English | Telugu

ఈ జాగ్రత్త ముందు ఉండాలి.. ఇప్పుడు బాధపడితే ఏం లాభం?

ఈమధ్య టాలీవుడ్‌ ఓ ట్రెండ్‌ని క్రి యేట్‌ చేసింది. దాన్ని చాలా మంది హీరోలు, దర్శకనిర్మాతలు ఫాలో అవుతున్నారు. అలాగే మిగతా ఇండస్ట్రీలు కూడా ఫాలో అయి లాభాలు చవిచూస్తున్నారు. అదే.. అప్పట్లో సూపర్‌ హిట్‌ అయిన సినిమాలను రీ రిలీజ్‌ చెయ్యడం. ఇటీవలికాలంలో చాలా సినిమాలు అలా రీ రిలీజ్‌ అయి విజయం సాధించాయి. అయితే కొంతమంది నిర్మాతలు తాము సూపర్‌హిట్‌ సినిమాలు చేసినప్పటికీ వాటిని మళ్ళీ రిలీజ్‌ చేసే పరిస్థితి లేకుండా చేసుకున్నారు. ఎందుకంటే ఇప్పుడంటే డిజిటల్‌ వచ్చేసింది. అప్పట్లో అన్ని సినిమాలూ ఫిల్మ్‌తోనే చేసేవారు. ముందు జాగ్రత్త ఉన్న కొందరు నిర్మాతలు ఫ్యూచర్‌లో దేనికైనా పనికి వస్తుందని సినిమాకి సంబంధించిన ఫిల్మ్‌ని భద్రపరిచారు. ఈ విషయాన్ని పెద్దగా పట్టించుకోని నిర్మాతలు ఇప్పుడు బాధపడుతున్నారు. అయితే ఆ ఫిల్మ్‌తో థియేటర్‌లో రిలీజ్‌ చేసే అవకాశం ఇప్పుడు లేదు. దాన్ని ఇప్పుడున్న టెక్నాలజీలోకి మార్చాల్సి ఉంటుంది. ప్రతి ఫ్రేమ్‌ని స్కాన్‌ చేసి 4కె విజువల్స్‌లోకి తీసుకురావాలి. దీనికి దాదాపు 3 నెలల సమయం పడుతుంది. అంతేకాదు, ఈ ప్రాసెస్‌ చెయ్యడానికి 10 లక్షల వరకు ఖర్చవుతుంది. అయినప్పటికీ సూపర్‌హిట్‌ సినిమాలను ఇలా కన్వర్ట్‌ చేసి రీ రిలీజ్‌ చేసి మంచి లాభాల్నే ఆర్జిస్తున్నారు. ఈ విషయంలో ఫిల్మ్‌ని జాగ్రత్త చేయని నిర్మాతలు బాధపడుతున్నారని తెలుస్తోంది.