English | Telugu
‘ఘోస్ట్’ వల్ల బాలయ్య, విజయ్, రవితేజ ఇబ్బంది పడనున్నారా?
Updated : Aug 25, 2023
ఈమధ్యకాలంలో అన్నీ పాన్ ఇండియా మూవీస్‌గానే రిలీజ్ అవుతున్నాయి. ఎందుకంటే నాలుగైదు భాషల్లో సినిమా రిలీజ్ అయితే ఎంతో కొంత వర్కవుట్ అవుతుందన్న ఆలోచనతోనే పలు భాషల్లో సినిమాలను రిలీజ్ చేస్తున్నారు. ఆ ఆలోచనతోనే సినిమా నిర్మాణంలోనే వివిధ భాషలకు చెందిన నటీనటులను ఎంపిక చేసుకుంటున్నారు. ఇదిలా ఉంటే పాన్ ఇండియా మూవీస్ వల్ల థియేటర్ల సమస్య ఏర్పడుతోందనే మాట వినిపిస్తోంది. సౌత్ విషయానికి వస్తే తెలుగు, తమిళ్, మలయాళ, కన్నడ భాషల్లో రూపొందే పాన్ ఇండియా మూవీస్‌కి సమస్యలు వస్తున్నాయి. ఈ దసరా సీజన్‌లో కన్నడ సూపర్‌స్టార్ శివరాజ్‌కుమార్ హీరోగా నటించిన పాన్ ఇండియా మూవీ ‘ఘోస్ట్’ అక్టోబర్ 19న రిలీజ్ అవుతోంది. అదేరోజు తమిళ్ హీరో విజయ్ నటించిన ‘లియో’ కూడా విడుదలవుతోంది. అలాగే తెలుగు సినిమాల్లో రవితేజ హీరోగా రూపొందుతున్న ‘టైగర్ నాగేశ్వరరావు’ కూడా రాబోతోంది. వీటితోపాటు నందమూరి బాలకృష్ణ, అనిల్ రావిపూడి కాంబినేషన్‌లో రూపొందుతున్న ‘భగవంత్ కేసరి’ కూడా దసరా సీజన్‌లో రిలీజ్ అయ్యే ఛాన్స్ ఉంది. వీటిని పక్కన పెడితే అక్టోబర్ 19న రిలీజ్ అవుతున్న శివరాజ్‌కుమార్ సినిమా ‘ఘోస్ట్’ బ్లాక్‌బస్టర్ అయితే మాత్రం కర్ణాటకలో తెలుగు, తమిళ్ సినిమాలకు థియేటర్లు దొరికే అవకాశం లేదు. ఎందుకంటే ఆ సీజన్‌లో రిలీజ్ అవుతున్న సౌత్ సినిమాలన్నీ పాన్ ఇండియా మూవీస్ అవ్వడమే కారణం.