English | Telugu
కాజల్ ఇచ్చిన బ్యూటీ టిప్స్
Updated : Jun 19, 2023
కాజల్ అగర్వాల్ ఇచ్చిన బ్యూటీ టిప్స్ ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. ఇవాళ ఆమె పుట్టినరోజు. ఈ సందర్భంగా కాజల్ ఇచ్చిన నేచురల్ టిప్స్ ని గుర్తుచేసుకుంటున్నారు ఆమె ఫ్యాన్స్. దాదాపుగా రెండు దశాబ్దాలుగా ఇండస్ట్రీలో ఉన్నారు కాజల్. మగధీర, డార్లింగ్, బృందావనం, మిస్టర్ పర్ఫెక్ట్ తో పాటు ఇంకా ఎన్నెన్నో సినిమాలు ఆమెకు పేరు తెచ్చిపెట్టాయి. ఆయా సినిమాల ప్రమోషన్ల సమయంలో కాజల్ పంచుకున్న టిప్స్ మీకోసం...
ఫేస్ మాస్క్!
పెరుగుతో ఫేస్ మాస్క్ వేసుకుంటే చాలా ఉపయోగాలుంటాయి. ఎప్పుడూ ముఖాన్ని శుభ్రం చేసుకోవడానికి కాజల్ తల్లి పెరుగునే ప్రిఫర్ చేస్తారు. పెరుగు, తేనె, నిమ్మరసం కలిపి ముఖానికి పూసుకుని ఆరనిచ్చి కడిగేస్తే కాంతివంతమైన ముఖం మీ సొంతం.
ఆల్మండ్ స్క్రబ్
ముఖం మీద మృత కణాలను తొలగించడానికి స్క్రబ్ ఉపయోగిస్తుంటాం. ఆల్మండ్ మీల్ స్క్రబ్ అద్భుతంగా పనిచేస్తుందని అంటారు కాజల్. బాదంని కాస్త గరుకుగా పొడిచేసి, దాంతో స్క్రబ్ చేసుకుంటే సరిపోతుంది.
క్లెన్సింగ్, టోనింగ్, మాయిశ్చరైజర్
కాంతులీనే ముఖం కోసం క్లెన్సింగ్, టోనింగ్, మాయిశ్చరైజర్ చాలా కీలకం అంటారు కాజల్. సన్‌స్క్రీన్ తప్పనిసరిగా వాడుతారు. బయటికి వెళ్లడానికి ముందు కచ్చితంగా సన్‌స్క్రీన్ రాసుకుంటారు.
కొబ్బరి ప్రాడెక్టులు
తలకి కొబ్బరినూనె, మేకప్ తీయడానికి కొబ్బరినూనె వాడుతారు కాజల్ . వారానికి ఒకసారి ముల్తానీ మిట్టి ఫేస్‌ప్యాక్ పెట్టుకుంటారు. స్కిన్ నేచురల్‌గా ఉంటుందట.
వర్కవుట్, హైడ్రేషన్
కేవలం పైనుంచి పూతలు మాత్రమే కాదు, ఆరోగ్యపరమైన జాగ్రత్తల వల్ల కూడా చర్మం ఆరోగ్యంగా ఉంటుందని అంటారు కాజల్. ప్రతిరోజూ అరగంట తప్పకుండా ఎక్సర్‌సైజులు చేయాలని సలహా ఇస్తారు. జ్యూసులు, కొబ్బరినీళ్లు, మజ్జిగ, నీళ్లు చాలినన్ని తాగాలంటారు.