English | Telugu
'కంగువా' గ్లింప్స్.. రెచ్చిపోయిన సూర్య
Updated : Jul 23, 2023
వెర్సటైల్ స్టార్ సూర్య కథానాయకుడిగా నటిస్తోన్న భారీ బడ్జెట్ విజువల్ వండర్ `కంగువా`. శివ దర్శకత్వంలో రూపొందుతోన్న ఈ సినిమా నుంచి గ్లింప్స్‌ను మేకర్స్ ఆదివారం (జూలై 23) రోజున విడుదల చేశారు. అందుకు కారణం..సూర్య పుట్టినరోజు కావటం. కంగువా గ్లింప్స్‌ను గమనిస్తే, ఇది వరకు సూర్య చేసిన సినిమాలకు దీనికి పోలికే లేదు, అలాగే దర్శకుడు శివ కూడా సరికొత్త జోనర్‌లోనే కంగువా సినిమాను తెరకెక్కించారనేది స్పష్టమవుతుంది. పీరియాడిక్ బ్యాక్ డ్రాప్‌తో తెరకెక్కుతోన్న సినిమా కావటంతో సినిమాను ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా మేకర్స్ రూపొందిస్తున్నారు. యువీ క్రియేషన్స్, స్టూడియో గ్రీన్ సంస్థలు కలిసి ఈ సినిమాను నిర్మిస్తున్నాయి.
సూర్య కెరీర్‌లోనే అత్యంత భారీ బడ్జెట్ మూవీ కంగువా అని మీడియాలో వినిపిస్తోన్న టాక్. ఈ సినిమాను 2డితో పాటు 3డిలోనూ రిలీజ్ చేయబోతున్నారు. గ్లింప్స్‌లో కనిపిస్తే సూర్య పాత్ర ఎంత భయంకరంగా ఉంటుందనేది తెలుస్తుంది. సూర్య ఇది వరకు నెగెటివ్ టచ్ ఉన్న పాత్రల్లో నటించారు. 24 సినిమా అందుకు ఉదాహరణ. అలాగే విక్రమ్ సినిమాలోనూ రోలెక్స్ రోల్‌లో అదరగొట్టేశారు. ఇప్పుడు కంగువా సినిమాలోనూ గ్రే షేడ్స్‌లో దుమ్మ దులపబోతున్నారనేది స్పష్టమవుతుంది. అయితే అది ఏ మేరకు ఉంటుందనేది తెలియాలంటే మాత్రం సినిమా చూడాల్సిందే.
ప్రస్తుతానికి తెలుగు, హిందీ, తమిళ, కన్నడ, మలయాళ భాషలతో పాటు `కంగువా` సినిమా మరో పది భాషల్లో రిలీజ్ అవుతుంది. త్వరలోనే మిగిలిన ఐదు భాషలపై క్లారిటీ రానుంది. ఇందులో సూర్యకు జోడీగా బాలీవుడ్ బ్యూటీ దిశా పటాని కనిపించనుంది. దేవిశ్రీ ప్రసాద్ ఈ సినిమాకు సంగీతాన్ని అందిస్తున్నారు. కంగువా రిలీజ్ డేట్‌పై కూడా మేకర్స్ ఇంకా కచ్చితమైన క్లారిటీ ఇవ్వలేదు. ఇది సూర్య హీరోగా నటిస్తోన్న 42వ సినిమా.