English | Telugu

లారెన్స్‌ అందించిన సాయానికి ఎమోషనల్‌ అయిన మహిళ.. వీడియో వైరల్‌!

సినిమా, వ్యాపారం, రాజకీయం.. ఈ మూడు రంగాల్లో వేల కోట్లు సంపాదించిన వారు ఉన్నారు. అలాగే అత్యధిక జనాభా కలిగిన మన దేశంలో ఆపన్న హస్తాల కోసం ఎదురుచూసేవారు లక్షల్లో ఉన్నారు. వివిధ రకాల సమస్యలతో దుర్భర జీవితాన్ని గడుపుతున్న ఎంతో మంది నిరుపేదలు దాతల సహాయం కోసం చూస్తున్నారు. కోట్లు సంపాదించినంత మాత్రాన అందరికీ సహాయం చేసే గుణం ఉండదు. వేలల్లో, లక్షల్లో సంపాదన ఉన్నవారు కూడా ఈమధ్యకాలంలో ఏదో ఒక సహాయం చేసేందుకు ముందుకు వస్తున్నారు. అలా రావడం వెనుక కారణం కొందరు ప్రముఖుల్ని ఆదర్శంగా తీసుకోవడమే. ముఖ్యంగా సినిమా రంగంలోని కొందరు ప్రముఖులు నిరుపేదలకు, పిల్లలకు సాయం చేస్తున్నారు. అవసరమైన వసతులు, గుండె ఆపరేషన్లు వంటివి సొంత ఖర్చుతో చేయిస్తున్నారు. వారిలో కొందరు టాలీవుడ్‌ హీరోలు ఉన్నారు, అలాగే కొందరు కోలీవుడ్‌ సినీ ప్రముఖులు కూడా ఉన్నారు.

ఇలాంటి సేవా కార్యక్రమాల్లో కొరియోగ్రాఫర్‌ లారెన్స్‌ ఎప్పుడూ ముందుంటాడన్న విషయం అందరికీ తెలిసిందే. ఇప్పటివరకు అతనివల్ల సాయం పొందినవారు వేలల్లో ఉన్నారు. తన చారిటబుల్‌ ట్రస్ట్‌ ద్వారా ఎంతో మంది జీవితాల్లో వెలుగులు నింపారు. లారెన్స్‌ని ఆదర్శంగా తీసుకొని కేపీవై బాల అనే కమెడియన్‌ ఎంతో మందికి సాయం చేస్తూ ఆదర్శంగా నిలుస్తున్నాడు.

తమిళనాడులో ఒక కామెడీ షో ద్వారా బాల వెలుగులోకి వచ్చాడు. ఆ కార్యక్రమం వల్ల వచ్చిన గుర్తింపుతో సినిమాల్లో కూడా అవకాశాలు దక్కాయి. అంతేకాదు, స్టాండప్‌ కమెడియన్‌గా కూడా మంచి పేరు తెచ్చుకున్నాడు. బాల తన సంపాదనలో అధిక మొత్తాన్ని సేవా కార్యక్రమాలకే వినియోగించడం విశేషంగానే చెప్పుకోవాలి. తను చేస్తున్న సేవా కార్యక్రమాలకు లారెన్స్‌ ఆదర్శమని చెబుతాడు బాల. వీరిద్దరూ కలిసి చేసిన కార్యక్రమాలు చాలా ఉన్నాయి. ఇటీవల ఓ నిరుపేద మహిళకు అందించిన సాయం వార్తల్లో నిలిచింది. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారుతోంది.

తమిళనాడులో మురుగమ్మాళ్‌ అనే మహిళ పెళ్ళయిన కొన్నేళ్ళకే భర్తను కోల్పోయింది. తన ముగ్గురు కూతుళ్ళను పోషించేందుకు ఎన్నో కష్టాలు పడుతోంది. తాము నివసించే ప్రాంతంలో తిరిగే రైళ్ళలో సమోసాలు అమ్ముతూ వచ్చిన డబ్బుతో కుటుంబాన్ని నడిపిస్తోంది. ఆమెకు డ్రైవింగ్‌ వచ్చినా ఆటో కొనేంత స్తోమత ఆమెకు లేదు. ఈ విషయంలో ఎంతోమందిని సాయం కోరింది. కానీ, ఫలితం లేదు. ఆ మహిళ గురించి తెలుసుకున్న బాల వెంటనే లారెన్స్‌ను కలిసి విషయం చెప్పాడు. దానికి స్పందించిన లారెన్స్‌ రూ.3 లక్షలు ఇచ్చాడు. ఆ డబ్బుతో కొత్త ఆటో కొన్నాడు బాల. ఆటోను అందించేందుకు ఆమెను ఒకచోటకి రమ్మన్నారు. ఒక ఆటోలో అక్కడికి చేరుకుంది మురుగమ్మాళ్‌. ఒక్కసారిగా ఆ మహిళ షాక్‌ అయింది. తనని ఆటోలో తీసుకొచ్చింది ఎవరో కాదు, బాల. ఆ తర్వాత కాసేపటికి లారెన్స్‌ అక్కడికి చేరుకున్నారు. లారెన్స్‌ని చూసిన ఆ మహిళ ఎమోషనల్‌ అయిపోయింది. ఆటో కీస్‌ మురుగమ్మాళ్‌కి అందించాడు లారెన్స్‌. అంతేకాదు మురుగమ్మాళ్‌ భర్తతో కలిసి దిగిన పెద్ద ఫోటోను బహూకరించాడు. దానికామె మరింత ఎమోషనల్‌ అయిపోయింది. అక్కడే వున్న మిగతా మహిళా డ్రైవర్లు లారెన్స్‌ను అమాంతం ఎత్తుకొని తమ ఆనందాన్ని వ్యక్తం చేశారు. ఆ తర్వాత లారెన్స్‌, బాల ఆటోలో కూర్చోగా మురుగమ్మాళ్‌ డ్రైవ్‌ చేస్తూ వారిని తీసుకెళ్లింది.