English | Telugu
ఎన్టీఆర్ ఓకే అన్నాడు.. నాని నో చెప్పాడు!
Updated : Aug 17, 2023
ఈ జనరేషన్ లో నెగిటివ్ రోల్స్ పోషించి మెప్పించిన అతి కొద్దిమంది హీరోలలో జూనియర్ ఎన్టీఆర్, నాని ఉన్నారు. 'జై లవ కుశ'లో రావణ్(జై)గా ఎన్టీఆర్ నటనను అంత తేలికగా మరిచిపోలేము. హీరోగానే కాదు పూర్తిస్థాయి విలన్ గానూ మెప్పించగలడని నిరూపించారు. అంతేకాదు ఇప్పుడు బాలీవుడ్ లోకి కూడా నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్రతోనే ఎంట్రీ ఇస్తున్నారు. హృతిక్ రోషన్ తో కలిసి ఎన్టీఆర్ 'వార్-2' చిత్రంలో నటించనున్న సంగతి తెలిసిందే. ఇందులో ఎన్టీఆర్ ది నెగిటివ్ షేడ్స్ ఉన్న పవర్ ఫుల్ రోల్ అని అంటున్నారు. ఎన్టీఆర్ బిగ్ స్టార్ అయినప్పటికీ, 'ఆర్ఆర్ఆర్'తో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్నప్పటికీ.. బాలీవుడ్ స్టార్ సినిమాలో నెగటివ్ షేడ్స్ ఉన్న పాత్ర చేయడానికి ఏమాత్రం వెనకాడకుండా ఓకే చెప్పారు. కానీ నాని మాత్రం దిగ్గజాలు నటిస్తున్న సినిమాలో నెగటివ్ రోల్ చేసే అవకాశమొస్తే నో చెప్పారని తెలుస్తోంది.
'జై భీమ్' ఫేమ్ టి.జె.జ్ఞానవేల్ దర్శకత్వంలో సూపర్ స్టార్ రజినీకాంత్ ఓ సినిమా చేస్తున్నారు. ఇందులో బిగ్ బి అమితాబ్ బచ్చన్ కూడా నటిస్తుండటం విశేషం. అయితే ఈ సినిమాలో నెగటివ్ షేడ్స్ ఉన్న ఓ రోల్ కోసం నానిని సంప్రదించగా ఆయన రిజెక్ట్ చేశారట. 'జెంటిల్ మేన్', 'వి' సినిమాలలో నెగటివ్ పాత్రలు పోషించి మెప్పించారు నాని. అలాంటిది రజినీకాంత్, అమితాబ్ వంటి దిగ్గజాలు కలిసి నటిస్తున్న సినిమాలో నెగటివ్ రోల్ చేసే అవకాశమొస్తే రిజెక్ట్ చేయడం ఆసక్తికరంగా మారింది. ఆ దిగ్గజాల నడుమ తన పాత్ర తేలిపోతుంది అనుకున్నారో లేక ఇప్పుడిప్పుడే స్టార్ గా ఎదుగుతున్న తాను ఇలాంటి పాత్రలు చేయడం వల్ల కెరీర్ పై ప్రభావం చూపుతుందని అనుకున్నారో కానీ నాని నిర్ణయం ఆశ్చర్యం కలిగిస్తోంది. నాని నో చెప్పడంతోనే రజినీకాంత్, అమితాబ్ తో స్క్రీన్ షేర్ చేసుకునే అవకాశం శర్వానంద్ ని వరించిందని వినికిడి.