English | Telugu
'హాయ్ నాన్న' సినిమా ఎవరూ కొనలేదు.. నాని చేసిన పనికి టాలీవుడ్ షాక్!
Updated : Dec 5, 2023
ఒక హీరో నటించిన సినిమా బ్లాక్ బస్టర్ అయితే, అతని తదుపరి సినిమాపై అందరి దృష్టి పడి, భారీ బిజినెస్ జరగడం సహజం. కానీ నేచురల్ స్టార్ నాని విషయంలో అందుకు భిన్నంగా జరిగింది. నాని గత చిత్రం 'దసరా' బ్లాక్ బస్టర్ గా నిలిచింది. అయినప్పటికీ అతని తాజా చిత్రం 'హాయ్ నాన్న' థియేట్రికల్ బిజినెస్ జరగలేదట. ఈ క్రమంలో నాని చేసిన ఓ పని ఇండస్ట్రీ వర్గాలను ఆశ్చర్యానికి గురి చేసింది.
మాస్ సినిమాల మాదిరిగా క్లాస్ సినిమాలు బాక్సాఫీస్ దగ్గర వసూళ్ల వర్షం కురిపించిన సందర్భాలు చాలా తక్కువగా ఉంటాయి. నాని నటించిన పలు క్లాస్ సినిమాలు ప్రేక్షకులను మెప్పించినప్పటికీ, బాక్సాఫీస్ దగ్గర భారీ వసూళ్లతో సంచలనాలు సృష్టించలేదు. మరోవైపు 'ఎంసీఏ', 'నేను లోకల్' వంటి రెగ్యులర్ కమర్షియల్ సినిమాలు మాత్రం భారీ వసూళ్లతో సత్తా చాటాయి. ఇక నాని గత చిత్రం 'దసరా' పూర్తి మాస్ మూవీ. నాని అసలైన మాస్ అవతార్ ని చూపించిన ఈ సినిమాపై మొదటి నుంచి మంచి అంచనాలున్నాయి. అందుకు తగ్గట్టుగానే ఈ మూవీ రూ.110 కోట్లకు పైగా గ్రాస్ రాబట్టి, నాని కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది. అయితే 'హాయ్ నాన్న' సినిమా పరిస్థితి అందుకు పూర్తి భిన్నం.
'హాయ్ నాన్న' అనేది పక్కా క్లాస్ సినిమా. హిట్ టాక్ వస్తే ఫ్యామిలీ ఆడియన్స్ క్యూ కడతారేమో కానీ.. మొదటిరోజే యూత్, మాస్ ఆడియన్స్ ఎగబడిపోయి భారీ ఓపెనింగ్స్ వచ్చే పరిస్థితి ఉండదు. అందుకే బ్లాక్ బస్టర్ సినిమా తర్వాత వస్తున్నప్పటికీ డిస్ట్రిబ్యూటర్లు వెనకడుగు వేశారట. నాని లాంటి హీరోల సినిమాల రైట్స్ తీసుకోవడానికి మామూలుగా అయితే డిస్ట్రిబ్యూటర్లు పోటీ పడే పరిస్థితి ఉంటుంది. కానీ 'దసరా' వసూళ్లను దృష్టిలో పెట్టుకొని, తమ 'హాయ్ నాన్న' క్లాస్ సినిమా అనే విషయాన్ని మరిచి నిర్మాతలు భారీ ధరలు చెప్పి ఉంటారని, అందుకే డిస్ట్రిబ్యూటర్లు వెనకడుగు వేసి ఉంటారనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఏది ఏమైనా 'హాయ్ నాన్న' థియేట్రికల్ బిజినెస్ విషయంలో నాని తీసుకున్న ఓ నిర్ణయం మాత్రం ప్రశంసలు అందుకుంటోంది.
'హాయ్ నాన్న' సినిమాతో వైర ఎంటర్‌టైన్‌మెంట్స్ అనే బ్యానర్ చిత్ర నిర్మాణ రంగంలోకి అడుగుపెడుతోంది. వాళ్ళు కొత్త నిర్మాతలు కావడంతో, బిజినెస్ విషయంలో వారికి నష్టం కలిగించకూడదని భావించిన నాని.. తన రెమ్యునరేషన్ కి బదులుగా థియేట్రికల్ రైట్స్ తీసుకోవడానికి ముందుకి వచ్చాడట. నాని నిర్ణయంతో నిర్మాతలు సేఫ్ జోన్ లోకి వెళ్లారు. సినిమా విడుదల తర్వాత వచ్చే వసూళ్లు, నాని రెమ్యునరేషన్ ని డిసైడ్ చేస్తాయి. మొత్తానికి కొత్త నిర్మాతల కోసం నాని తీసుకున్న నిర్ణయం ప్రస్తుతం టాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారింది. నాని నిర్ణయం పట్ల పలువురు నిర్మాతలు ప్రశంసలు కురిపిస్తున్నారని సమాచారం.