English | Telugu
మరోసారి తన హవా చూపించిన దిల్ రాజు
Updated : Jul 31, 2023
తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ (టీఎఫ్‌సీసీ) నూతన అధ్యక్షుడిగా ప్రముఖ నిర్మాత దిల్ రాజు ఎన్నికయ్యారు. ఈ ఎన్నికల్లో దిల్‌రాజు, సి.కల్యాణ్ ప్యానెల్‌లు పోటీ పడ్డాయి. ఆదివారం హైదరాబాద్‌లో జరిగిన ఎన్నికల్లో ప్రత్యర్థి నిర్మాత సి.కల్యాణ్ పై దిల్ రాజు విజయం సాధించారు. మొత్తం 2,262 సభ్యులకు గాను 1,339 ఓట్లు పోలయ్యాయి. ప్రొడ్యూసర్ సెక్టార్, స్టూడియో సెక్టార్ లో దిల్ రాజుకి ఆధిక్యం రాగా, డిస్ట్రిబ్యూషన్ సెక్టార్ లో మాత్రం దిల్ రాజు తో పాటు సి.కల్యాణ్ కి సమాన మద్దతు లభించింది. దీంతో ఎగ్జిబిటర్స్ ఓట్లు కీలకంగా మారగా, ఆ ఓట్లలో దిల్ రాజు హవా చూపించారు. అలా టీఎఫ్‌సీసీ నూతన అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. టాలీవుడ్ లో దిల్ రాజు హవా ఏ రేంజ్ లో ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆయన టీఎఫ్‌సీసీ ఎన్నికల బరిలో దిగుతున్నారు అన్నప్పటి నుంచే, ఆయన గెలుపు ఖాయమనే అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. ఊహించినట్లుగానే టీఎఫ్‌సీసీ ఎన్నికల్లో దిల్ రాజు సత్తా చాటారు.
తనను గెలిపించిన సభ్యులకు దిల్‌రాజు కృతజ్ఞతలు తెలిపారు. "మేము అందరం కలసి పని చేస్తాం. ఇవి రాజకీయ ఎన్నికలు కాదు. ఈరోజు నుంచి ఇండస్ట్రీ కి సంబంధించిన సమస్య లు పరిష్కారం కోసం కలసి పని చేస్తాం." అని దిల్ రాజు అన్నారు.
కాగా టీఎఫ్‌సీసీ ఉపాధ్యక్షుడిగా ముత్యాల రామదాసు, కార్యదర్శిగా దామోదరప్రసాద్, కోశాధికారిగా ప్రసన్నకుమార్ ఎన్నికయ్యారు.