English | Telugu
నానికి పోటీగా ధమ్కీ అంటున్నాడు!
Updated : Feb 22, 2023
వెళ్ళిపోమాకే చిత్రంతో నటునిగా పరిచయమై ఈ నగరానికి ఏమైంది చిత్రంలో కాస్త గుర్తింపు తెచ్చుకున్న నటుడు విశ్వక్సేన్. 2019లో ఈయన నటించిన ఫలక్‌నుమాదాస్ విడుదల అయింది. ఈ చిత్రానికి సహనిర్మాత, రచయిత, దర్శకుడు అతనే. ఆ తర్వాత హిట్ సినిమాతో మరో హిట్ అందుకున్నారు. పాగల్, అశోకవనంలో అర్జున కళ్యాణం వంటి చిత్రాలు చేశారు. ఇవి మంచి విజయాన్ని సాధించాయి. తాజాగా ఆయన దాస్ కి థమ్కీ అనే చిత్రం స్వీయ దర్శకనిర్మాణంలో రూపొందుతోంది. ఈ చిత్రానికి హీరో, దర్శకుడు, నిర్మాత అన్ని విశ్వక్సేనే. ఇలా యంగ్ హీరోలలో విశ్వక్సేన్ వరుస సినిమాలతో దూసుకుపోతున్నారు. సినిమా సినిమాకి వేరియన్స్ చూపిస్తున్నారు. ప్రస్తుతం మూడు నాలుగు సినిమాల్లో బిజీగా ఉన్నారు. దాస్ కి దమ్కీ చిత్రంతో పాన్ ఇండియా మార్కెట్ పై కన్నేశాడు.
తెలుగుతో సహా తమిళ, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో ఈ చిత్రం విడుదల కానుంది. వాస్తవానికి ఈ చిత్రాన్ని ఫిబ్రవరి 17న విడుదల చేయాలని భావించారు. కానీ పోటీ మరీ ఎక్కువగా ఉండటంతో వాయిదా వేశారు. వచ్చే నెల మార్చి చివర్‌లో రిలీజ్ చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారట. అయితే మార్చి 30కి నాని దసరా మూవీ భారీ స్థాయిలో రానుంది. దీనిపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. ఇదే జరిగితే దసరాతో దమ్కీ చిత్రం పోటీ పడటం ఖాయంగా కనిపిస్తోంది. దసరా ముందు ధమ్కీ చిత్రం నిలవగలదా? అనేది ఆసక్తికరంగా మారింది. ఈ సినిమాలో నివేదా పేతురాజ్ హీరోయిన్‌గా నటించింది. ఫస్ట్ లుక్, ట్రైలర్ పాజిటివ్ బజ్ ని క్రియేట్ చేశాయి. మరి ఈ సినిమాతో విశ్వక్సేన్ ఎలాంటి హిట్టు కొడతాడో వేచిచూడాలి.