English | Telugu
'హనుమాన్' ట్రైలర్.. సూపర్ హీరో ల్యాండ్ అవుతున్నాడు!
Updated : Dec 12, 2023
తేజ సజ్జా హీరోగా ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో రూపొందుతోన్న పాన్ ఇండియా మూవీ 'హనుమాన్'. ఈ సినిమాపై మంచి అంచనాలు ఉన్నాయి. ఇప్పటికే విడుదలైన టీజర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది. భారీ బడ్జెట్ చిత్రాలను మించేలా విజువల్స్ ఉన్నాయనే ప్రశంసలు అందుకుంది. సంక్రాంతి కానుకగా 2024, జనవరి 12న విడుదల కానున్న ఈ సినిమా కోసం ప్రేక్షకులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. తాజాగా ఈ మూవీ ట్రైలర్ అప్డేట్ ఇచ్చారు మేకర్స్.
'హనుమాన్' సినిమా ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్ లో భాగంగా రాబోతుంది. "యూనివర్స్ లో అత్యంత శక్తివంతమైన సూపర్ హీరోను ఆవిష్కరించే సమయం" అంటూ ఈ మూవీ ట్రైలర్ ను డిసెంబర్ 19న విడుదల చేయనున్నట్లు తెలుపుతూ తాజాగా మేకర్స్ ఓ పోస్టర్ ను వదిలారు. కథానాయుడు తేజ సజ్జా హనుమంతుడిని మనసులో తలచుకుంటున్నట్లుగా భక్తితో నిండిన ఈ పోస్టర్ ఆకట్టుకుంటోంది. డిసెంబర్ 19న విడుదల కానున్న ట్రైలర్.. టీజర్ మాదిరిగానే మెప్పిస్తే 'హనుమాన్' చిత్రంపై అంచనాలు రెట్టింపు అవుతాయి అనడంలో సందేహం లేదు.
ప్రైమ్ షో ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై నిరంజన్ రెడ్డి నిర్మిస్తున్న ఈ సినిమాలో అమృత అయ్యర్ , వరలక్ష్మి శరత్ కుమార్, వినయ్ రాయ్ తదితరులు ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు. శివేంద్ర సినిమాటోగ్రాఫర్ గా వ్యవహరిస్తున్న ఈ చిత్రానికి గౌర హరి, అనుదీప్ దేవ్, కృష్ణ సౌరభ్ సంగీతం అందిస్తున్నారు.