English | Telugu
జానకి జానే మూవీ రివ్యూ
Updated : Jul 12, 2023
మూవీ : జానకి జానే
నటీనటులు: సైజు కురుప్, జానీ ఆంటోని , షరాఫుదీన్, కొట్టాయం నజీర్, నవ్య నయ్యర్, ధ్యాన్ శ్రీనివాసన్, జార్జ్ కోరా, అమార్కలి మరికర్ తదితరులు
సినిమాటోగ్రఫీ: శ్యామ ప్రసాద్ ఎమ్ ఎస్
ఎడిటింగ్: నౌఫల్ అబ్దుల్లా
సంగీతం: కైలాస్ మీనన్
నిర్మాతలు: షెనుగా, షెగ్నా, షెర్గా
రచన, దర్శకత్వం: అనీష్ ఉపాసన
ఓటిటి: డిస్నీ ప్లస్ హాట్ స్టార్
సైజు కురుప్ హీరోగా ప్రముఖ ఓటిటి వేదిక డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో నాలుగు భాషలలో రిలీజైన జానకి జానే అనే సినిమా ఎలా ఉందో ఒకసారి చూసేద్దాం.
కథ:
ఒక ఊరిలోని పేపర్ ప్రింటింగ్ ప్రెస్ లో జానకి(నవ్య నయ్యర్) పనిచేస్తుంటుంది. వాళ్ళ నాన్న చనిపోవడంతో అమ్మ ఒక్కతే ఉంటుంది. దాంతో జానకి కష్టపడి జాబ్ చేస్తే వచ్చిన డబ్బులతో ఇల్లు గడుస్తుంది. అయితే అదే ఊళ్ళో రోడ్డు కాంట్రాక్టర్ గా ఉన్ని ముకుందన్(సైజు కురుప్) పనిచేస్తుంటాడు. వీరిద్దరికి పరిచయం మొదలై ప్రేమగా మారుతుంది. ఉన్ని వాళ్ళ ఇంట్లోవాళ్ళని తీసుకెళ్ళి జానకి వాళ్ళ అమ్మతో మాట్లాడించి తనని పెళ్ళి చేసుకుంటాడు. అయితే జానకి, ఉన్నిల ఫస్ట్ నైట్ రోజు లైట్స్ ఆఫ్ చేయడంతోనే జానకి గట్టిగా అరిచి ఉన్నిని పట్టుకుంటుంది. దాంతో జానకికి చీకటంటే ఎంతభయమో ఉన్నికి అర్థమవుతుంది. మరి జానకి తనకున్న చీకటంటే భయమనే ఫోబియాని దాటగలిగిందా? జానకి భయం తెచ్చిన సమస్యలేంటి? వాళ్ళిద్దరు ఎలా ఎదుర్కొన్నారు? తెలియాలంటే ఈ సినిమా చూడాల్సిందే.
విశ్లేషణ:
జానకికి చిన్నతనం నుండి చీకటి అంటే ఏదో తెలియని భయంతో పెరుగుతుంది. ఒక ప్రింటింగ్ ప్రెస్ లో చేసినప్పిటకి తనకున్న భయం పోదు. అయితే ఈ విషయం తెలిసి కూడా ఉన్ని తనని పెళ్ళి చేసుకున్నాడు. మరి ఉన్నికి జానకి తెచ్చిన సమస్యేంటని చక్కగా చూపించాడు డైరెక్టర్ అనీష్ ఉపాసన.
కథ ఫస్టాఫ్ నుండి ఇంటర్వెల్ వరకు క్యారెక్టర్ల పరిచయానికే సరిపోతుంది. ఫస్టాఫ్ తర్వాత జానకి భయాన్ని రాజకీయాలకి లింక్ చేసిన డైరెక్టర్.. దేన్ని పూర్తిగా అర్థమయ్యేలా చూపించలేకపోయాడు. సినిమాని చూసే ప్రేక్షకులకు ఆ ఇంట్రస్ట్ ని క్రియేట్ చేయలేకపోయాడు. బాగున్నాయని అనిపించే సీన్లు అక్కడఅక్కడా ఒకటో రెండో ఉంటాయి. ఒక సింపుల్ పాయింట్ ని తీసుకొని దానిని సరిగ్గా చూపించే ప్రయత్నంలో డైరెక్టర్ అనీష్ విఫలమయ్యాడు. నటన పరంగా ఒక్కొక్కరిది బాగుంది. కానీ వారు చేసిన నటనకి ఈ కథని సరిగ్గా బ్యాలెన్స్ చేయలేకపోయారు మేకర్స్.
సినిమా సెకండాఫ్ వరకు క్యారెక్టర్ల పరిచయానికి సాగదీసిన మేకర్స్.. ఆ తర్వాత కూడా అదే పద్దతిని ఫాలో అయ్యారు. కథనం వేగంగా కదలదు. సంబంధం లేని క్యారెక్టర్స్ వచ్చిపోతుంటాయి. సాగదీసే సీన్లు చాలానే ఉన్నాయి. అడల్ట్ సీన్లు ఏమీ లేవు. నిడివి కాస్త ఎక్కువ ఉంది. ఈ సినిమాకి నిడివి గంటన్నర కూడా చాలా ఎక్కువే. ఒక సింపుల్ పాయింట్ కోసం ప్రేక్షకుడి ఓపికకి పరీక్ష పెట్టాడు డైరెక్టర్.
సినిమాకి శ్యామ్ ప్రసాద్ ఎమ్ ఎస్ సినిమాటోగ్రఫీ ఎస్సెట్. సన్నివేశాల్లోని మూడ్ ని కెమరాలో బాగా చూపించాడు. కైలాస్ మీనన్ సంగీతం పర్వాలేదనిపించింది. అక్కడ అక్కడ ఎమోషన్స్ కి తగ్గట్టుగా బిజిఎమ్ ఇచ్చాడు కైలాస్ మీనన్. నౌఫల్ అబ్దుల్లా ఎడిటింగ్ ఓకే. కానీ చాలా సీన్లకి కత్తెర వాడాల్సింది. అనీష్ రాసుకున్న కథని సరిగ్గా చూపించి ఉంటే కథ ఇంకా గ్రిస్పింగ్ గా ఉండేది. నిర్మాణ విలువలు బాగున్నాయి.
నటీనటుల పనితీరు:
ఉన్ని ముకుందన్ గా సైజు కురుప్ ఆకట్టుకున్నాడు. జానకిగా నవ్య నయ్యర్ చక్కని హావభావాలను ప్రదర్శించింది. సుకుగా జానీ ఆంటోనీ, లిషన్ గా ధ్యాన్ శ్రీనివాసన్, మను భాస్కర్ గా షరాపుదీన్ వారి వారి పాత్రల పరిధి మేరకు ఆకట్టుకున్నారు.
తెలుగువన్ పర్ స్పెక్టివ్:
ఒక మానసిక సమస్యని ఎలా అధిగమించాలో తెలియజేసే ఈ సినిమాని ఒకసారి చూడొచ్చు.
రేటింగ్: 2/5
✍🏻. దాసరి మల్లేశ్