English | Telugu

అమరావతికి ఆహ్వానం మూవీ టీజర్ విడుద‌ల‌.. ఫిబ్రవరి 13 మూవీ రిలీజ్


శివ కంఠమనేని, ధ‌న్య బాల‌కృష్ణ‌, ఎస్తేర్, సుప్రిత, హ‌రీష్ ప్ర‌ధాన తారాగణంగా తెరకెక్కిన సినిమా "అమరావతికి ఆహ్వానం". సీనియ‌ర్ న‌టులు అశోక్ కుమార్‌, భ‌ద్ర‌మ్‌, జెమిని సురేష్, నాగేంద్ర ప్రసాద్ ఇతర కీల‌క‌ పాత్ర‌లు పోషించారు. జీవీకే దర్శకుడు. ప్ర‌ముఖ నిర్మాత ముప్పా వెంక‌య్య చౌద‌రి గారి నిర్మాణ సార‌థ్యంలో జి. రాంబాబు యాద‌వ్ స‌మ‌ర్పణ‌లో లైట్ హౌస్ సినీ మ్యాజిక్ బేన‌ర్‌పై కేఎస్ శంక‌ర్‌రావు, ఆర్ వెంక‌టేశ్వ‌ర రావు నిర్మించారు. నిన్న శుక్రవారం హైదరాబాద్ లో టీజర్ ని ప్రఖ్యాత నటులు,నిర్మాత మురళీ మోహన్ గారు రిలీజ్ చేశారు.

ఈ సంద‌ర్భంగా ఏర్పాటు చేసిన కార్య‌క్ర‌మంలో నటుడు అశోక్ కుమార్ మాట్లాడుతూ - ''నిర్మాత వెంకటేశ్వరరావు గారు మా బావగారు. ఆయన అడగటంతో ఈ సినిమాలో నటించాను. సినిమాలో నటిస్తున్నప్పుడు తెలియలేదు గానీ ఇప్పుడు స్క్రీన్ మీద చూస్తుంటే కంటెంట్ చాలా బాగుందని అనిపిస్తోంది.అన్నివర్గాల ప్రేక్షకులకు కనెక్ట్ అయ్యేలా డైరెక్టర్ జీవీకేగారు రూపొందించారు. 'అమరావతికి ఆహ్వానం" సినిమా మా టీమ్ అందరికీ విజయాన్ని అందించాలి'' అన్నారు.

నటుడు జెమినీ సురేష్ మాట్లాడుతూ - "అమరావతికి ఆహ్వానం" చిత్రంలో నేను ఫ‌స్ట్‌టైమ్‌ ఒక‌ పిచ్చివాడి క్యారెక్టర్ లో చేశాను. ఆ క్యారెక్టర్ మీకు బాగా నచ్చుతుంది. ఫ్యామిలీ మూవీస్, ఎంటర్ టైన్ మెంట్ మూవీస్, హారర్ మూవీస్..ఈ మూడు జానర్ మూవీస్ కు ఎప్పుడూ ప్రేక్షకుల ఆదరణ ఉంటుంది. మా "అమరావతికి ఆహ్వానం" సినిమాను కూడా మీరంతా సక్సెస్ చేస్తారని ఆశిస్తున్నాం'' అన్నారు.

నిర్మాత ప్రసన్నకుమార్ మాట్లాడుతూ - "అమరావతికి ఆహ్వానం" టీజర్ చాలా బాగుంది. కచ్చితంగా ప్రేక్షకుల్ని అలరిస్తుంది. టీమ్ అందరికీ ఆల్ ది బెస్ట్ '' అన్నారు.

ప్రముఖ నటులు -నిర్మాత మురళీ మోహన్ మాట్లాడుతూ - "అమరావతికి ఆహ్వానం" టీజర్ చాలా బాగుంది. కంటెంట్ చూస్తుంటే తప్పకుండా విజయం సాధిస్తుందని నమ్మకం కలుగుతోంది. ఈ నిర్మాతలు గతంలో కూడా చిన్న బడ్జెట్ లో మంచి చిత్రాలు చేశారు. మా గురువు గారు దాసరి గారు చెప్పినట్లు చిన్న చిత్రాలే ఇండస్ట్రీకి ప్రాణం. కొత్త దర్శకుడిగైనా జీవీకే ప్రతిభావంతంగా సినిమాను చక్కగా తెరకెక్కించారు. టీజర్ తోనే భయం కలిగించారు. ఈ చిత్ర నిర్మాతలు వెంకటేశ్వరరావు గారు, శంకర్ రావు గారితో నాకు చాలాకాలంగా స్నేహం ఉంది. వాళ్లు మా రియల్ ఎస్టేట్ రంగానికి చెందినవారు. గతంలో తెలుగు సినిమా అంటే తెలుగు వారికి మాత్రమే పరిమితమయ్యేది. ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఆదరణ పొందడం సంతోషంగా ఉంది. "అమరావతికి ఆహ్వానం" సినిమా మంచి విజయం సాధించాలని కోరుకుంటున్నాను'' అన్నారు.

ప్రొడ్యూసర్ వెంకటేశ్వరరావు మాట్లాడుతూ - ''మాకు సినిమా ఇండస్ట్రీతో 30 ఏళ్లకు పైగా అనుబంధం ఉంది. సినిమాలు చేయాలంటే డబ్బులు కావాలని రియల్ ఎస్టేట్ మార్గాన్ని ఎంచుకున్నాం. అప్పుడే మురళీమోహన్ గారితో పరిచయం ఏర్పడింది. ఆయన రాష్ట్ర రియల్ ఎస్టేట్ అసోసియేషన్ కు ప్రెసిడెంట్ గా పనిచేశారు. రియల్ ఎస్టేట్ లో సంపాదనతో చిన్న బడ్జెట్ లో సినిమాలు చేద్దామని ముందుకొచ్చాం. మా సంస్థలో "అమరావతికి ఆహ్వానంష‌ ఆరవ సినిమా. మేము నిర్మించిన గత చిత్రాలన్నీ థియేట్రికల్ గానే రిలీజ్ చేశాం. భోజ్ పూరిలో ఒక సినిమా చేసి అక్కడ విడుదల చేశాం. హారర్ జానర్ లో అందరికీ నచ్చేలా మా సినిమాను నిర్మించాం. ఫిబ్రవరి 13న గ్రాండ్ రిలీజ్ చేస్తున్నాం. మీ అందరి సపోర్ట్ మా మూవీకి ఉంటుందని నమ్ముతున్నాం'' అన్నారు.

హీరోయిన్ ఎస్తేర్ మాట్లాడుతూ - "అమరావతికి ఆహ్వానం" సినిమా టీజర్ చూస్తున్నప్పుడు అందులోని యాక్టర్స్ అంతా నిజంగానే ఒక ఫ్యామిలీ కావొచ్చనే ఫీలింగ్ మీకు ఎలా కలిగిందో షూటింగ్ చేసేప్పుడు మా యూనిట్ అందరం ఒక ఫ్యామిలీ అనే భావన మా అందరిలో కలిగింది. అంతమంచి వాతావరణంలో పనిచేసిన మా అందరికీ ఇలాంటి మేకర్స్ కు సక్సెస్ రావాలనే అనిపిస్తుంది కదా. ఈ సినిమా మా ప్రొడ్యూసర్స్ కు సక్సెస్, డబ్బును తీసుకురావాలని కోరుకుంటున్నా. మా డైరెక్టర్ కు సినిమా మీదున్న ప్యాషన్, ఆయన స్క్రిప్ట్ నెరేట్ చేసేప్పుడే తెలిసింది. హారర్ ఎలిమెంట్స్ తో పాటు మీకు నచ్చే అన్ని కమర్షియల్ అంశాలతో ఈ సినిమా ఆకట్టుకుంటుంది'' అన్నారు.

డైరెక్టర్ జీవీకే మాట్లాడుతూ - ''ప్రొడ్యూసర్ శంకర్ రావు గారి ప్రోత్సాహంతో ఈ సినిమాను రూపొందించాను. ఆయన మేము గతంలో ఓ మూవీ చేసినప్పుడు నేను ప్రొడ్యూస్ చేస్తాను నువ్వు కథ రెడీ చేసుకో అన్నారు. అలా ఈ ప్రాజెక్ట్ మొదలైంది. అనుకున్న బడ్జెట్ లో అనుకున్న షెడ్యూల్స్ ప్రకారం ప్లాన్డ్ గా ఈ సినిమా చేసుకుంటూ వచ్చాం. వీఎఫ్ఎక్స్ దగ్గరే మాకు కొంచెం డిలే అయ్యింది. ఈ సినిమాలో నటించిన ప్రతి ఒక్కరూ ఎంతో సపోర్ట్ చేశారు. ఈ సినిమా నిర్మాతలకు, యూనిట్‌ సభ్యులకు, సపోర్ట్‌ చేసిన అందరికీ ధన్యవాదాలు.. ప్రేక్షకులు ఫలానా సినిమానే చూడాలని ఫిక్స్ అయి ఉండరు. వాళ్లకు కంటెంట్ నచ్చితే ఏ సినిమా అయినా చూస్తారు. మా మూవీ మంచి కంటెంట్ తో వస్తోంది. మా సినిమాకు మీ అంద‌రి సపోర్ట్ ఉండాలని కోరుకుంటున్నా'' అన్నారు.

హీరో శివ కంఠమనేని మాట్లాడుతూ - ''మేము కలిసి గతంలో 'అక్కడొకడుంటాడు, మధురపూడి గ్రామం అనే నేను, రాఘవరెడ్డి, బిగ్ బ్రదర్' వంటి మూవీస్ చేశాం. ఇప్పుడు "అమరావతికి ఆహ్వానం" చిత్రంతో మీ ముందుకు వస్తున్నాం. ఈ మధ్య మెగాస్టార్ చిరంజీవి గారు అన్నట్లు సినిమా అనుకున్న బడ్జెట్ లో చేయడమే సగం సక్సెస్. అలా మా సినిమాను కూడా డైరెక్టర్ జీవీకే ఎక్కడా వృథా లేకుండా అనుకున్న బడ్జెట్ లో ఇన్ టైమ్ లో కంప్లీట్ చేశాడు. మా సినిమాలో ఎస్తేర్, ధన్య, సుప్రియ దెయ్యాల పాత్రల్లో భయపెడతారు. ఎస్తేర్ పెర్ఫార్మెన్స్‌ మంచి హైలైట్ అవుతుంది. సంక్రాంతికి వచ్చిన సినిమాలు ఎలా సక్సెస్ అయ్యాయో, అలాగే ఫిబ్రవరి ఫస్ట్ వీక్ లో వచ్చే సినిమాలు, మాతో పాటు 13న రిలీజ్ అయ్యే సినిమాలన్నీ విజయం సాధించాలని కోరుకుంటున్నా'' అన్నారు.

ఈ కార్య‌క్ర‌మంలో న‌టులు శివ హ‌రీష్‌, భ‌ద్ర‌మ్‌, సినిమాటోగ్రాఫ‌ర్ జె.ప్ర‌భాక‌ర్ రెడ్డి, సంగీత ద‌ర్శ‌కులు ప‌ద్మ‌నాబ్‌ భ‌రద్వాజ్‌, నిర్మాతలు ఘంటా శ్రీనివాస్, తెలుగు వన్ అధినేత ర‌విశంక‌ర్ కంఠంనేని, కొమ్మ‌ల‌పాటి సాయి సుధాక‌ర్‌, సీనియ‌ర్ జ‌ర్న‌లిస్ట్ ప్ర‌భు, ప‌ర్వ‌త‌నేని రాంబాబు, సురేష్ కొండేటి తదితరులు పాల్గొని ప్ర‌సంగించారు. ఫిబ్రవరి 13న ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.