English | Telugu
'కార్తికేయ 3' నిర్మాతకు చిక్కులు తప్పవా?
Updated : Aug 15, 2023
హీరో నిఖిల్ సిద్ధార్థ్ ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకుండా సినీ రంగ ప్రవేశం చేసి ఇప్పుడు హీరోగా పాన్ ఇండియా రేంజ్ ఇమేజ్‌ను సంపాదించుకున్న సంగతి తెలిసిందే. అందుకు తగినట్లే ఇప్పుడు వరుస సినిమాలు చేస్తున్నారు. అయితే నిఖిల్‌కి ఇండియా వైడ్ మంచి గుర్తింపును తీసుకొచ్చిన సినిమా ‘కార్తికేయ 2’. 2014లో విడుదలైన ‘కార్తికేయ’ సినిమాకు ఇది సీక్వెల్. అయితే ‘కార్తికేయ’ రిలీజ్ సమయంలో ఆర్థిక సమస్యలు వచ్చాయి. ఆ సమయంలో సిరువూరి రాజేష్ వర్మ అనే నిర్మాత అండగా నిలబడ్డారు. సినిమా రిలీజై బ్లాక్ బస్టర్ అయ్యింది. చేసిన సాయానికి బదులుగా ‘కార్తికేయ’ ఫ్రాంచైజీ హక్కులను సిరువూరి రాజేష్‌కు రాసిచ్చారు మేకర్స్.
అయితే ‘కార్తికేయ 2’ సినిమాను నిఖిల్ మరో నిర్మాత అయిన టి.జి.విశ్వప్రసాద్‌తో చేశారు. తనతో చేయాల్సిన సినిమాను మరో నిర్మాతతో చేసినప్పటికీ రాజేష్ వర్మ ఏమీ అనలేదు. ఎన్ఓసీ ఇచ్చేశారు. తనతో ‘కార్తికేయ 3’ చేస్తారని భావించారు. అయితే రీసెంట్‌గా నిఖిల్ ఉన్నట్లుండి మూడో భాగాన్ని కూడా టి.జి.విశ్వప్రసాద్‌తో చేస్తానని రీసెంట్‌గా ప్రకటించారు. తన అనుమతి లేకుండా అలా అనౌన్స్ చేయటం సిరువూరి రాజేష్ వర్మ గుర్రుగా ఉన్నారు. కుదిరితే ‘కార్తికేయ 3’ సినిమా అనౌన్స్ అయిన తర్వాత మేకర్స్‌కు లీగల్ నోటీసులు కూడా ఇవ్వటానికి వెనుకాడనని అంటున్నారు మరి.
హీరో నిఖిల్ ఇప్పుడు పాన్ ఇండియా ఇమేజ్ సంపాదించుకుంటోన్న తరుణంలో ఎందుకనో వివాదాల్లోకి కూడా వెళుతున్నారు. ఆయన స్పై సినిమా సమయంలోనూ సరైన రిలీజ్ డేట్ కాదని మార్చుకుందామని నిఖిల్ ఎంతగానో ప్రయత్నించినప్పటికీ స్పై నిర్మాత రాజశేఖర్ రెడ్డి ఒప్పుకోలేదు. దీంతో తన తదుపరి సినిమాలపై మరిన్ని జాగ్రత్తలు తీసుకుంటానని నిఖిల్ ఓపెన్‌గా ఇంటర్వ్యూలో చెప్పిన సంగతి తెలిసిందే. మరిప్పుడు ‘కార్తికేయ 3’పై నిఖిల్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనేది చూడాలి మరి.