English | Telugu

జ‌న‌వ‌రి రివ్యూః భారీ అంచనాలు.. భారీ నష్టాలు. సంక్రాంతి సినిమాలకు తప్పని తిప్పలు!

సంక్రాంతి పండగ అనేది తెలుగు సినిమాలకు ఎంతో ప్రత్యేకమైనది. మిగతా పండగలకు కూడా సినిమాలు రిలీజ్ అవుతాయి. అయితే ఈ పండగకు తమ సినిమాలు రిలీజ్ చేసుకోవాలని టాప్ హీరోలందరూ భావిస్తారు. గత కొన్ని దశాబ్దాలుగా ఇది ఒక ఆనవాయితీగా మారింది. అంతేకాదు, సంక్రాంతి సీజన్‌లో తమ సినిమాలను రిలీజ్ చేస్తే కలెక్షన్ల పరంగా కూడా మంచి రిజల్ట్ ఉంటుందని భావిస్తారు దర్శకనిర్మాతలు. అయితే సంక్రాంతి సీజన్‌కి గతంలో ఉన్న వైభవం ఇప్ప్పుడు కనిపించడం లేదు అనిపిస్తోంది.

గత మూడు సంవత్సరాలుగా సంక్రాంతికి భారీ అంచనాల మధ్య విడుదలైన సినిమాలు భారీ నష్టాల్ని చవిచూస్తూ ప్రేక్షకుల్ని, అభిమానుల్ని నిరాశపరుస్తున్నాయి. 2024లో గుంటూరు కారం, 2025లో గేమ్ ఛేంజర్, 2026లో రాజాసాబ్ సినిమాలు సంక్రాంతికి భారీ అంచనాల మధ్య విడుదలై విజయాలు అందుకోలేకపోయాయి. ఈ ఏడాది రాజాసాబ్‌ని పక్కన పెడితే మూడు సినిమాలు పండగకు సందడి చేశాయి. ఆ మూడు సినిమాలూ కమర్షియల్‌గా సక్సెస్ అయ్యాయి.

జనవరి మొదటి వారంలో వనవీర, సైక్ సిద్దార్థ్, 45, గులాబీ వంటి సినిమాలు రిలీజ్ అయినా ప్రేక్షకుల్ని ఆకట్టుకోలేకపోయాయి. రీరిలీజ్‌గా వచ్చిన నువ్వు నాకు నచ్చావ్ కొన్ని చోట్ల బాగానే నడిచింది. జనవరి 9 నుంచి సంక్రాంతి సినిమాల సందడి మొదలైంది. భారీ బడ్జెట్‌తో, భారీ అంచనాల మధ్య విడుదలైన రాజా సాబ్ మొదటి షో నుంచే ఫ్లాప్ టాక్ తెచ్చుకుంది. ఏ వర్గం ప్రేక్షకుల్నీ ఈ సినిమా ఆకట్టుకోలేకపోయింది. టోటల్‌గా డిస్ట్రిబ్యూటర్లకు భారీ నష్టాన్ని తెచ్చిపెట్టింది.

జనవరి 12న మెగాస్టార్ చిరంజీవి, అనిల్ రావిపూడి కాంబినేషన్‌లో రూపొందిన మన శంకర వరప్రసాద్‌గారు అన్ని ఏరియాల్లో సూపర్‌హిట్ టాక్ తెచ్చుకుంది. ఓవర్సీస్‌లో కూడా ఈ సినిమాకు మంచి రెస్పాన్స్ వచ్చింది. దాదాపు 4.5 మిలియన్ డాలర్లు వసూలు చేసింది. ఈ సంక్రాంతికి మెగాస్టార్‌ని విజేతగా నిలబెట్టిన సినిమా మన శంకరవరప్రసాద్‌గారు.

జనవరి 13న రవితేజ హీరోగా రూపొందిన భర్త మహాశయులకు విజ్ఞప్తి విడుదలైంది. ఆశించిన స్థాయి విజయం సాధించకపోయినా ఇటీవలి కాలంలో రవితేజ చేసిన డిజాస్టర్స్ కంటే ఈ సినిమా కాస్త ఫర్వాలేదు అనే టాక్ తెచ్చుకుంది. అయితే కలెక్షన్ల పరంగా చిరంజీవి సినిమా వల్ల రవితేజ సినిమాకి నష్టం జరిగింది. సంక్రాంతి సీజన్‌లో కాకుండా మరో డేట్‌కి రిలీజ్ చేసి ఉంటే బెటర్ సినిమా అయ్యేదని ట్రేడ్‌వర్గాలు అభిప్రాయపడ్డాయి.

ఆ తర్వాత నవీన్ పొలిశెట్టి హీరోగా రూపొందిన అనగనగా ఒకరాజు సినిమా రిలీజ్ సంక్రాంతి పోటీలో మరో హిట్ సినిమాగా నిలిచింది. అన్ని ఏరియాల్లోనూ ఈ సినిమా సక్సెస్ అయింది. ఓవర్సీస్‌లో ఆశించిన స్థాయి విజయం సాధించకపోయినా బ్రేక్ ఈవెన్ అయింది. అలా జరగడానికి ముఖ్య కారణం సినిమాకి బడ్జెట్ పెరిగిపోవడం. అలాంటి సబ్జెక్ట్‌ని మినిమం బడ్జెట్‌తో చేసి ఉంటే లాభాలు ఎక్కువగా కనిపించేవి. కానీ, హీరోయిన్‌ను మార్చడం, రీషూట్స్ చేయడం వంటి వాటివల్ల బడ్జెట్ పెరిగింది. అందుకే లాభాý శాతం తగ్గింది.

ఇక శర్వానంద్ హీరోగా వచ్చిన నారీ నారీ నడుమ మురారి సినిమా పరిస్థితి కూడా అదే. అప్పటికే రాజాసాబ్, మన శంకరవరప్రసాద్‌గారు చిత్రాలకు భారీ థియేటర్లు కేటాయించారు. అనగనగా ఒక రాజు చిత్రం కూడా సూపర్‌హిట్ టాక్‌తో రన్ అవుతోంది. దీంతో శర్వానంద్ సినిమాకి థియేటర్లు కరువయ్యాయి. అందులోనూ ఈ సినిమాకి ఎక్కువ బజ్ లేకపోవడం వల్ల తక్కువ థియేటర్లలో రిలీజ్ అయి రోజురోజుకీ థియేటర్ల సంఖ్య పెంచుకుంటూ హిట్ సినిమాగా మారింది.

సంక్రాంతికి రిలీజ్ అయిన సినిమాలు జనవరి చివరి వారం వరకు రన్ అయ్యాయి. చివరి వారం తరుణ్ భాస్కర్ హీరోగా రూపొందిన ఓం శాంతి శాంతి శాంతి చిత్రంతోపాటు మరో రెండు సినిమాలు రిలీజ్ అయాయి. అయితే ఈ సినిమాలు ప్రేక్షకుల్ని మెప్పించలేకపోయాయి. టో{ల్‌గా చూస్తే మన శంకరవరప్రసాద్‌గారు చిత్రం బ్లాక్‌బస్టర్ అవ్వగా అనగనగా ఒకరాజు, నారీ నారీ నడుమ మురారి హిట్ సినిమాలు అనిపించుకున్నాయి. అన్నింటినీ మించి రాజాసాబ్ మాత్రం భారీ పరాజయాన్ని చవిచూడాల్సి వచ్చింది.