English | Telugu
రజినీకాంత్ సినిమాలో నేచురల్ స్టార్..!
Updated : Aug 5, 2023
సూపర్‌స్టార్ రజినీకాంత్ స్పీడుగా సినిమాలను సెట్స్ పైకి తీసుకెళుతున్నారు. ఇప్పటికే ఆయన జైలర్ సినిమా ఆగస్ట్ 10న రిలీజ్ కావటానికి రెడీ అయ్యింది. మరో వైపు కుమార్తె ఐశ్వర్య దర్శకత్వంలో రూపొందుతోన్న లాల్ సలాం చిత్రంలో ఆయన కీలక పాత్రలో నటించారు. ఆయన పాత్రకు సంబంధించిన చిత్రీకరణంతా పూర్తయ్యింది. ఇప్పుడు జై భీమ్ ఫేమ్ టి.జె.జ్ఞానవేల్ దర్శకత్వంలో రజినీకాంత్ ఓ సినిమా చేస్తున్నారు. త్వరలోనే ప్రారంభం కాబోయే ఈ సినిమాకు మేకర్స్ పాన్ ఇండియా లుక్ తీసుకొస్తున్నారు. ఎందుకంటే ఇప్పటికే ఈ సినిమాలో అమితాబ్ బచ్చన్ కీలక పాత్రలో నటిస్తోన్న సంగతి తెలిసిందే. తాజాగా ఇప్పుడు మరో స్టార్ హీరో కూడా ఈ మూవీలో భాగం కాబోతున్నారని సమాచారం.
ఇంతకీ ఒక వైపు సూపర్ స్టార్ రజినీకాంత్, మరో వైపు బిగ్ బి అమితాబ్ బచ్చన్ నటిస్తోన్న ఈ సినిమాలో భాగం అవుతున్న స్టార్ హీరో ఎవరో కాదు.. టాలీవుడ్‌కి చెందిన నేచురల్ స్టార్ నాని. రీసెంట్‌గానే డైరెక్టర్ జ్ఞానవేల్ చెప్పిన నెరేషన్‌కు నాని ఓకే చెప్పినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అయితే నాని ఎలాంటి పాత్రలో కనిపిస్తారనేది అందరిలోనూ ఆసక్తిని రేపుతోన్న అంశమనే చెప్పాలి. అంతే కాకుండా మలయాళ స్టార్ ఫహాద్ ఫాజిల్, మంజు వారియర్ కూడా ఈ సినిమాలో నటిస్తారని వార్తలు వినిపిస్తున్నాయి. ఫేక్ ఎన్‌కౌంటర్స్‌కు వ్యతిరేకంగా ఓ రిటైర్డ్ పోలీస్ ఆఫీసర్ చేసిన పోరాటమే ఈ సినిమా అని టాక్. ఇది రజినీకాంత్ 170వ సినిమా.
మరో వైపు జైలర్ సినిమాతో తలైవర్ ఆగస్ట్ 10న సందడి చేయబోతున్నారు. ఈ సినిమాకు నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకుడు. ఇందులో యాక్షన్ ఎలిమెంట్స్ పీక్స్‌లో ఉంటాయని రీసెంట్‌గా వచ్చిన ట్రైలర్‌తోనే అర్థమవుతుంది.