English | Telugu
ధృవ సీక్వెల్‌కి ముహూర్తం ఫిక్స్!
Updated : Mar 5, 2023
ధృవ సీక్వెల్‌కి ముహూర్తం ఫిక్సయింది. రామ్ చరణ్ హీరోగా నటించిన సినిమా ధృవ. ఈ సినిమా ఒరిజినల్ వెర్షన్ తమిళ్‌లో తెరకెక్కిన తని ఒరువన్. ఈ చిత్రంలో అక్కడ జయం రవి నటించారు. నయనతార నాయికగా నటించారు. ఇప్పుడు ఈ సినిమాకు అక్కడ సీక్వెల్ చేయడానికి సిద్ధమవుతున్నారు జయం రవి. ఈ సినిమాను 2024లో ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తామని రీసెంట్‌గా చెప్పారు జయం రవి.
20 ఏళ్లుగా సినిమాల్లో నటిస్తున్నారు రవి. ఆయన నటించిన అఖిలన్ సినిమా ట్రైలర్ ఇటీవల చెన్నైలో విడుదలైంది. ఈ వేడుకలో పాల్గొన్న జయం రవి మాట్లాడుతూ "అఖిలన్ సినిమాలో ఆకలి గురించి మాట్లాడాం. అందరినీ కదిలించే విషయాలను ప్రస్తావించాం. తప్పకుండా జనాలకు నచ్చుతుందనే నమ్మకం ఉంది. మార్చి 10న విడుదలవుతున్న అఖిలన్‌ని అందరూ ఆదరించండి" అని అన్నారు.
రెండు దశాబ్దాల కెరీర్‌ని వెనక్కి తిరిగి చూసుకుంటే ఏమనిపిస్తోంది అని అడిగితే "నేను ఆగట్లేదు. వెనక్కి తిరిగి చూడదలచుకోలేదు. అలా చూస్తూ కూర్చుంటే, ఇప్పుడున్న క్షణాలను మిస్ అవుతాం. అందుకే నేను ఆగడం లేదు" అని అన్నారు. భవిష్యత్తులో మాత్రం జయం రవి చాలా మంచి సినిమాలు చేశారని అందరూ అనుకుంటుంటే వినాలని ఉందని చెప్పారు.
ఎప్పుడూ టిప్‌టాప్‌గా రెడీ అయ్యే జయం రవి, అఖిలన్ ప్రెస్‌మీట్లో కాస్త బరువు పెరిగి, సాల్ట్ అండ్ పెప్పర్ లుక్‌లో కనిపించారు. ఈ లుక్ ఏ సినిమా కోసం అని విలేకరులు ప్రశ్నించారు. ప్రతిసారీ లుక్ కేవలం సినిమాల కోసమే ఉండదు, కొన్నిసార్లు షేవింగ్ చేసుకునే సమయం లేకపోయినా ఇలా ఉంటుంది అని అన్నారు జయం రవి.
జయం రవి నటించిన పొన్నియిన్ సెల్వన్ సినిమా ఆల్రెడీ రిలీజ్ అయింది. ఇప్పుడు సీక్వెల్‌ని సిద్ధం చేసే పనుల్లో ఉన్నారు డైరక్టర్ మణిరత్నం. మెడ్రాస్ టాకీస్, లైకా సంస్థ కలిసి నిర్మిస్తున్నాయి. సీక్వెల్‌ని ఏప్రిల్ 28న విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఇటీవల విక్రమ్, జయం రవి, కార్తి మాట్లాడిన బీటీయస్ వీడియో విడుదల చేసింది పొన్నియిన్ సెల్వన్ టీమ్.