్లు సమాచారం.

'అఖండ', 'వీరసింహారెడ్డి' వంటి వరుస విజయాలతో బాలకృష్ణ ఫుల్ జోష్ లో ఉన్నారు. ఇప్పుడు రావిపూడి దర్శకత్వంలో చేస్తున్న 'NBK 108'తో హ్యాట్రిక్ కొట్టడం ఖాయమని ఫ్యాన్స్ నమ్ముతున్నారు. తెలంగాణ నేపథ్యంలో రూపొందుతోన్న ఈ చిత్రంలో బాలకృష్ణ తెలంగాణ యాసలో మాట్లాడనుండటం విశేషం. మాములుగా తన సినిమాల్లో వినోదం ఎక్కువ ఉండేలా చూసుకునే రావిపూడి.. ఈ సినిమాలో మాత్రం బాలయ్య పాత్రని పవర్ ఫుల్ గా చూపించడంపై ఎక్కువ దృష్టి పెట్టినట్లు తెలుస్తోంది. బాలయ్య పోషిస్తున్న పాత్రని శక్తివంతంగా మలచడంపై, పాత్ర పేరు, గెటప్ పై ఎక్కువ శ్రద్ధ పెట్టిన అనిల్.. 'భగవంత్ లాల్ కేసరి' అనే పవర్ ఫుల్ పేరుని బాలయ్య పాత్రకి పెట్టి, దానినే టైటిల్ గా కూడా నిర్ణయించినట్లు వినికిడి. మొత్తానికి ఈ సినిమాతో అనిల్ రావిపూడి తనలోని అసలుసిసలు మాస్ యాంగిల్ బయటకు తీసేలా ఉన్నాడు.

జూన్ 10న బాలకృష్ణ పుట్టినరోజు సందర్భంగా 'NBK 108' టైటిల్ రివీల్ చేయడంతో పాటు, గ్లింప్స్ విడుదల చేయనున్నారట. మరి ఈ సినిమాకి నిజంగానే 'భగవంత్ లాల్ కేసరి' అనే టైటిల్ ఖరారు చేశారా లేదా అనేది త్వరలో తేలిపోనుంది.