English | Telugu

3 కోట్ల మాలికాపురానికి 50 కోట్లు వ‌చ్చిందా !

ఈ మ‌ధ్య డివైన్ హిట్ సినిమాలు బాక్సాఫీసుల ద‌గ్గ‌ర ఎక్కువ‌గా క‌నిపిస్తున్నాయి. లాస్ట్ ఇయ‌ర్ క‌న్న‌డ నుంచి కాంతార వ‌చ్చింది. ఇప్పుడు మ‌లయాళంలో మాలికాపురం సినిమాకు 50 కోట్ల‌కు పైగా కలెక్ట్ అయ్యాయి. మూడు కోట్ల రూపాయ‌ల‌తో తీసిన సినిమాకు అన్ని కోట్లు ఎలా వ‌చ్చాయని అంద‌రూ ఆశ్చ‌ర్య‌పోతున్నారు. ఆ సినిమాలో ప్రేక్ష‌కుల‌కు అంత‌గా న‌చ్చిన విష‌యాలేంటి? అని మాట్లాడుకుంటున్నారు. అప్పుడెప్పుడో 50 ఏళ్ల క్రితం అయ్య‌ప్ప గురించి మ‌లయాళంలో సినిమా వ‌చ్చింది.

ఆ సినిమాలోని హ‌రివ‌రాస‌నం పాట‌నే ఇప్ప‌టికీ గుడి మూసేవేళలో లాలిపాట‌గా వినిపిస్తుంటారు. ఇప్పుడు మాలికాపురం సినిమాలోనూ అయ్య‌ప్ప కాన్సెప్ట్ నే తీసుకున్నారు. త‌న తండ్రితో క‌లిసి అయ్య‌ప్ప‌ను చూడ‌టానికి వెళ్లాల‌నుకుంటుంది ఓ ఎనిమిదేళ్ల పాప‌. తండ్రీకూతుళ్లు ఇద్ద‌రూ మాల వేసుకుంటారు. అయితే శ‌బ‌రిమ‌ల‌కు వెళ్ల‌కుండానే పాప తండ్రి క‌న్నుమూస్తాడు. త‌న ఫ్రెండ్‌ని తీసుకుని మ‌ల‌కు బ‌య‌లుదేరుతుంది ఆ అమ్మాయి. దారిలో వారిని కిడ్నాప్ చేయ‌డానికి ఒక‌త‌ను ప్ర‌య‌త్నిస్తాడు. అయితే వారిని ఇంకో స్వామి కాపాడుతాడు. వారిద్ద‌రినీ ద‌గ్గ‌రుండి శ‌బ‌రిమ‌ల‌కు తీసుకెళ్తాడు. పంబ‌లో స్నానం చేయిస్తాడు. అక్క‌డ ఆడిస్తాడు. అక్క‌డి నుంచి అడ‌వి మార్గాన శ‌బ‌రిమ‌ల‌కు తీసుకెళ్తాడు. 18 మెట్లూ ఆ పాప ఎక్కేదాకా తోడుంటాడు.

ఈ సినిమాలో హీరో నిజానికి పోలీస్‌. కానీ, చిన్న పాప మాత్రం అత‌న్నే అయ్య‌ప్ప‌గా భావిస్తుంది. చిన్న‌పిల్ల‌ల‌కు, ఆడ‌వాళ్ల‌కు చాలా బాగా న‌చ్చిందీ సినిమా. అందుకే అంత బాగా క్లిక్ అయింది. ఈ సినిమాలో స్త్రీలు గుడిలోకి వెళ్లొచ్చా? వెళ్ల‌కూడ‌దా? అనే విష‌యాల‌ను అస‌లు ప్ర‌స్తావించ‌లేదు. ద‌ర్శ‌కుడు విష్ణు శ‌శి శంక‌ర్ మాత్రం సినిమాకువ‌చ్చిన వ‌సూళ్లు చూసి ఆనందంలో ఉన్నారు.ఉన్నిముకుంద‌న్ కీల‌క పాత్ర‌లో న‌టించిన ఈ సినిమా అయ్య‌ప్ప భ‌క్తుల‌కే కాదు, అయ్య‌ప్ప గురించి తెలుసుకోవాల‌నుకునేవారికి కూడా చాలా బాగా న‌చ్చుతుంది.