Read more!

English | Telugu

కృష్ణవంశీ ఈజ్ బ్యాక్!

'గులాబి', 'నిన్నే పెళ్ళాడుతా', 'సింధూరం', 'అంతఃపురం', 'మురారి', 'ఖడ్గం' వంటి సినిమాలతో క్రియేటివ్ డైరెక్టర్ గా పేరు తెచ్చుకున్నారు కృష్ణవంశీ. ఒకప్పుడు ఆయన సినిమా వస్తుందంటే నటీనటులు ఎవరనే దానితో సంబంధం లేకుండా ప్రేక్షకులు ఎంతో ఆసక్తి చూపించేవారు. అయితే కొంతకాలంగా కృష్ణవంశీ విజయాల వేటలో వెనకబడిపోయారు. ఆయన దర్శకత్వంలో వచ్చిన 'మొగుడు', 'పైసా', 'నక్షత్రం' వంటి సినిమాలు దారుణంగా నిరాశపరిచాయి. ఆయన సరైన విజయాన్ని అందుకొని పది పదిహేనేళ్ళు అవుతుంది. అసలు ఆయన దర్శకత్వం వహించిన సినిమా విడుదలయ్యే దాదాపు ఆరేళ్ళు అవుతుంది. ఆయనను ఎంతగానో అభిమానించేవారు తప్ప.. సాధారణ ప్రేక్షకులు దాదాపు ఆయనను మర్చిపోతున్నారు కూడా. ఇలాంటి సమయంలో అదిరిపోయే కమ్ బ్యాక్ ఇస్తున్నారు కృష్ణవంశీ.

ప్రకాష్ రాజ్, రమ్యకృష్ణ, బ్రహ్మానందం ప్రధాన పాత్రల్లో కృష్ణవంశీ దర్శకత్వంలో రూపొందిన చిత్రం 'రంగమార్తాండ'. మరాఠీ ఫిల్మ్ 'నట సామ్రాట్'కి రీమేక్ గా ఈ చిత్రం తెరకెక్కింది. ఈ సినిమాని కృష్ణవంశీ ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందించారు. త్వరలోనే ఈ చిత్రం థియేటర్లలో అలరించనుంది. ఈ నేపథ్యంలో ఈ చిత్రాన్ని ముందుగానే ప్రత్యేక షోలు చేసి సన్నిహితులు, మీడియాకి చూపించారు. ఇంతముందుగా ప్రత్యేక షో వేశారంటేనే ఈ సినిమా పట్ల కృష్ణవంశీకి ఎంత నమ్మకముందో అర్థం చేసుకోవచ్చు. ఈ సినిమాపై ఆయన నమ్మకమే నిజమైంది. సినిమా చూసిన ప్రతి ఒక్కరు 'కృష్ణవంశీ ఈజ్ బ్యాక్' అంటున్నారు. 

రంగస్థలంపై నాటక ఘట్టాలను అద్భుతంగా ప్రదర్శించి 'రంగమార్తాండ' బిరుదుని పొందిన రాఘవరావు అనే వ్యక్తి.. విశ్రాంతి తీసుకునే వయసులో పిల్లల మూలంగా జీవితంలో ఎదురయ్యే ఘట్టాలను పోషించలేక ఎంతలా మదన పడ్డాడో ఈ చిత్రంలో అద్భుతంగా చూపించారు. సినిమాలోని ప్రతి పాత్రని, ప్రతి సన్నివేశాన్ని కృష్ణవంశీ మలిచిన తీరు ఆకట్టుకుంది. సొంత అన్నదమ్ముల్లా ఉండే ప్రాణ స్నేహితుల పాత్రల్లో ప్రకాష్ రాజ్, బ్రహ్మానందం పోటాపోటీగా నటించారు. కొన్ని కొన్ని సన్నివేశాల్లో బ్రహ్మానందం నటన చూసి ఆయనపై హాస్య నటుడనే ముద్రవేసి తప్పు చేశారనే అభిప్రాయం కలగక మానదు. ఆకెళ్ల శివప్రసాద్ రాసిన సంభాషణలు ఈ చిత్రానికి ప్రధాన బలంగా నిలిచాయి. ప్రతి మాట లోతైన భావంతో, బలంగా మనసులను తాకేలా ఉంది. ఇక ఇళయరాజా సంగీతం, సిరివెన్నెల సాహిత్యం సినిమాని మరోస్థాయికి తీసుకెళ్లాయి. ముఖ్యంగా  'పువ్వై విరిసే ప్రాణం' పాట సినిమాకి ప్రాణం పోసింది. 

'మన అమ్మానాన్నల కథ'గా ఈ చిత్రాన్ని ప్రమోట్ చేస్తున్నారు. నిజంగానే ఇది అమ్మానాన్నల కథ. జీవితాంతం పిల్లల కోసం కష్టపడి, బాధ్యతలు తీరిపోయి విశ్రాంతి తీసుకునే సమయంలో.. ఆ పిల్లల మూలంగానే తల్లిదండ్రులు ఎంత ఇబ్బంది పడతారో, బాధపడతారో చూపిస్తూ.. ఈ తరం వారికి తల్లిదండ్రుల విలువని తెలిపేలా తీసిన సందేశాత్మక చిత్రమిది. ఒక్క మాటలో చెప్పాలంటే ముందు తరంతో కలిసి ఈ తరం చూడాల్సిన చిత్రం 'రంగమార్తాండ'.