English | Telugu

'లవ్ యు టూ' మూవీ రివ్యూ

సినిమా పేరు: లవ్ యు టూ
నటీనటులు: ఆట సందీప్, జ్యోతి రాజ్, ప్రాచీ థాకర్, దివ్య దేకాటే, అభయ్ బేతిగంటి, అభిలాష్ బండారి, క్రాంతి బలివాడ, మీనా వాసు, లావణ్య రెడ్డి, కేశవ్ దీపక్ తదితరులు
కథ, దర్శకత్వం: యోగి కుమార్
సంగీతం: సాకేత్ కొమండూరి
సినిమాటోగ్రఫీ: శ్యామ్ తుమ్మలపల్లి
ఎడిటింగ్: అనిల్ కుమార్ జల్లు
నిర్మాతలు: శ్రీకాంత్ కీర్తి
ఓటీటీ: ఎంఎక్స్ ప్లేయ‌ర్

కథ:
ఒక పిల్లాడు దెబ్బతగిలిందని ఏడుస్తూ ఇంటికి వస్తే.. వాళ్ళ అమ్మ అతడిని ఎన్నిసార్లు ఇలా దెబ్బలు తాకించుకుంటావని కొడుతూ ఏడుస్తుంది. ఇదే సీన్ బెడ్ మీద పడుకున్న సూర్య(ఆట సందీప్)కి నిద్రలో గుర్తొస్తుంటుంది. సూర్య, అతని భార్య పూర్ణ(జ్యోతి రాజ్) ఇద్దరు కలిసి ఒక డ్యాన్స్ స్కూల్ ని స్టార్ట్ చేస్తారు. ఆ తర్వాత ఇద్దరు ప్రేమించి పెళ్ళిచేసుకుంటారు. వాళ్ళిద్దరికి ఒక పాప ఉంటుంది. అయితే సూర్య డ్యాన్స్ స్కూల్ లో కొత్తగా జాయిన్ అయిన తన స్టూడెంట్ సుష్మ(ప్రాచీ థాకర్) ని లవ్ చేస్తాడు. ఆ తర్వాత ఏం జరిగింది? సూర్య, పూర్ణల పెళ్ళి బంధం‌ నిలిచిందా? లేక సూర్య, సుష్మల ప్రేమ గెలిచిందా తెలియాలంటే ఈ మూవీ చూడాల్సిందే.

విశ్లేషణ:
సూర్య(ఆట సందీప్), పూర్ణ(జ్యోతి రాజ్) ఇద్దరు ప్రేమించి పెళ్ళి చేసుకున్నాక.. సుష్మని సూర్య ప్రేమిస్తాడు. ఇది తప్పేకాదని సూర్య, ముమ్మాటికి తప్పేనని సూర్య ఫ్రెండ్, అతని భార్య పూర్ణ చెప్తుంటారు. అయితే సూర్యకి పూర్ణతో పాటు సుష్మ అంటే కూడా ప్రేమ అని వాదిస్తుంటాడు. మరి ఎలా వీరి సమస్యకి పరిష్కారం దొరికిందా అని చెప్పే ఈ మూవీ కథ కాస్త నెమ్మదిగా సాగుతుంది. సినిమా చూస్తున్నంతసేపు డైలాగ్స్ వస్తూనే ఉంటాయి. అందులో కొన్నింటికి మనం కనెక్ట్ అవుతాం.

స్క్రీన్ మీద క్యారెక్టర్స్ మాత్రమే మారుతుంటాయి. డైలాగ్స్ మాత్రం అవే ఉంటాయి. ప్రేమ తప్పు కాదని ఒకరు.. పెళ్లి తర్వాత ప్రేమ కరెక్టే అని మరొకరు.. ఒక‌ గంట సినిమా చూడగానే మనకి కథ అర్థం అయిపోతుంది. పెద్ద పెద్ద ట్విస్ట్ లు ఏమీ లేవు. అయినా ఉన్నంతలో బాగుంది. డైరెక్టర్ పెళ్ళి తర్వాత ప్రేమించకూడదా అని.. తనేం చెప్పాలనుకున్నాడో అది చెప్పేశాడు. అందరూ ఈ సినిమాకి కనెక్ట్ అవ్వకపోవచ్చు.. కానీ డైరెక్టర్ యోగి కుమార్ ఒక కొత్త ఆలోచనని ప్రెజెంట్ చేసాడు. లెంతీ డైలాగ్స్ పక్కన పెడితే ఈ సినిమా పర్వాలేదు. పెళ్ళి తర్వాత రిలేషన్ లో ఉండేవారికి ఇదొక మంచి పాఠంలా అనిపిస్తుంది.

సినిమా చూస్తున్నంతసేపు ప్రేక్షకుడు ఒక స్కూల్ కి వెళ్ళిన పిల్లాడిలా వాళ్ళు చెప్పే పేజీల పేజీల డైలాగ్స్ ని అలా వినాల్సిందే. కామెడీ ఉంటే బాగుండేది. పెళ్ళి తర్వాత ప్రేమ తప్పు కాదని సమాజానికి ఒక మెసేజ్ ఇద్దామని యోగి కుమార్ తీసినట్టున్నాడు. సినిమాలో కొన్ని డైలాగ్స్ సమాజంలో పెళ్ళి తర్వాత ప్రేమ తప్పు కాదని ఆలోచింపజేసేవిలా ఉన్నాయి.

స్క్రీన్ ప్లే బాగుంది. ఒక్కో క్యారెక్టర్ ని ప్రెజెంట్ చేయడంలో డైరెక్టర్ యోగి కుమార్ కాస్త జాగ్రత్త పడాల్సింది. అనిల్ కుమార్ జల్లు ఎడిటింగ్ పర్వాలేదు. కొన్ని సీన్లని ట్రిమ్ చేసి ఉంటే బాగుండేది. శ్యామ్ తుమ్మలపల్లి సినిమాటోగ్రఫీ సింపుల్ గా ఉంది. సాకేత్ కొమండూరి సంగీతం బాగుంది. నిర్మాణ విలువలు బాగున్నాయి.

నటీనటుల పనితీరు:
సూర్య పాత్రలో ఆట సందీప్ బాగా నటించాడు. పూర్ణ పాత్రలో జ్యోతి రాజ్ ఆకట్టుకుంది. సుష్మ పాత్రలో ప్రాచీ థాకర్ పర్వాలేదనిపించింది. సూర్యకి ఫ్రెండ్ పాత్రలో అభయ్ బేతిగంటి కీలక పాత్ర పోషించాడు. పింకీ పాత్రలో దివ్య ఆకట్టుకుంది.

తెలుగువన్ పర్ స్పెక్టివ్:
పెళ్ళి చేసుకున్న తర్వాత కూడా వేరొక అమ్మాయిని ప్రేమించడం తప్పు కాదనుకునే ఒక యువకుడి కథగా ఈ చిత్రం రూపొందింది. కాన్సెప్ట్, కొన్ని సంభాషణలు, సందేశం కోసం ఈ సినిమాని ఒకసారి చూడొచ్చు.

✍🏻.దాసరి మల్లేశ్