English | Telugu
'విరూపాక్ష' దర్శకుడి మొదటి సినిమా ఏంటో తెలుసా?
Updated : Apr 25, 2023
'విరూపాక్ష' సినిమాతో ఒక్కసారిగా అందరి దృష్టిని ఆకర్షించారు దర్శకుడు కార్తీక్ దండు. సాయి ధరమ్ తేజ్, సంయుక్త మీనన్ జంటగా కార్తీక్ దర్శకత్వంలో రూపొందిన ఈ హారర్ థ్రిల్లర్ ఏప్రిల్ 21న విడుదలై భారీ వసూళ్లు రాబడుతూ బ్లాక్ బస్టర్ దిశగా దూసుకుపోతోంది. కార్తీక్ దర్శకత్వ ప్రతిభకు అందరూ ఫిదా అవుతున్నారు. కొత్త దర్శకుడు అయినా అద్భుతంగా తెరకెక్కించారని ప్రశంసలు వ్యక్తమవుతున్నాయి. ఐతే నిజానికి కార్తీక్ కి ఇది మొదటి సినిమా కాదు.
2015 లోనే 'భమ్ బోలేనాథ్' అనే చిత్రాన్ని చేశారు కార్తీక్ దండు. నవదీప్, పూజా ఝవేరి, నవీన్ చంద్ర, ప్రదీప్ మాచిరాజు ముఖ్య పాత్రలు పోషించిన ఈ సినిమా గురించి ప్రేక్షకులకు పెద్దగా తెలియనప్పటికీ.. చూసిన వారి చేత మాత్రం పరవాలేదు అనిపించుకుంది. ఆ సినిమా వచ్చిన ఎనిమిదేళ్ల తర్వాత ఇప్పుడు 'విరూపాక్ష'తో అదిరిపోయే కమ్ బ్యాక్ ఇచ్చారు కార్తీక్. అయితే ఆయన రెండో సినిమాకి ఇంత సమయం తీసుకోవడానికి అనారోగ్య సమస్యలు కారణం కావొచ్చు. ఎందుకంటే ఈ సినిమాకి స్క్రీన్ ప్లే అందించడంతో పాటు నిర్మాణ భాగస్వామిగా ఉన్న ప్రముఖ దర్శకుడు సుకుమార్ ప్రీరిలీజ్ ఈవెంట్ లో మాట్లాడుతూ.. కార్తీక్ తీవ్ర అనారోగ్య సమస్యను ఎదుర్కొన్నాడని, ఐదారేళ్లకు మించి బ్రతకడని వైద్యులు చెప్పారని అన్నారు. ఆ సమయంలో ఒక్క సినిమా అయినా చేసి చనిపోవాలనుకున్నాడని, అతని తల్లి ఆశీర్వాదం వల్ల అలాంటి పరిస్థితి నుంచి కోలుకొని ఇప్పుడు విరూపాక్ష తీశాడని సుకుమార్ చెప్పుకొచ్చారు. సుకుమార్ మాటలను బట్టి చూస్తే అనారోగ్యం కారణంగానే కార్తీక్ కొన్నేళ్లు దర్శకత్వానికి దూరంగా ఉన్నారని అనిపిస్తోంది.