English | Telugu
40 ఏళ్ళుగా ఉన్న అపవాదు నుంచి టాలీవుడ్ బయట పడుతుందా..?
Updated : Nov 20, 2023
ఒక సినిమా ఘవిజయం సాధించాలంటే భారీ బడ్జెట్, భారీ యాక్షన్ సీక్వెన్స్‌లు, హై రేంజ్ హీరో ఎలివేషన్స్.. ఇవేవీ ముఖ్యం కాదు. పాత కథే అయినా కథనంలో కొత్తదనం ఉండాలి, క్యారెక్టరైజేషన్స్ డిఫరెంట్‌గా ఉండాలి. రెండున్నర గంటల సేపు ప్రేక్షకులు తల తిప్పకుండా సినిమాలో లీనమయ్యే సన్నివేశాలుండాలి. చక్కని టెక్నికల్ వేల్యూస్‌తో ప్రేక్షకుల్ని థ్రిల్ చేయాలి. మంచి బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్‌తో ఆడియన్స్‌కి మధురమైన అనుభూతిని కలిగించాలి. ఇవన్నీ సక్రమంగా జరిగితేనే సినిమాపై దర్శకనిర్మాతల హోప్స్ పెరుగుతాయి. ప్రేక్షకులు సినిమాకి బ్రహ్మరథం పడతారు. ఇటీవల కొన్ని సినిమాల విషయంలో అదే జరిగింది. అనూహ్యంగా ఘనవిజయం సాధించిన చిన్న సినిమాలు కూడా ఉన్నాయి.
ఇన్ని అద్భుతాలు ఒకే సినిమాలో ఉండాలంటే అది సామాన్యమైన విషయం కాదు. దర్శకుడికి ఎంతో విజన్ ఉంటే తప్ప వీటిన్నింనినీ తెరపై చూపించడం సాధ్యపడదు. కొత్తతరం దర్శకుల్లో కూడా అంతటి విజన్ వున్నవారు లేకపోలేదు. అయితే అనుభవానికి సినిమా రంగంలో ఎంతో ప్రాధాన్యం ఉంటుంది. అంతకుముందు అలాంటి సబ్జెక్ట్‌ని హ్యాండిల్ చేసిన సందర్భాలు ఉన్నాయా? ఒకవేళ ఉంటే అందులో ఎంతవరకు సక్సెస్ అయ్యాడు? బడ్జెట్‌ని ఎలా కంట్రోల్ చేశాడు? రిలీజ్ తర్వాత ఆ సినిమా ఎంత కలెక్ట్ చేసింది.. వంటి అంశాలను పరిగణనలోకి తీసుకొని ఇలాంటి భారీ సినిమాలు చేసేందుకు అవకాశం ఇస్తారు నిర్మాతలు.
ఒకప్పుడు వినోదం అంటే సినిమా ఒక్కటే కాబట్టి హీరోలు, దర్శకులు, నిర్మాతలు ఏ సినిమా చేసినా చెల్లింది. కథ విషయంలో కేర్ తీసుకుంటే చాలు. ఆ తర్వాత సినిమాని హీరోలు ముందుకు తీసుకెళ్ళిపోయేవారు. రిపీట్ రన్‌తో ఆ సినిమాలు ఘనవిజయం సాధించేవి, సిల్వర్ జూబ్లీలు ఆడేవి. కానీ, ఇప్పుడా పరిస్థితి లేదు. ప్రేక్షకులు థియేటర్స్ రావడం తగ్గించెయ్యడంతో వారిని ఎలాగైనా రప్పించాలని దర్శకులు చేస్తున్న జిమ్మిక్కులు మామూలుగా ఉండడం లేదు. ఫలానా సినిమాను ఓటీటీలో కంటే థియేటర్‌లో పెద్ద స్క్రీన్ మీదే చూడాలి అని ప్రేక్షకులకు అనిపించేలా అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారు. అలాంటి కేర్ తీసుకుంటున్నప్పటికీ కొన్ని సినిమాలు బాక్సాఫీస్ వద్ద బోల్తా కొడుతూనే ఉన్నాయి.
దేశవ్యాప్తంగా ఎక్కువ థియేటర్లు ఉన్నది మన తెలుగు రాష్ట్రాల్లోనే. అంతేకాదు సినిమా అభిమానులు కూడా తెలుగువారిలోనే ఎక్కువ మంది ఉన్నారు. దానికి ఉదాహరణే.. దేశవ్యాప్తంగా నిర్మాణమయ్యే సినిమాల్లో ఎక్కువ శాతం తెలుగులోనే ఉంటాయి. ఈ లెక్క ఇప్పటిది కాదు, గత 40 ఏళ్ళుగా సినిమాల నిర్మాణంలో టాలీవుడ్ నెంబర్ వన్‌గా నిలుస్తూనే ఉంది. అయితే ఈ నలభై ఏళ్ళలో సక్సెస్ రేట్ చూసుకుంటే చాలా తక్కువనే చెప్పాలి. సక్సెస్ రేట్ పెరగకపోయినా, సినిమాల సంఖ్య మాత్రం తగ్గడం లేదు. కొన్ని ఇతర భాషా చిత్రాలను తీసుకుంటే వాటి సంఖ్య తక్కువే అయినప్పటికీ సక్సెస్ రేట్ ఎక్కువగా ఉంటుంది. ఈ ప్రస్తావన గతంలో చాలాసార్లు వచ్చింది. మన సక్సెస్ రేట్‌ను పెంచేందుకు ఎంతో మంది దర్శకులు కృషి చేశారు. కొంతవరకు సక్సెస్ అవ్వగలిగారు. కొత్త తరహా కథలు, విభిన్నమైన కాన్సెప్ట్స్‌తో సినిమాలు చేస్తుండడం వల్లే ఇప్పుడు బాహుబలి వంటి సిరీస్ టాలీవుడ్‌లో వచ్చింది. ఈ నలభై ఏళ్ళలో కంటెంట్ పరంగా, టెక్నికల్‌గా ఎన్నో మార్పులు రావడం వల్ల మూసధోరణితో ఉండే కథలకు దర్శకనిర్మాతలు స్వస్తి పలికారు.
సినిమా నిర్మాణంలో ఎన్నో మార్పులు వచ్చినా, టెక్నికల్‌గా ఎంతో పురోగతి సాధించినా కథల ఎంపిక విషయంలో దర్శకులు తప్పులు చేస్తున్నారనే విమర్శ ఇప్పటికీ ఉంది. అయితే దాని నుంచి బయట పడేందుకు దర్శకులు కృషి చేస్తున్నారు. ఇప్పటికే తెలుగు సినిమా కీర్తిని ప్రపంచవ్యాప్తంగా చాటి చెప్పడంలో మన దర్శకులు సక్సెస్ అయ్యారు. సినిమాల నిర్మాణం ఎక్కువగానే ఉన్నా సక్సెస్ రేటు మాత్రం పెరగడం లేదు అనే అపవాదు నుంచి టాలీవుడ్ ఎప్పుడు బయట పడుతుందో.. ఆ దిశగా దర్శకులు ఎంత కృషి చేస్తారో చూడాలి.