English | Telugu
ఓటీటీ ఆడియన్స్‌కి ఇక పండగే.. అందుబాటులో 30 సినిమాలు, వెబ్‌సిరీస్‌లు!
Updated : Jan 31, 2026
ప్రతి వారం థియేటర్లలో రిలీజ్ అయ్యే సినిమాల కంటే ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లో స్ట్రీమింగ్‌లోకి వచ్చే సినిమాలు, వెబ్ సిరీస్ సంఖ్య ఎక్కువ. ఈమధ్యకాలంలో థియేటర్స్‌లో విడుదలైన కొన్ని రోజులకే భారీ సినిమాలు సైతం ఓటీటీలో ప్రత్యక్షమవుతున్నాయి. ఒక వర్గం ప్రేక్షకులు థియేటర్లలో సినిమా చూసే కంటే ఓటీటీలో చూడడం బెటర్ అనే అభిప్రాయంతో ఉంటున్నారు. అందుకే ఓటీటీకి ఈ మధ్యకాలంలో మంచి క్రేజ్ వచ్చింది. థియేటర్లలో విడుదలయ్యే సినిమాల కోసం ఎంత ఆసక్తిగా ప్రేక్షకులు ఎదురుచూస్తారో అలాగే ఓటీటీల్లోని సినిమాల కోసం అంతే ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు ప్రేక్షకులు.
ఈవారం ఓటీటీలో రిలీజ్ అయ్యే సినిమాలు, వెబ్ సిరీస్‌లు దాదాపు 30 వరకు ఉన్నాయి. అయితే అందులో ఆడియన్స్‌ని థ్రిల్ చేసే, ఎంటర్‌టైన్ చేసే సినిమాలు ఎక్కువ శాతం ఉన్నట్టు కనిపిస్తోంది. డిసెంబర్ 5న విడుదలైన రణవీర్ సింగ్ కొత్త సినిమా ‘దురంధర్’ బ్లాక్‌బస్టర్ హిట్‌గా నిలిచింది. దాదాపు 500 కోట్ల బడ్జెట్‌తో నిర్మించిన ఈ సినిమా 1350 కోట్లు కలెక్ట్ చేసి రికార్డు క్రియేట్ చేసింది. ఈ చిత్రం ఇప్ప్పుడు ఓటీటీలోకి వచ్చేసింది. హిందీతోపాటు తెలుగు, తమిళ భాషల్లో నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమ్ అవుతోంది.
భూమి పెడ్నేకర్ ప్రధాన పాత్రలో నటిస్తున్న క్రైమ్ థ్రిల్లర్ సిరీస్ ‘దల్ దల్’. అమిత్‌రాజ్ గుప్తా దర్శకత్వం వహించిన ఈ సిరీస్ అమెజాన్ ప్రైమ్‌లో హిందీతోపాటు తెలుగులోనూ స్ట్రీమింగ్ అవుతోంది. నివిన్ పౌలీ కీలక పాత్రలో రూపొందిన హారర్ కామెడీ చిత్రం ‘సర్వం మాయ’. అఖిల్ సత్యన్ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని అందుకుంది. ఇప్పుడు జియో హాట్‌స్టార్ వేదికగా మలయాళంతో పాటు తెలుగులోనూ స్ట్రీమింగ్ అవుతోంది.
రోషన్ హీరోగా రూపొందిన పీరియాడిక్ యాక్షన్ మూవీ ‘ఛాంపియన్’. డిసెంబరులో థియేటర్లలో విడుదలై సందడి చేసిన ఈ సినిమా ప్రస్తుతం నెట్‌ఫ్లిక్స్‌లో అందుబాటుతో ఉంది. కార్తి, కృతిశెట్టి జంటగా నటించిన ‘వా వాతియార్’ చిత్రం సంక్రాంతి కానుకగా తమిళ్‌లో విడుదలై ఆశించిన ఫలితాన్ని అందుకోలేకపోయింది. ఇప్ప్పుడీ సినిమా అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమ్ అవుతోంది. తెలుగు, హిందీ, మలయాళం, కన్నడ, తమిళ భాషల్లో ఈ సినిమాను చూడొచ్చు. వరుణ్ సందేశ్ హీరోగా నటించిన క్రైమ్ థ్రిల్లర్ ‘కానిస్టేబుల్’ ఈటీవీ విన్‌లోకి వచ్చేసింది. ఆర్యన్ సుభాస్ ఎస్కే తెరకెక్కించిన ఈ చిత్రంలో మధులిక వారణాసి హీరోయిన్. తెలుగు, హిందీ, ఇంగ్లీష్, జపనీస్, ఇండోనేషియన్, కన్నడ భాషలకు చెందిన దాదాపు 30 సినిమాలు, వెబ్‌సిరీస్‌లు ఇప్ప్పుడు ఓటీటీలో అందుబాటులో ఉన్నాయి. ఇక ఓటీటీ ప్రేక్షకులకు ఈ వారం పండగనే చెప్పాలి.