English | Telugu
'డెవిల్'తో సోలోగా వస్తున్న కళ్యాణ్ రామ్
Updated : Aug 6, 2023
జయాపజయాలతో సంబంధం లేకుండా విభిన్న చిత్రాలు చేస్తూ తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు నందమూరి కళ్యాణ్ రామ్. ఇప్పుడు ఆయన మరో ఆసక్తికర చిత్రంతో అలరించడానికి సిద్ధమవుతున్నారు. అదే 'డెవిల్'. అభిషేక్ పిక్చర్స్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి నవీన్ మేడారం దర్శకుడు. ఇప్పటికే విడుదలైన పోస్టర్లు, గ్లింప్స్ ఆకట్టుకొని సినిమాపై అంచనాలను పెంచాయి. తాజాగా ఈ చిత్ర విడుదల తేదీని ప్రకటించారు మేకర్స్.
గతేడాది 'బింబిసార'తో బ్లాక్ బస్టర్ అందుకున్న కళ్యాణ్ రామ్, ఈ ఏడాది 'అమిగోస్' రూపంలో పరాజయాన్ని చూశారు. ఇప్పుడు 'డెవిల్'తో లెక్క సరిచేయాలని చూస్తున్నారు. స్వాతంత్య్రానికి ముందు జరిగిన ఒక బ్రిటిష్ సీక్రెట్ ఏజెంట్ కథగా 'డెవిల్' రూపొందుతోంది. కళ్యాణ్ రామ్ పుట్టినరోజు(జూలై 5) సందర్భంగా విడుదలైన ఈ మూవీ గ్లింప్స్ ఆకట్టుకొని, సినిమాపై అందరిలో ఆసక్తి కలిగేలా చేసింది. ఇక ఈ చిత్రాన్ని నవంబర్ 24న విడుదల చేస్తున్నట్లు తాజాగా మేకర్స్ తెలిపారు. ఆగస్టు నుంచి జనవరి వరకు.. ఒక్క నవంబర్ తప్ప అన్ని నెలల్లో బడా సినిమాల తాకిడి ఉంది. మరి నవంబర్ లో సోలో ఎంట్రీ ఇస్తున్న కళ్యాణ్ రామ్.. 'బింబిసార' తరహాలో మరోసారి బాక్సాఫీస్ ఊచకోత కోస్తారేమో చూడాలి.
'బింబిసార' తర్వాత కళ్యాణ్ రామ్, సంయుక్త మీనన్ కలిసి నటిస్తున్న చిత్రమిది. అభిషేక్ నామ నిర్మిస్తున్న ఈ చిత్రానికి శ్రీకాంత్ విస్సా కథ అందించారు. హర్షవర్ధన్ రామేశ్వర్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రానికి సినిమాటోగ్రాఫర్ గా సుందర్ సి. రాజన్, ఎడిటర్ గా తమ్మిరాజు వ్యవహరిస్తున్నారు.