English | Telugu
ఈ దర్శకుడితోనే మెగాస్టార్ కొత్త సినిమా.. మరో 'వాల్తేరు వీరయ్య' లోడింగ్!
Updated : May 4, 2023
ఈ ఏడాది సంక్రాంతికి 'వాల్తేరు వీరయ్య'తో అదిరిపోయే బ్లాక్ బస్టర్ అందుకున్నారు మెగాస్టార్ చిరంజీవి. యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ఈ చిత్రంలో మెగాస్టార్ కామెడీ టైమింగ్ కి ప్రేక్షకులు ఫిదా అయ్యారు. దాంతో ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర కాసుల వర్షం కురిపించింది. చిరంజీవి ఇలాంటి కమర్షియల్ ఎంటర్టైనర్స్ చేస్తే బాగుంటుందనే అభిప్రాయం ఫ్యాన్స్ లో ఉంది. మెగాస్టార్ సైతం 'వాల్తేరు వీరయ్య' తరహాలో మరో అదిరిపోయే ఎంటర్టైనర్ అందించడానికి సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది.
చిరంజీవి ప్రస్తుతం మెహర్ రమేష్ దర్శకత్వంలో 'భోళా శంకర్' సినిమా చేస్తున్నారు. తమిళ ఫిల్మ్ 'వేదాళం'కు రీమేక్ గా తెరకెక్కుతోన్న ఈ చిత్రం ఆగస్టు 11న ప్రేక్షకుల ముందుకు రానుంది. అయితే దీని తర్వాత చిరు చేయబోయే సినిమా గురించి ఆసక్తికరమైన న్యూస్ వినిపిస్తోంది. 'సోగ్గాడే చిన్ని నాయనా', 'బంగార్రాజు' వంటి చిత్రాలతో ఆకట్టుకున్న దర్శకుడు కళ్యాణ్ కృష్ణ తో మెగాస్టార్ తన తదుపరి సినిమా చేయబోతున్నట్లు తెలుస్తోంది. అవుట్ అండ్ అవుట్ ఎంటర్టైనర్ గా తెరకెక్కనున్న ఈ చిత్రానికి చిరు కుమార్తె సుష్మిత నిర్మాతగా వ్యవహరించనున్నారని సమాచారం. దీనితో పాటు 'బింబిసార' ఫేమ్ మల్లిడి వశిష్ట దర్శకత్వంలో ఓ సినిమా, 'సర్దార్' ఫేమ్ పి.ఎస్. మిత్రన్ దర్శకత్వంలో మరో సినిమా మెగాస్టార్ చేయనున్నారని వినికిడి.