English | Telugu
'జాన్ లూథర్' మూవీ రివ్యూ
Updated : Jul 9, 2023
సినిమా పేరు: జాన్ లూథర్
నటీనటులు: జయసూర్య, అభిజిత్, ఎలాంగో కుమారవేల్, దీపక్ పరంబోల్, సిద్దిక్, ఆత్మీయ రాజన్, దృశ్య రఘునాథ్, శ్రీలక్ష్మి తదితరులు
సినిమాటోగ్రఫీ: రాబి వర్గీస్ రాజ్
ఎడిటింగ్: ప్రవీణ్ ఫ్రభాకర్
సంగీతం: షాన్ రెహమాన్
నిర్మాతలు: థామస్ పి మాథ్యూ
కథ, దర్శకత్వం: అభిజిత్ జోసెఫ్
ఓటీటీ: ఆహా
కొన్ని కథలు ట్రైలర్ చూస్తేనే చూడాలనిపిస్తుంది. మరికొన్ని జానర్ లను బట్టి చూడాలనిపిస్తుంది. అలాంటి వాటిలో క్రైమ్ థ్రిల్లర్ సినిమాలకి ఉండే క్రేజే వేరు. అలాంటి జానర్ కి చెందిందే ఈ 'జాన్ లూథర్' మూవీ. మలయాళ ప్రేక్షకులను ఆకట్టుకున్న ఈ చిత్రం తాజాగా తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఓటీటీ ఫ్లాట్ ఫామ్ 'ఆహా' లోని ఈ సినిమా కథేంటో ఒకసారి చూసేద్దాం.
కథ:
రాత్రి మున్నార్ లోని కొండ ప్రాంతంలో ఒక ప్యాసింజర్ బస్ వెళ్తుండగా ఒక మలుపు దగ్గర బస్ ని ఏదో ఢీకొన్న శబ్దం వినిపిస్తుంది. అదేంటో చూడటానికి డ్రైవర్ తో పాటు అందరూ చూడగా.. బస్ లో ఉన్న ఒక ప్యాసింజర్ బస్ పై నుండి బ్లడ్ రావడం చూసి అరుస్తుంది. వెంటనే బస్ పైకెక్కి చూడగా ఒక అతను చనిపోయి ఉంటాడు. వెంటనే పోలీస్ స్టేషన్ కి సమాచారమివ్వగా.. ఆ ఏరీయా సీఐ మార్టిన్ లూథర్(జయసూర్య) అక్కడికి వస్తాడు. వచ్చి ఎలా జరిగిందని అంతా చూసి ఇన్వెస్టిగేషన్ ని స్టార్ట్ చేస్తాడు. ఆయితే ఆ ఇన్వెస్టిగేషన్ లో ఉండగానే, అతనికి వరుసగా మూడు మిస్సింగ్ కేసులు వస్తాయి. వాటిని విచారిస్తున్న సీఐ మార్టిన్ లూథర్ కి అవన్నీ ఒక కిడ్నాపర్ రాండమ్ గా చేస్తున్నాడని తెలుస్తుంది. అయితే ఆ కిడ్నాపర్ ఎందుకు ఇలా చేస్తున్నాడు? వారు బ్రతికే ఉన్నారా? అసలు హంతకుడెవరని మార్టిన్ తెలుసుకోగలిగాడా లేదా? అనేది మిగతా కథ.
విశ్లేషణ:
బస్ పై పడిన మనిషి ఎవరనేది విచారణ స్టార్ట్ చేసిన మార్టిన్ లూథర్(జయసూర్య) వివరాలు సేకరిస్తుంటాడు. అందులో మార్టిన్ లూథర్ కి సపోర్ట్ గా అతని టీంలో ఫెలిక్స్(దీపక్ పరంబోల్) ఉంటాడు. ప్రతీ ఒక్క డీటెయిల్ ని మార్టిన్ లూథర్ కి చేరవేస్తూ బెస్ట్ సపోర్టింగ్ ఇచ్చాడు ఫీలెక్స్.
అయితే అది యాక్సిడెంట్ అని తెలుసుకున్న మార్టిన్ లూథర్.. అది వర్గీస్ అనే డ్రైవర్ చేసాడని తెలుసుకొని విచారించగా.. అతను వేగంగా ట్రక్ ని నడుపుకుంటూ వస్తుండగా బైక్ డీకొట్టిందని, అందులో ఒకతను కొండమీద నుండి కిందకి పడిపోయాడని చెప్తాడు. అయితే కొండమీద నుండి కింద వెళ్తున్న బస్ పైన లిజో అనే అతను పడిపోతాడు. మరి లిజో తో బైక్ పై ఉన్న రమేష్ అనే వ్యక్తి మిస్ అవుతాడు. దాంతో సీఐ మార్టిన్ మరింత క్షుణ్ణంగా విచారణ చేస్తాడు. ఇలా తను ఒక్కో క్లూ ని తీసుకొని క్రిమినల్ ని కనిపెట్టే విధానం ప్రతీ ఒక్కరికి నచ్చేస్తుంది. సినిమాలో వచ్చే ట్విస్ట్ లు ఎవరు ఊహించలేరు.
మూవీ ప్రథమార్థం నుండి చివరి వరకు సస్పెన్స్ తో పాటు అసలు ట్విస్ట్ తెలిసినప్పుడు ప్రేక్షకులు థ్రిల్ ఫీలవుతారు. కథ ఒక సింపుల్ యాక్సిడెంట్ గా మొదలై.. కాంప్లికేట్ కిడ్నాప్స్ కి దారితీస్తుంది. అయితే వాటిని సాల్వ్ చేస్తూ చేసే ప్రక్రియ బాగుంటుంది. ఇలాంటి మర్డర్ మిస్టరీలు ఇప్పటికీ చాలానే చూసినా ఇది వాటిని కాస్త భిన్నంగా ఉంటుంది. చివరి వరకు ఇన్వెస్టిగేషన్ అనేది ఇంట్రస్టింగ్ గా సాగుతుంది. రాబి వర్గీస్ రాజ్ సినిమాటోగ్రఫీ బాగుంది. ముఖ్యంగా వర్షం పడుతున్నప్పుడు ఆ కొండలని చూపిన తీరు బాగుంది. షాన్ రెహమాన్ సంగీతం పర్వాలేదు. ట్విస్ట్ రివీల్ అయ్యేటప్పుడు వచ్చే బిజిఎమ్ ప్రేక్షకులకు నచ్చేస్తుంది. ప్రవీణ్ ప్రభాకర్ ఎడిటింగ్ నీట్ గా ఉంది. నిర్మాణ విలువలు బాగున్నాయి.
నటీనటుల పనితీరు:
సీఐ జాన్ లూథర్ గా జయసూర్య మెప్పించాడు. తన ఇన్వెస్టిగేషన్ తో చివరివరకు లీనమై నటింటిన తీరు ఆకట్టుకుంటుంది. ఫ్యామిలీ ఎమోషన్స్ ని కూడా డ్యూటీ కోసం త్యాగం చేస్తూ విచారణ చేసే తీరు ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. సీరియల్ కిల్లర్ గా ప్రసాద్ పాత్రలో ఎలాంగో కుమారవేల్ బాగా నటించాడు. ఫెలిక్స్ గా దీపక్ పరంబోల్ మంచి సపోర్టింగ్ ఇచ్చాడు. ఇక మిగిలిన వాళ్ళు వారి పాత్రలకు తగ్గట్టుగా నటించి మెప్పించారు.
తెలుగువన్ పర్ స్పెక్టివ్:
క్రైమ్ థ్రిల్లర్ సినిమాలని ఇష్టపడే వారికి ఈ సినిమా మంచి ఫీస్ట్. చివరి వరకు అసలు హంతకుడెవరు అనే ట్విస్ట్ తో ఆకట్టుకునే ఈ 'జాన్ లూథర్' అందరికీ నచ్చేస్తుంది.
రేటింగ్: 3.5/5
✍🏻.దాసరి మల్లేశ్