English | Telugu
టైగర్.. కాన్ఫిడెన్సా? ఓవర్ కాన్ఫిడెన్సా?
Updated : Oct 16, 2023
మాస్ మహారాజా రవితేజ టైటిల్ రోల్ పోషించిన లేటెస్ట్ మూవీ 'టైగర్ నాగేశ్వరరావు'. అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ నిర్మించిన ఈ పాన్ ఇండియా మూవీకి వంశీ దర్శకుడు. దసరా కానుకగా అక్టోబర్ 20న ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. ఇప్పటికే విడుదలైన ట్రైలర్ కి సూపర్ రెస్పాన్స్ వచ్చింది. అయితే ఈ సినిమా నిడివే రవితేజ ఫ్యాన్స్ ని కాస్త ఆందోళనకు గురి చేస్తోంది. ఎందుకంటే ఈ సినిమా నిడివి ఏకంగా 3 గంటల 2 నిమిషాలు. అయితే ఈ చిత్ర దర్శకుడు వంశీ మాత్రం అసలు ఆందోళన అక్కర్లేదని, ఇంకో 30 నిమిషాలు ఉన్నా సినిమా చూస్తారని, అంత అద్భుతంగా ఉంటుంది అంటూ ధీమా వ్యక్తం చేస్తున్నారు.
తాజాగా 'టైగర్ నాగేశ్వరరావు' ప్రీ రిలీజ్ ఈవెంట్ జరిగింది. ఈ సందర్భంగా సినిమా గురించి డైరెక్టర్ వంశీ మాట్లాడిన మాటలు హాట్ టాపిక్ గా మారాయి. "సినిమా గురించి నాకు ఏమాత్రం భయంలేదు. అందరూ అడుగుతున్నారు టెన్షన్ లేదా అని.. టెన్షన్ అసలు లేదు. ఎందుకంటే నేను సినిమా చూశాను. మీరు సినిమా ఎలా ఉంటుంది అనుకుంటున్నారో దానిని మించి ఉంటుందని ప్రామిస్ చేస్తున్నాను. రెండు గంటలా, రెండున్నర గంటలా, 2 గంటల 45 నిమిషాల అనేది కాదు.. మీరు చూసిన ప్రతి క్షణం ఎంజాయ్ చేస్తారు. బయటకు వచ్చి ఇంకో అరగంట సేపు చూడాలి అనుకుంటారు. ఎందుకంటే టైగర్ నాగేశ్వరరావుగా రవితేజ చేశారు. స్క్రీన్లు చిరిగిపోతాయని మాత్రం ప్రామిస్ చేస్తున్నాను. తెలుగు సినీ పరిశ్రమకి బెస్ట్ ఫిల్మ్ ఇస్తానని గతంలోనే చెప్పాను. ఇప్పుడు కూడా అదే చెప్తున్నాను. బెస్ట్ ఫిల్మ్ ఇస్తున్నాను." అని వంశీ అన్నారు.
'టైగర్ నాగేశ్వరరావు' పట్ల దర్శకుడు వంశీకి ఎంతో నమ్మకంగా ఉందని ఆయన స్పీచ్ ని బట్టి అర్థమవుతోంది. అయితే ఆయనది కాన్ఫిడెన్సా? ఓవర్ కాన్ఫిడెన్సా? అనేది అక్టోబర్ 20న తేలనుంది.