English | Telugu
కిరణ్ అబ్బవరం మాస్ 'మీటర్'.. తొక్కుకుంటూ పోవడమే!
Updated : Mar 7, 2023
ఇటీవల 'వినరో భాగ్యము విష్ణు కథ'తో ఆకట్టుకున్న యువ హీరో కిరణ్ అబ్బవరం త్వరలో మరో చిత్రంతో అలరించడానికి సిద్ధమవుతున్నాడు. అదే 'మీటర్'. మైత్రి మూవీ మేకర్స్, క్లాప్ ఎంటర్టైన్మెంట్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి రమేష్ కాడూరి దర్శకుడు. ఈ సినిమా ఏప్రిల్ 7న ప్రేక్షకుల ముందుకు రానుంది. తాజాగా ఈ మూవీ టీజర్ ను విడుదల చేశారు మేకర్స్.
ఈరోజు విడుదలైన 'మీటర్' టీజర్ చూస్తుంటే సినిమా పక్కా మాస్ మీటర్ లో ఉండబోతుందని అర్థమవుతోంది. ఇందులో కిరణ్ బాధ్యతలేని పోలీస్ గా కనిపిస్తున్నాడు. రొమాన్స్, కామెడీ, యాక్షన్ ఎలిమెంట్స్ తో పర్ఫెక్ట్ కమర్షియల్ ప్యాకేజ్ లా టీజర్ ఉంది. బిగ్ స్టార్స్ తరహాలో కిరణ్ భారీ ఫైట్స్ చేస్తున్నాడు. "బ్లాస్ట్ అయిపోడానికి ఇది పవర్ తో నడిచే మాములు మీటర్ అనుకుంటున్నావా.. పొగరుతో నడిచే మాస్ మీటర్. ఆన్ అవ్వడమే వంద మీద ఉంటది. తొక్కుకుంటూ పోవడమే" అంటూ పవర్ ఫుల్ డైలాగ్స్ తో కూడా అలరించాడు కిరణ్.
'సెబాస్టియన్', 'సమ్మతమే', 'నేను మీకు బాగా కావాల్సిన వాడిని' వంటి వరుస పరాజయాల తర్వాత 'వినరో భాగ్యము విష్ణు కథ' కిరణ్ కి కాస్త ఊరటనిచ్చింది. ఈ చిత్రం బ్రేక్ ఈవెన్ సాధించి హిట్ స్టేటస్ దక్కించుకుంది. మరి ఇప్పుడు పక్కా కమర్షియల్ ఫిల్మ్ లా వస్తున్న 'మీటర్'తో ఎలాంటి ఫలితాన్ని అందుకుంటాడో చూడాలి.