English | Telugu
'డబుల్ ఇస్మార్ట్' షురూ.. పక్కా ప్లానింగ్ తో పూరి!
Updated : Jul 10, 2023
'ఇస్మార్ట్ శంకర్' తర్వాత బ్లాక్ బస్టర్ కాంబో రామ్ పోతినేని, పూరి జగన్నాథ్, ఛార్మి మరోసారి చేతులు కలిపారు. వీరి కలయికలో 'డబుల్ ఇస్మార్ట్' రానుంది. పూరి కనెక్ట్స్ బ్యానర్ లో పూరి, ఛార్మి నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని రామ్ పుట్టినరోజు సందర్భంగా మేలో ప్రకటించిన సంగతి తెలిసిందే. తాజాగా ఈ చిత్ర పూజా కార్యక్రమాలు నిర్వహించారు. అంతేకాదు షూటింగ్ అప్డేట్ కూడా ఇచ్చారు.
'డబుల్ ఇస్మార్ట్' చిత్రాన్ని ఈరోజు(జూలై 10) పూజా కార్యక్రమాలతో ప్రారంభించారు. ఈ సందర్భంగా పూజా కార్యక్రమంలో పాల్గొన్న రామ్, పూరి, ఛార్మి ఫోటోలను సోషల్ మీడియా వేదికగా మేకర్స్ పంచుకున్నారు. ఈ మూవీ షూటింగ్ జూలై 12 నుంచి ప్రారంభం కానుందని తెలిపారు. ఇప్పటికే ఈ సినిమా 2024, మార్చి 8న విడుదల కానుందని ప్రకటించగా, తాజాగా అదే విషయాన్ని మరోసారి స్పష్టం చేశారు.
'లైగర్' వంటి ఘోర పరాజయం తర్వాత పూరి దర్శకత్వం వహిస్తున్న చిత్రమిది. జూలై 12 నుంచి షూటింగ్ ప్రారంభించి, తొమ్మిది నెలలలోపు మార్చి 8న విడుదల చేయాలని నిర్ణయించడం చూస్తుంటే పూరి పక్కా ప్లానింగ్ తో ముందుకు వెళ్తున్నారు అనిపిస్తోంది. మరి ఈ సినిమాతో ఆయన కమ్ బ్యాక్ ఇస్తారేమో చూడాలి.
మరోవైపు బోయపాటి శ్రీను దర్శకత్వంలో రామ్ 'స్కంద' అనే మూవీ చేస్తున్నారు. ఈ సినిమా సెప్టెంబర్ 15 న పాన్ ఇండియా స్థాయిలో విడుదల కానుంది. ఇదే రామ్ కి మొదటి పాన్ ఇండియా సినిమా. ఇక 'డబుల్ ఇస్మార్ట్' సైతం పాన్ ఇండియా స్థాయిలోనే విడుదల కానుంది.