English | Telugu
'చంద్రముఖి-2'ది మామూలు లక్ కాదు
Updated : Sep 4, 2023
"ఎక్కడో జరిగిన ఒక మూమెంట్.. ఇంకెక్కడో జరగాల్సిన మూమెంట్ ని డిసైడ్ చేస్తుంది" అన్నట్లుగా.. సెప్టెంబర్ 28న విడుదల కావాల్సిన 'సలార్' వాయిదా పడటం సెప్టెంబర్ 15న విడుదల కావాల్సిన 'చంద్రముఖి-2'కి కలిసొచ్చింది.
రజనీకాంత్ హీరోగా పి.వాసు దర్శకత్వంలో రూపొందిన 'చంద్రముఖి' 2005 లో విడుదలై ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. తెలుగునాట కూడా ఈ సినిమా విశేష ఆదరణ పొందింది. ఇప్పుడు ఈ సినిమాకి సీక్వెల్ గా 'చంద్రముఖి-2' వస్తోంది. ఇందులో రాఘవ లారెన్స్ హీరోగా నటిస్తున్నాడు. పి.వాసు దర్శకత్వంలో లైకా ప్రొడక్షన్స్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో 'చంద్రముఖి'గా కంగనా రనౌత్ నటిస్తుండటం విశేషం. ఈ సినిమా తెలుగు, తమిళ భాషల్లో సెప్టెంబర్ 15న విడుదల కానుంది.
'చంద్రముఖి' సీక్వెల్ కావడం, లారెన్స్ హారర్ చిత్రాలకు తెలుగునాట మంచి క్రేజ్ ఉండటంతో 'చంద్రముఖి-2' తెలుగులో మంచి వసూళ్ళు రాబడుతుందనే అంచనాలు ఉన్నాయి. అందుకు తగ్గట్లుగానే తెలుగు రాష్ట్రాల థియేట్రికల్ బిజినెస్ కూడా బాగానే జరిగింది. అయితే సెప్టెంబర్ 15న రామ్ పోతినేని, బోయపాటి శ్రీను కాంబినేషన్ లో రూపొందిన మాస్ ఎంటర్టైనర్ 'స్కంద' విడుదలవుతుండటంతో.. తెలుగునాట 'చంద్రముఖి-2' కలెక్షన్స్ కి భారీ గండిపడే అవకాశముందని ట్రేడ్ వర్గాల అంచనా వేశాయి. బరిలో 'స్కంద' ఉంటే.. లారెన్స్ సినిమాలను రెగ్యులర్ గా ఆదరించే మాస్ ప్రేక్షకులు కూడా 'చంద్రముఖి-2'పై ఆసక్తి చూపే అవకాశాలు తక్కువేననే అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. ఈ క్రమంలో సీజీ వర్క్ కారణంగా సెప్టెంబర్ 28న విడుదల కావాల్సిన 'సలార్' వాయిదా పడటం, సలార్ తేదీకి రావాలని 'స్కంద' టీం నిర్ణయం తీసుకోవడం 'చంద్రముఖి-2'కి కలిసొచ్చింది. సెప్టెంబర్ 15న విశాల్ 'మార్క్ ఆంటోనీ' కూడా విడుదలవుతున్నప్పటికీ అది పెద్దగా ప్రభావం చూపే అవకాశంలేదు.