English | Telugu
ఈ విషయంలో సినిమా పెద్దలు ఒక నిర్ణయం తీసుకోవాలి!
Updated : Dec 13, 2025
దీపం ఉండగానే ఇల్లు చక్కదిద్దుకోవాలి.. సినిమా రంగంలోని నటీనటులకు, సాంకేతిక నిపుణులకు ఇది సరిగ్గా వర్తిస్తుంది. దీన్ని పాటించకపోవడం వల్ల గతంలో ఎంతో మంది లెజెండ్స్ ఆర్థికంగా దెబ్బతిన్నారు. వారి జీవిత చరమాంకంలో ఎన్నో కష్టాలు అనుభవించారు. ఇది పాతతరానికి చెందిన నటీనటులకు బాగా వర్తిస్తుంది. ఎందుకంటే అలా నష్టపోయినవారు, చివరి దశలో అష్టకష్టాలు పడినవారు, ఆర్థికంగా ఆసరా లేక ప్రాణాలు కోల్పోయిన వారు ఎంతో మంది ఉన్నారు.
1970కి ముందు సినిమా రంగంలో ఒక వెలుగు వెలిగిన వారు ఆ తర్వాత ఎన్ని ఇబ్బందులు పడ్డారు, చివరికి వారి జీవితం ఎలా ముగిసిపోయింది అనే విషయం అందరికీ తెలుసు. ఆ తర్వాత ఇండస్ట్రీకి వచ్చినవారు మాత్రం ఆర్థికపరమైన విషయాల్లో ఎంతో జాగ్రత్తగా ఉంటున్నారు. తమ కంటే ముందు ఉన్నవారు పడిన ఇబ్బందులు తాము పడకుండా చూసుకుంటున్నారు.
అయినప్పటికీ కొందరు కళాకారులు ఆర్థికంగా వెనకబడిపోయి, ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఆమధ్య నటి పావలా శ్యామల ఆర్థికంగా ఎదుర్కొంటున్న కష్టాల గురించి మీడియాలో వచ్చింది. దాంతో కొందరు నటులు, దర్శకనిర్మాతలు ఆమెకు మద్దతు ఇచ్చారు. అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆమెను హోంలో చేర్పించారు. ఆ తర్వాత తమ వల్ల కాదంటూ ఆ హోం నిర్వాహకులు శ్యామలను, ఆమె కూతుర్ని బయటికి పంపేశారు. అది గమనించిన పోలీసులు.. ఎసీపీ సాయంతో వృద్ధాశ్రమంలో చేర్పించారు.
ఇదిలా ఉంటే.. మరో నటి పాకీజా పరిస్థితి కూడా దయనీయంగా మారిందని తెలుస్తోంది. ఆమధ్య ఆమె గురించి తెలుసుకున్న చిరంజీవి, పవన్‌కళ్యాణ్, నాగబాబు, మోహన్‌బాబు, మంచు విష్ణు వంటి వారు ఆర్థిక సాయం చేశారు. అయితే ప్రస్తుతం ఆమె పరిస్థితి మరింత దారుణంగా తయారైందన్న వార్తలు మీడియాలో వస్తున్నాయి. దీంతో కోనసీమలోని బొబ్బర్లంకలో శ్రీరామ వృద్ధాశ్రమం నిర్వాహకుడు జల్లి కేశవరావు.. పాకీజాకు ఆశ్రయం కల్పించారు. అయితే ఎంతోకాలంగా నటిస్తూ చిత్ర పరిశ్రమకు చేసిన సేవలను గుర్తించి ఆర్థికంగా, ఆరోగ్యపరంగా ఇబ్బందులు పడుతున్న కళాకారులకు ఒక వసతి గృహాన్ని ఏర్పాటు చేస్తే బాగుంటుందని అందరూ సూచిస్తున్నారు. ఈ విషయం గురించి సినిమా పెద్దలు ఆలోచన చేయాలని అభిప్రాయపడుతున్నారు.