English | Telugu

లిక్కర్ కిక్కులో ‘జైలర్‌’ విలన్‌... అరెస్ట్‌ చేసిన పోలీసులు!

సాధారణంగా నటీనటులెవరైనా తమ మనసుకు దగ్గరగా ఉన్న క్యారెక్టర్లకే ఎక్కువ న్యాయం చెయ్యగలుగుతారు. దర్శకులు కూడా ఎవరికి ఏ క్యారెక్టర్‌ సూట్‌ అవుతుందని చూసి మరీ ఇచ్చిన సందర్భాలు కూడా ఉంటాయి. ఇక నెగెటివ్‌ క్యారెక్టర్లు చేసే నటీనటులు కూడా నిజజీవితంలో అలాంటి మనస్తత్వమే కలిగి ఉంటారు. అయితే అందరి విషయంలో అలా ఉండకపోవచ్చు కానీ, ఎక్కువ శాతం అలాగే ఉంటారు. సినిమాల్లో చేసే గొడవ, రగడ, రౌడీయిజం నిజ జీవితంలో కూడా చూపించాలని, జనాన్ని భయపెట్టాలని చూస్తుంటారు. అలాంటి వారే అప్పుడప్పుడు వార్తల్లోకి వస్తుంటారు.
తాజాగా అలాంటి ఘటనే కేరళలోని ఎర్నాకుళంలో జరిగింది. ‘జైలర్‌’ చిత్రంలో ఒక భయానక విలన్‌గా కనిపించిన వినాయకన్‌కు వివాదాలు కొత్తకాదు. ఎప్పుడూ ఏదో ఒక గొడవలో తన పేరు బయటికి వచ్చేలా ప్రయత్నిస్తూనే ఉంటాడు. తాజాగా మరో కొత్త వివాదంలో గొడవలో చిక్కుకొని అరెస్ట్‌ అయ్యాడు. వినాయకన్‌ నివాసం ఉంటున్న అపార్ట్‌మెంట్‌లో వారిని మద్యం తాగి, ఆ మత్తులో ఇబ్బంది పెడుతున్నాడని పోలీసులకు ఫిర్యాదు చేశారు. వినాయకన్‌ను వెంటనే పోలీస్‌ స్టేషన్‌కు పిలిపించారు. అయితే అప్పటికే అతను మత్తులో ఉన్నాడు. పోలీసులతో కూడా గొడవకు దిగాడు. నచ్చజెప్పేందుకు ఎంత ప్రయత్నించినా వినకపోవడంతో అతనిపై కేసు నమోదు చేసి అరెస్ట్‌ చేశారు. ఆ తర్వాత బెయిల్‌పై విడుదలయ్యాడు.

వినాయకన్‌కి పోలీస్‌ స్టేషన్‌కి వెళ్ళడం, అరెస్ట్‌ కావడం కొత్తేమీ కాదు. గతంలో ఒక మోడల్‌ను వేధించిన కేసులో కూడా అరెస్ట్‌ అయి ఎప్పటిలాగే బెయిల్‌పై బయటకు వచ్చాడు. మలయాళంలో మంచి నటుడుగా పేరు తెచ్చుకున్న వినాయకన్‌ తెలుగులో కల్యాణ్‌రామ్‌ హీరోగా వచ్చిన ‘అసాధ్యుడు’ సినిమాతో తెలుగులో ఎంట్రీ ఇచ్చాడు. తెలుగులో అదే మొదటి, చివరి సినిమా. ఇంతవరకు మళ్ళీ తెలుగులో అతను నటించింది లేదు. విలన్‌గానే ఎక్కువ సినిమాల్లో నటించిన వినాయకన్‌ మంచి డ్యాన్సర్‌, సింగర్‌, మ్యూజిక్‌ డైరెక్టర్‌ కూడా అవడం విశేషమే.