English | Telugu

మోస‌గాళ్ల‌కు మోస‌గాడు రివ్యూ

పులిని చూసి న‌క్క‌వాత పెట్టుకోవ‌డం అన్న‌ది పాత సామెత‌. కానీ తెలుగు సినిమా వాళ్లు మాత్రం.. ఈ సామెత ప‌దే ప‌దే గుర్తు చేస్తుంటారు. ఓ జోన‌ర్‌లో సినిమా హిట్ట‌యితే.. మ‌ళ్లీ అదే జోన‌ర్‌లో అవే కొల‌త‌ల‌తో సినిమాలు దింపేస్తుంటారు. స్వామి రారాతో మ‌నోళ్లంతా క్రైమ్ కామెడీపై ప‌డ్డారు. ఈ జాబితాలో ఇప్ప‌టి వ‌ర‌కూ ఓ పాతిక సినిమాలైనా వ‌చ్చుంటాయ్‌. కానీ.. అందులో స్వామి రారాలా మెప్పించిన‌వి మాత్రం లేవు. స్వామి రారా 2 అని చెప్పుకొంటూ.. ఇప్పుడు మోస‌గాళ్ల‌కు మోస‌గాడు సినిమా వ‌చ్చింది. స్వామి రారా నిర్మాత‌లే ఈ సినిమానీ తీయ‌డం వ‌ల్ల‌... ఇది స్వామి రారా 2 అయిపోయింంతే. అంతే త‌ప్ప‌.. క‌థ‌, క‌థ‌నాల్లో... న‌టీన‌టుల్లో స్వామి రారాతో ఎలాంటి పోలిక‌లూ లేవు. ఆఖ‌రికి ఫ‌లితంతో స‌హా. మ‌రింత‌కీ ఈ మోస‌గాడేంచేశాడు, వాడి క‌థంటీ? తెలుసుకొందాం రండి.

క్రిష్ (సుధీర్‌బాబు) చిన్నచిన్న మోసాలు చేసుకొంటూ బ‌తికేస్తుంటాడు. ఎలాగైనా ఓ జాక్‌పాట్ కొట్టేసి లైఫ్‌లో సెటిలైపోదామ‌న్న‌ది క్రిష్ పాల‌సీ. మాస్టారు (చంద్ర‌మోహ‌న్‌) ఓ అనాథాశ్ర‌మాన్ని నిర్వ‌హిస్తుంటాడు. ఆయ‌న మంచిత‌నానికి మారు పేరు. మంచి గెలుస్తుందా, చెడు గెలుస్తుందా అన్న పాయింటుపై క్రిష్‌కీ మాస్టారుకీ ఎప్పుడూ వాదోప‌వాద‌న‌లు జ‌రుగుతుంటాయి. మ‌రోవైపు... అయోధ్య‌లోని రామ‌మందిరంలో సీతారాముల విగ్ర‌హాలు మాయ‌మ‌వుతాయి. ఈ విగ్ర‌హాల‌కు ఎంతో గొప్ప చ‌రిత్ర ఉంది. ల‌క్ష‌ల కోట్లు విలువ చేసే ఈ విగ్ర‌హాలు చేతులు మారుతూ మారుతూ హైద‌రాబాద్ చేర‌తాయి. ఈ విగ్ర‌హాలు ప‌ట్టుకొచ్చే డీల్‌.. క్రిష్ చేతికి చిక్కుతుంది. అప్ప‌టికే క్రిష్ జాన‌కి (నందిని) ప్రేమ‌లో మునిగిపోతాడు. నందిని ప‌ద్ధ‌తైన అమ్మాయి. తాను పెళ్లి చేసుకోవాల‌నుకొనే అబ్బాయికి స‌వాల‌క్ష క్వాలిటీలు ఉండాల‌నుకొంటుంది. అయితే తాను కూడా.. క్రిష్ ప్రేమ‌లో ప‌డిపోతుంది. `నీ కోసం నా అల‌వాట్ల‌న్నీ మానేస్తా` అని క్రిష్ కూడా మాటిస్తాడు. కానీ విగ్ర‌హాల డీల్ మాత్రం ఒప్పుకొంటాడు. మ‌రింత‌కీ ఈ విగ్ర‌హాలు క్రిష్ చేతికి చిక్కాయా? లేదా? ఈ విగ్ర‌హాల కోసం వెదుకుతున్న పోలీసులు, డాన్‌లూ త‌న ప్ర‌య‌త్నంలో ఎంత వ‌ర‌కూ విజ‌య‌వంత‌మ‌య్యారు? చివ‌రికి ఈ విగ్రహాల క‌థ ఏమైంది? అనేది తెర‌పై చూడాలి.

క‌థ ఇలా సింపుల్‌గా చెప్పేశాం గానీ, ఇందులో పాత్ర‌లూ, ఉప‌క‌థ‌లూ చాలా ఉన్నాయి. అవ‌న్నీ బిట్లు బిట్లుగా వ‌స్తూ.. ఈ క‌థాగ‌మ‌నాన్ని అడ్డుక‌ట్ట వేసేస్తుంటాయి. అవి కూడా ప‌క్క‌న పెట్టేద్దాం. స్వామి రారా, మోస‌గాళ్ల‌కు మోసగాడు ప‌క్క ప‌క్క‌న పెట్టుకొని చూస్తే.. న‌క్క‌కీ నాగ‌లోకానికీ ఉన్నంత తేడా ఉంది. క్రైమ్ కామెడీలో.. క్రైమ్ కంటే, కామెడీ కంటే థ్రిల్లింగ్ కే ఎక్కువ ప్రాముఖ్యం ఇవ్వాలి. త‌ర‌వాత ఏమ‌వుతుంది? అన్న ఉత్కంఠ‌త‌ను రేకెత్తించాలి. ఓ విగ్ర‌హం చుట్టూ నాలుగైదు ముఠాలు తిరుగుతుంటే... ఆ మాల్ చేతులు మారుతుండాలి. అప్పుడే క‌థ‌లో మజా వ‌స్తుంది. అయితే అదేం ఈ సినిమాలో క‌నిపించ‌లేదు. ఇంట్ర‌వెల్ త‌ర‌వాత సీన్లోనే విగ్ర‌హాలు విల‌న్ చేతికి చిక్కుతాయి. ఆ త‌ర‌వాత మ‌ధ్య‌లో కొన్ని సిల్లీ సీన్లు వేసుకొని క‌థ‌ని క్లైమాక్స్‌కి తీసుకొచ్చేశారు. ఇంట్ర‌వెల్ ముందైనా క‌థ‌లో ఆస‌క్తి ఉందా అంటే అదీ లేదు. ఏదో హీరో... హీరోయిన్ వెంట‌ప‌డుతుంటాడు. ఓ పాటేసుకొంటాడు. రోడ్డు ప‌క్క‌న కూర్చుని టీ తాగుతూ జీవితం గురించి క‌ల‌లుకంటుంటాడు. అంతే. అంత‌కు మించి పొడిచేసిందేం లేదు. ప‌తాక స‌న్నివేశాలైనా ఆసక్తిగా ఉన్నాయా అంటే అదీ లేదు. హీరోని మంచివాడిగా ముద్ర వేయ‌డానికి అనాథాశ్ర‌మం కోస‌మే ఇంత పెద్ద దొంగ‌త‌నం చేస్తున్న‌ట్టు బిల్డ‌ప్ ఇచ్చి.. లేని హీరోయిజాన్ని ఆపాదించి పాడేశారు.

సినిమా మొద‌లైన‌ప్ప‌టి నుంచీ అయిపోయేంత వ‌ర‌కూ ఓకే కంటిన్యుటీలో సాగ‌దు. హీరోక‌థ ఒక‌టి, అనాథాశ్ర‌మం క‌థ ఒక‌టి, విల‌న్ క‌థొక‌టి, పోలీస్ క‌థొక‌టి... ఇలా బిట్లు బిట్లుగా చూపిస్తాడు. తొలిసీన్లో అరివీర‌భ‌యంక‌రంగా చూపించిన విల‌న్‌ని మ‌ధ్య‌లో బ‌కారాగా మార్చేస్తాడు. విల‌న్ ఇంట్లో హీరో తిష్ట వేసుకోవ‌డం అనే ఫార్ములా ఆఖ‌రికి ఇలా క్రైమ్ కామెడీలోనూ దింపేశారు. నిజానికి ఈ సినిమాలో హీరోయిజం ఏ కొశానా చూపించలేదు. ఆమాట‌కొస్తే... సుధీర్‌బాబు కూడా చేసిందేం లేదు. మ‌హా అయితే సినిమా మొత్త‌మ్మీద గంట‌సేపు క‌నిపిస్తాడేమో..?

సుధీర్‌బాబుకి ఇది చెప్పుకోద‌గిన సినిమా కాదు. అత‌ని డైలాగ్ డెలివ‌రీ మేన‌రిజాలూ ఏదోలా ఉన్నాయి. నందినిలో హీరోయిన్ ల‌క్ష‌ణాలు బహుత‌క్కువ‌గా ఉన్నాయి. అభిమ‌న్యుసింగ్ ఒక్కోసీన్‌లో ఒక్కోలా న‌టించాడు. జ‌య‌ప్ర‌కాష్ రెడ్డి, దువ్వాసి మోహ‌న్ న‌వ్వించడానికి ప్రయ‌త్నించారంతే. చివ‌ర్లో ఎంట్రీ ఇచ్చిన స‌ప్త‌గిరి అల‌వాటు ప్ర‌కారం ఇకార‌మైన కామెడీ చేశాడు. సాంకేతికంగా చెప్పుకోవ‌డానికి కెమెరా ప‌నిత‌నం ఒక్క‌టే న‌చ్చుతుంది. రెండు పాట‌లు బాగున్నాయి. నేప‌థ్య సంగీతంలోనూ మెచ్చుకోద‌గిన ప్ర‌తిభేం క‌న‌బ‌ర్చ‌లేదు. ఎడిటింగ్ లోపాలు బోలెడ‌న్ని ఉన్నాయి.

ఓ సినిమాని చూసి స్ఫూర్తి తెచ్చుకొని.. మ‌రో సినిమా తీయ‌డం త‌ప్పేం కాదు. కాక‌పోతే.. ఆ సినిమా ఎందుకు ఆడింది? అందులో ఉన్న విష‌యం ఎంత‌? ఇవ‌న్నీ బేరీజు వేసుకోవాలి. క్రైమ్ కామెడీ అని.. ఏది ప‌డితే అది తీసేస్తే.. అది స్వామి రారా సినిమా అవ్వ‌దు.

జనవరి 4 నుంచే మన శంకర వరప్రసాద్ హంగామా.. వెల్లడి చేసిన మేకర్స్ 

సిల్వర్ స్క్రీన్ పై అడుగుపెడుతున్న 'మన శంకర వరప్రసాద్ గారు'(Mana Shankara Varaprasad Garu)ద్వారా మెగా ప్రవాహాన్ని ఎప్పుడెప్పుడు చూస్తామా అనే ఆశతో అభిమానులతో పాటు మూవీ లవర్స్, ప్రేక్షకులు ఉన్నారు. పైగా ఈ సారి  మెగాస్టార్ కి విక్టరీ కి యాడ్ కావడంతో వాళ్ల ఆశల రేంజ్ ని దేనితోను కంపార్ చేయలేని పరిస్థితి. . దీంతో ఎగ్జైట్మెంట్ ని  ఆపుకొని ఉండటం ఇద్దరి అభిమానులకి  కొంచం కష్టంగా ఉన్నా రాబోయే మెగా విక్టరీ హుంగామా ని ఊహించుకుంటు  జనవరి 12 కోసం రీగర్ గా  వెయిట్ చేస్తున్నారు. కానీ ఇప్పుడు ఆ ఆనందం ఎనిమిది రోజులు ముందుగానే రాబోతుంది. .

చీరకి, స్కర్ట్స్ కి తేడా ఇదే.. రోహిణి ఎవర్ని టార్గెట్ చేసిందో తెలుసా!

సుదీర్ఘ సినీ చరిత్ర కలిగిన నటి రోహిణి. అచ్చ తెలుగింటి ఆడపడుచు అయిన రోహిణి 1974 లో బాలనటిగా సినీ రంగ ప్రవేశం చేసి దక్షిణ భారతీయ సినీ పరిశ్రమకి చెందిన    ఎంతో మంది లెజండ్రీ యాక్టర్స్ తో స్క్రీన్ ని షేర్ చేసుకుంది. హీరోయిన్ గా,క్యారక్టర్ ఆర్టిస్ట్ గా, స్క్రీన్ రైటర్ గా, డబ్బింగ్ కళాకారిణిగా చాలా బలమైన ఐడెంటిటీ ఆమె సొంతం. నన్ను కన్నది తెలుగు తల్లి అయితే, పెంచింది తమిళ తల్లి అని ఎలాంటి దాపరికాలు లేకుండా చెప్పే రోహిణి రీసెంట్ గా ఒక కార్యక్రమంలో పాల్గొంది. ఈ సందర్భంగా ఆమె ఆడవాళ్ళ గురించి మాట్లాడిన మాటలు వైరల్ గా నిలిచాయి.

సైక్ సిద్ధార్ధ ఫస్ట్ డే కలెక్షన్స్ ఇవేనా! పగ వాడికి కూడా ఆ బాధ రాకూడదు

శ్రీ నందు(Shree Nandu)చాలా గ్యాప్ తర్వాత సోలో హీరోగా తన అదృష్టాన్ని పరీక్షించుకుంటు 2026 కి వెల్ కమ్ చెప్తు నిన్న 'సైక్ సిద్దార్ధ'(Psych Siddhartha)తో సిల్వర్ స్క్రీన్ పై ల్యాండ్ అయ్యాడు. పక్కా రొమాంటిక్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కగా బాగానే ఉందనే టాక్ ని సొంతం చేసుకుంది.  రివ్యూస్ కూడా అదే స్థాయిలో వస్తున్నాయి. పైగా సింగల్ స్క్రీన్స్ తో సహా మల్టి ప్లెక్స్ లో టికెట్ రేట్స్ ని భారీగా తగ్గించారు. దీంతో అందరి చూపు సైక్ సిద్దార్ధ వైపు పడిందనే టాక్ సినీ సర్కిల్స్ లో వినిపిస్తుంది. మరి మొదటి రోజు ఏ మేర కలెక్షన్స్ ని రాబట్టిందో చూద్దాం.