English | Telugu

మ‌హేష్‌కి అన్యాయం చేస్తున్న దేవిశ్రీ‌ప్ర‌సాద్

డీఎస్‌పీ... దేవిశ్రీ ప్ర‌సాద్ - ఈ పేరు చెబితేనే మ్యాజిక్‌! స్పీడు స్పీడు పాట‌ల‌తో, మైమ‌ర‌పించే మెలోడీల‌తో హిట్ ఆల్బ‌మ్ ఇచ్చేస్తాడు. అందులో ఓ కిర్రెక్కించే ఐటెమ్ పాట కంప‌ల్స‌రీ. ఆల్‌మోస్ట్ అగ్ర హీరోలంద‌రితోనూ ప‌నిచేశాడు దేవిశ్రీ‌. మెగా ఫ్యామిలీ అంటే మ‌నోడికి బోల్డంత మ‌మ‌కారం. చిరంజీవి, అల్లు అర్జున్‌, రామ్ చ‌ర‌ణ్,ప‌వ‌న్ క‌ల్యాణ్ సినిమాల‌కు అదిరిపోయే ఆల్బ‌మ్‌లు ఇచ్చాడు. బ‌న్నీ అంటే స్పెష‌ల్ ఇంట్ర‌స్ట్ తో ప‌నిచేస్తాడు. ఆర్య‌, ఆర్య 2, జులాయి, స‌న్నాఫ్ స‌త్య‌మూర్తి... ఇలా అన్నీ సూప‌ర్ హిట్ పాట‌లే. `1` - నేనొక్క‌డినేతో మ‌హేష్ బాబు సినిమాల‌కూ స్వ‌రాలు అందించే ఛాన్సొచ్చింది. ఆ సినిమా ఫ్లాప్ అయ్యింది. ఆడియో అయినా హిట్టా అంటే అదీ లేదు. అరెవో రాక్ స్టార్ ఒక్క‌టే కాస్త బాగుంటుంది. ఇప్పుడు శ్రీ‌మంతుడు సినిమాకీ ఆయ‌నే మ్యాజిక్ డైరెక్ట‌ర్‌. ఈ ఆల్బ‌మ్ అయినా అదిరిందా అంటే అదీ లేదు. అన్నీ సో.. సో.. పాట‌లే. గుర్తుండిపోయే గీతం ఒక్క‌టీ లేదు. బ‌న్నీ సినిమా అంటే రెచ్చిపోయి పాట‌లిచ్చేసే దేవిశ్రీ‌.. మ‌హేష్ సినిమాల‌కు ఆ మ్యాజిక్ ఎందుకు చేయ‌డం లేదో మ‌హేష్ ఫ్యాన్స్‌కి అర్థం కావ‌డం లేదు. శ్రీ‌మంతుడు పాట‌లూ వాళ్ల‌ని బాగా నిరాశ పర‌చ‌డంతో దేవిశ్రీ అంటేనే ప్రిన్స్ ఫ్యాన్స్ మండిప‌డుతున్నారు.

ప్ర‌తి హీరోకీ ఓ టేస్ట్ ఉంటుంది. మ్యూజిక్ విష‌యంలో కాస్తో కూస్తో కేర్ తీసుకొంటారు. బ‌న్నీకి మ్యాజిక్ ఇంట్ర‌స్ట్ ఉంది. అందుకే దేవిశ్రీ‌తో త‌న‌కు కావ‌ల్సిన‌ట్టుగా పాట‌లు కొట్టించుకొంటారు. ఆల్బ‌మ్‌లో ఓ మెలోడీ, ఓ ఫాస్ట్ బీట్ ఉండేలా జాగ్ర‌త్త‌ప‌డ‌తాన‌ని బ‌న్నీ కూడా చాలాసంద‌ర్భాల్లో చెప్పాడు. దానికి తోడు దేవిశ్రీ‌, బ‌న్నీ మంచి ఫ్రెండ్స్‌. సో... ఇద్ద‌రికీ ట్యూనింగ్ కుదిరింది. అయితే అంత ఇంట్ర‌స్ట్ మ‌హేష్ సినిమాల‌కు దేవిశ్రీ పెట్ట‌డం లేదేమో అనే అనుమానం క‌లుగుతోంది. ఇది వ‌ర‌కు మ‌హేష్ సినిమాల‌కు మ‌ణిశ‌ర్మ సంగీతం అందించేవాడు. ఆ పాట‌ల‌న్నీ బాగా ఆద‌ర‌ణ పొందాయి. మ‌ణిపై న‌మ్మ‌కంతో మ‌హేష్ త‌న పాట‌ల గురించి పెద్ద‌గా ప‌ట్టించుకొనేవాడు కాదు. మణి హ‌వా త‌గ్గాక‌... దేవిశ్రీ రంగంలోకి దిగాడు. క‌నీసం దేవిశ్రీ‌తో అయినా త‌న‌కు కావ‌ల్సిన‌ట్టుగా పాట‌ల్ని రాబ‌ట్ట‌డంలో మ‌హేష్ విఫ‌లం అవుతున్నాడ‌ని అర్థ‌మ‌వుతూనే ఉంది. ఆ ప్ర‌బావం.. శ్రీ‌మంతుడు పాట‌ల‌పై కూడా ప‌డింది. క‌థ‌, క‌థ‌నం, రిలీజ్ డేట్ త‌దిత‌ర విష‌యాల్లో పక్కాగా ఉండే మ‌హేష్‌... పాట‌ల విష‌యంలోనూ కాస్త దృష్టి పెడితే బాగుంటుంది.