English | Telugu

'ఆదిపురుష్‌'గా నాకు కనిపించింది ప్రభాస్ మాత్రమే!

ప్రభాస్ టైటిల్ రోల్ పోషించగా ఓం రౌత్ డైరెక్ట్ చేసిన 'ఆదిపురుష్' మూవీ భారత్‌లో బాక్సాఫీస్ దగ్గర రూ. 240 కోట్ల మార్కును దాటింది. సినిమా కథా కథనాలు, క్యారెక్టరైజేషన్స్, వీఎఫ్ఎక్స్, సంభాషణలు, కాస్ట్యూమ్స్ వంటి వాటిపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతుండగా, 'ఆదిపురుష్‌'లో రాఘవ్ పాత్రకు ప్రభాస్ తప్ప మరో చాయిస్ ఎవరూ లేరని ఓం రౌత్ చెప్పాడు. నేటి తరాన్ని దృష్టిలో ఉంచుకొని ఈ చిత్రాన్ని తీశామని.. ఎవరైనా కానీ నమ్మకంతో, అవగాహనతో దాని ప్రెజెంట్ చేయగలరని కూడా ఆయన అన్నాడు.

"మీరు చూస్తే, రామాయణలో ప్రత్యేకించి ఒక సెగ్మెంట్ మాత్రమే నేను తీసుకున్నానని తెలుస్తుంది. అది.. రాముని పరాక్రమం తెలియజేసే యుద్ధ కాండ. ఈ కాండలో రాముని అనేక గుణాలను మనం చూస్తాం. వ్యక్తిగతంగా ఆయనలో నాకు బాగా నచ్చింది పరమవీర గుణం. దాన్ని పునఃసృష్టించడానికే నేను ప్రయత్నించాను. అలాంటి ఆ పాత్రకు ప్రభాస్ సరిగ్గా సరిపోయారు. ఎందుకంటే ఆయన హృదయం చాలా పరిశుద్ధమైంది. మన హృదయం ఎలాంటిదో మన కళ్లు తెలియజేస్తాయి. ప్రభాస్ కళ్లల్లో సిన్సియారిటీ, నిజాయితీ, జెన్యూనిటీని మనం చూస్తాం. ఆయన చాలా పెద్ద స్టార్ అయినా వినయశీలి. కాబట్టే నేను ఈ సినిమా చేయాలనుకున్నప్పుడు, ఆయననే రాఘవ పాత్రలో ఊహించుకున్నాను." అని ఆయన చెప్పుకొచ్చాడు.

రామునిగా ప్రభాస్, జానకిగా కృతి సనన్ నటించిన 'ఆదిపురుష్' మూవీలో సైఫ్ అలీ ఖాన్ (రావణుడు), సన్నీ సింగ్ (లక్ష్మణుడు), దేవ్‌దత్త నాగే (హనుమాన్), సోనాల్ చౌహాన్ (మండోదరి) తదితరులు నటించారు. ఈనెల 16న ఈ చిత్రం విడుదలైంది.