English | Telugu

క్రికెటర్‌ తిలక్‌వర్మను సన్మానించిన మెగాస్టార్‌ చిరంజీవి!

ఇటీవల జరిగిన ఆసియా కప్‌ ఫైనల్‌లో పాకిస్తాన్‌పై భారత్‌ ఘనవిజయం సాధించిన విషయం తెలిసిందే. ఈ విజయంలో కీలక పాత్ర పోషించిన ఇండియన్‌ క్రికెటర్‌ తిలక్‌వర్మను మెగాస్టార్‌ చిరంజీవి ఘనంగా సత్కరించారు. అనిల్‌ రావిపూడి కాంబినేషన్‌లో చేస్తున్న ‘మన శంకరవరప్రసాద్‌గారు’ షూటింగ్‌లో చిరంజీవి బిజీగా ఉన్నారు. ఈ చిత్రాన్ని సంక్రాంతికి రిలీజ్‌ చేసేందుకు అనువుగా షూటింగ్‌ను శరవేగంగా పూర్తి చేస్తున్నారు. ఈ సినిమా షూటింగ్‌ జరుగుతున్న సమయంలోనే తిలక్‌వర్మను సెట్స్‌కు ఆహ్వానించారు.

సెట్స్‌కి వచ్చిన తిలక్‌ను సాదరంగా ఆహ్వానించారు. శాలువా కప్పి సన్మానించి, అతనితో కేక్‌ కట్‌ చేయించారు. అలాగే మ్యాచ్‌లోని మెమరబుల్‌ మూమెంట్‌ ఫోటోను ఫ్రేమ్‌ చేయించి తిలక్‌ బహూకరించారు. కృషి, క్రమశిక్షణ క్రీడలోనే కాదు, జీవితంలోనూ మార్గదర్శకంగా ఉండాలని అన్నారు. ఈ కార్యక్రమంలో దర్శకుడు అనిల్‌ రావిపూడి, హీరోయిన్‌ నయనతార, నిర్మాతలు సాహు గారపాటి, సుస్మిత కొణిదెల, కేథరిన్‌ త్రెస, సచిన్‌ ఖేడ్కర్‌ పాల్గొన్నారు.