English | Telugu
ప్రజా గాయకుడు గద్దర్ కన్నుమూత
Updated : Aug 6, 2023
ప్రజా గాయకుడు గద్దర్(74) కన్నుమూశారు. కొద్దిరోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన హైదరాబాద్ లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆదివారం తుదిశ్వాస విడిచారు.
గద్దర్ అసలు పేరు గుమ్మడి విఠల్ రావు. మెదక్ జిల్లా లోని తూప్రాన్ గ్రామంలో లచ్చమ్మ, శేషయ్య దంపతులకు 1948లో ఆయన జన్మించారు. 1969 తెలంగాణ ఉద్యమంలో చురుగ్గా పాల్గొన్నారు. ప్రజలను చైతన్య పరచడానికి ఆయన ఊరురా తిరిగి ప్రచారం చేసారు. దీనికొరకు ఆయన బుర్రకథను ఎంచుకున్నారు. ఆయన ప్రదర్శనను చూసిన సినిమా దర్శకులు బి.నరసింగరావు.. భగత్ సింగ్ జయంతి రోజున ఒక ప్రదర్శనను ఏర్పాటు చేసారు. ఆతర్వాత ప్రతి ఆదివారం ఆయన తన ప్రదర్శనలు ఇచ్చేవారు. 1971 లో బి.నరసింగరావు ప్రోత్సాహంతో మొదటి పాట 'ఆపర రిక్షా' రాశాడు. ఆయన మొదటి ఆల్బం పేరు గద్దర్. ఇదే ఆయన పేరుగా స్థిరపడింది. బ్యాంక్ లో ఉద్యోగం వచ్చినా కొన్నేళ్ళకే ఉద్యోగం మానేసి తన జీవితాన్ని ప్రజా సేవకు అంకితం చేశారు. దళితుల తరపున పోరాటం చేయడంతో పాటు తెలంగాణ వాదాన్ని బలంగా వినిపించారు.
గద్దర్ రాసిన పాటల్లో 'అమ్మ తెలంగాణమా' అనే పాట బహుల ప్రజాదరణ పొందింది. సినీ రంగంలోనూ తనదైన ముద్ర వేశారు గద్దర్. 'మాభూమి' సినిమాలోని 'బండెనక బండి కట్టి' అనే పాటను పాడడంతోపాటు పాటలో నటించారు. 'ఒరేయ్ రిక్షా' చిత్రంలోని 'నీ పాదం మీద పుట్టు మచ్చనై చెల్లెమ్మ' అనే పాటకు సాహిత్యం అందించారు. ఇక 'జై బోలో తెలంగాణ' సినిమాలో 'పొడుస్తున్న పొద్దు మీద' పాట ఆయనే రాసి పాడి, అభినయించారు. ఈ పాట అద్భుత విజయం సాధించింది. తెలంగాణ మలిదశ ఉద్యమంలో ఈ పాటకు ప్రత్యేక స్థానముంది.