English | Telugu
'విరూపాక్ష' రేంజ్ ఏంటో రేపటితో తేలిపోతుంది!
Updated : May 4, 2023
సుప్రీమ్ హీరో సాయి ధరమ్ తేజ్ తాజా చిత్రం 'విరూపాక్ష' తెలుగులో ఏప్రిల్ 21న విడుదలై ఘన విజయం సాధించింది. నేటితో ఈ చిత్రం విడుదలై రెండు వారాలు అయింది. 13 రోజుల్లో రూ.75 కోట్లకు పైగా గ్రాస్ రాబట్టిన ఈ చిత్రం తెలుగు రాష్ట్రాల్లో ఇప్పటికీ మంచి వసూళ్లనే రాబడుతోంది. అయితే ఈ సినిమా వంద కోట్ల క్లబ్ లో చేరుతుందా? అసలు ఈ సినిమా రేంజ్ ఏంటి? అనేది రేపటితో తేలిపోయే అవకాశముంది.
'విరూపాక్ష'ను మొదట పాన్ ఇండియా రేంజ్ లో విడుదల చేయాలనుకున్నారు. కానీ ఇంట గెలిచి రచ్చ గెలవాలి అనే ఉద్దేశంతో ముందుగా తెలుగులో మాత్రమే విడుదల చేశారు. తెలుగులో ఘన విజయం సాధించడంతో ఇప్పుడు హిందీతో పాటు ఇతర భాషల్లో విడుదల చేస్తున్నారు. రేపు(మే 5న) పాన్ ఇండియా రేంజ్ లో పలు భాషల్లో విడుదల కానుంది. ఇతర భాషల ప్రేక్షకులను కూడా ఆకట్టుకుంటే వంద కోట్లు అనేది విరూపాక్షకి చాలా చిన్న విషయం అవుతుంది. పాజిటివ్ టాక్ వస్తే, నార్త్ బాక్సాఫీస్ దగ్గర ఊహించని సంచలనాలు నమోదు చేసినా ఆశ్చర్యంలేదు. మరి విరూపాక్ష అక్కడ కూడా సంచలనం సృష్టిస్తుందా లేదా అనేది రేపటితో తేలిపోనుంది.
మరోవైపు తెలుగు రాష్ట్రాల్లో విరూపాక్ష జోరు కొనసాగుతుందా లేదా అనే దానిపై కూడా రేపు క్లారిటీ రానుంది. ఎందుకంటే రేపు 'రామబాణం', 'ఉగ్రం' అనే రెండు చెప్పుకోదగ్గ సినిమాలు తెలుగు ప్రేక్షకుల ముందుకు వస్తున్నాయి. ఆ రెండు సినిమాలపైనా మంచి అంచనాలే ఉన్నాయి. ముఖ్యంగా 'రామబాణం'కి పాజిటివ్ టాక్ వస్తే ఫ్యామిలీ ఆడియన్స్ ఆ సినిమా వైపు మొగ్గుచూపే అవకాశముంది. మరి 'రామబాణం', 'ఉగ్రం' రూపంలో ఎదురవుతున్న బాక్సాఫీస్ పోరుతో విరూపాక్ష తెలుగు రాష్ట్రాల్లో మూడో వారం ఎలా నిలబడుతుందో చూడాలి.