English | Telugu
'భోళా శంకర్' విడుదల వాయిదా.. క్లారిటీ ఇచ్చిన మేకర్స్!
Updated : May 1, 2023
మెగాస్టార్ చిరంజీవి హీరోగా మెహర్ రమేష్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న చిత్రం 'భోళా శంకర్'. ఏకే ఎంటర్‌టైన్మెంట్స్, క్రియేటివ్ కమర్షియల్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రంలో తమన్నా, కీర్తి సురేష్, సుశాంత్ ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. తమిళ సినిమా 'వేదాళం'కు రీమేక్ రూపొందుతోన్న ఈ చిత్రాన్ని ఆగస్టు 11న విడుదల చేయబోతున్నట్లు ఇప్పటికే మేకర్స్ ప్రకటించారు. అయితే ఈ సినిమా వాయిదా పడే అవకాశముందని ఇటీవల వార్తలు వినిపించాయి. ఆ వార్తలకు చెక్ పెడుతూ విడుదల తేదీపై మరోసారి స్పష్టత ఇచ్చింది మూవీ టీం.
కార్మిక దినోత్సవం(మే 1) సందర్భంగా కార్మికులకు శుభాకాంక్షలు తెలుపుతూ తాజాగా 'భోళా శంకర్' నుంచి కొత్త పోస్టర్స్ ను విడుదల చేశారు మేకర్స్. ఇందులో చిరంజీవి టాక్సీ డ్రైవర్ గా కనిపిస్తున్నారు. టీ తాగుతూ టాక్సీ వద్ద రకరకాల ఫోజుల్లో ఉన్న మెగాస్టార్ స్టిల్స్ ఆకట్టుకుంటున్నాయి. అలాగే పోస్టర్స్ లో విడుదల తేదీ ఆగస్టు 11 అని మరోసారి స్పష్టం చేశారు. దీంతో 'భోళా శంకర్' విడుదల వాయిదా అనే వార్తల్లో నిజం లేదని తేలిపోయింది.
మహతి స్వర సాగర్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రానికి సినిమాటోగ్రాఫర్ గా డుడ్లీ, ఎడిటర్ గా మార్తాండ్ కె.వెంకటేష్ వ్యవహరిస్తున్నారు.