English | Telugu
మొదటి సినిమాకే మాస్ రాజాను ఢీ కొడుతున్నాడు!
Updated : Mar 5, 2023
వెంకటేష్, రానా బాటలో దగ్గుబాటి కుటుంబం నుంచి మరో హీరో వస్తున్నాడు. సురేష్ బాబు చిన్న కుమారుడు, రానా సోదరుడు అభిరామ్ 'అహింస' చిత్రంతో హీరోగా పరిచయమవుతున్నాడు. ఆనంది ఆర్ట్ క్రియేషన్స్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి తేజ దర్శకుడు. ఏవో కారణాల వల్ల ఈ సినిమా విడుదల వాయిదా పడుతూ వస్తోంది. అయితే ఎట్టకేలకు తాజాగా మేకర్స్ ఈ చిత్ర విడుదల తేదీని ప్రకటించారు. ఏప్రిల్ 7న ఈ చిత్రం విడుదల కానుందని తెలిపారు.
మాములుగా కొత్త హీరో సినిమాని పెద్ద హీరోలతో పోటీ లేకుండా విడుదల చేస్తుంటారు. కానీ దగ్గుబాటి హీరో అభిరామ్ మాత్రం మాస్ మహారాజా రవితేజతో పోటీకి సై అంటున్నాడు. రవితేజ హీరోగా సుధీర్ వర్మ దర్శకత్వంలో రూపొందుతోన్న 'రావణాసుర' కూడా ఏప్రిల్ 7 నే విడుదల కానుంది. అసలే 'ధమాకా'తో బ్లాక్ బస్టర్ అందుకున్న రవితేజ ఫుల్ జోష్ లో ఉన్నాడు. దానికితోడు ఆయన కీలకపాత్రలో నటించిన 'వాల్తేరు వీరయ్య' కూడా బ్లాక్ బస్టర్ గా నిలిచింది. ప్రస్తుతం ఓ రేంజ్ లో ఫామ్ లో ఉన్న మాస్ రాజాతో అభిరామ్ బాక్సాఫీస్ వార్ కి సిద్ధమవ్వడం ఆసక్తికరంగా మారింది. మరోవైపు అదేరోజు యువహీరో కిరణ్ అబ్బవరం నటించిన 'మీటర్' విడుదల కూడా ఉంది. ఈ పోటీ నడుమ అభిరామ్ మొదటి చిత్రంతో ఎలాంటి ఫలితాన్ని అందుకుంటాడో చూడాలి.