English | Telugu
‘పుష్ప2’లో అది మైండ్ బ్లోయింగ్ సీక్వెన్స్: దేవిశ్రీ ప్రసాద్
Updated : Sep 10, 2023
అల్లు అర్జున్, సుకుమార్ కాంబినేషన్‌లో వచ్చిన ‘పుష్ప’ ఎంతటి సంచలనం సృష్టించిందో అందరికీ తెలిసిందే. అంతేకాదు, నేషనల్ అవార్డులను సైతం గెలుచుకున్న ఈ సినిమాకి సీక్వెల్‌గా ‘పుష్ప2’ రాబోతున్న నేపథ్యంలో ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొని వున్నాయి. మొదటి భాగం కంటే ఎంతో గొప్పగా రెండో భాగాన్ని తీర్చిదిద్దాల్సిన బాధ్యత సుకుమార్‌పై ఉంది. దానికి తగ్గట్టుగానే సుకుమార్ ఎంతో కృషి చేస్తున్నాడు. సినిమా ఔట్‌పుట్ మామూలుగా వుండదని యూనిట్ మెంబర్స్ చెబుతున్నారు.
ఇటీవల చెన్నయ్‌లో జరిగిన ఓ కార్యక్రమంలో సంగీత దర్శకుడు దేవిశ్రీప్రసాద్ సినిమాకి సంబంధించిన ఇంట్రెస్టింగ్ అంశాలను అందరితో పంచుకున్నారు. ‘‘పుష్ప2’ కోసం ప్రేక్షకులు, అభిమానులు ఎంత ఆతృతగా ఎదురుచూస్తున్నారో నేను కూడా అంతే ఆసక్తితో సినిమా రిలీజ్ కోసం ఎదురుచూస్తున్నాను. ఈ సినిమా గురించి ఏం చెప్పినా, ఏం చెప్పకపోయినా ఒక్క విషయం మాత్రం చెప్పగలను. మీరెవ్వరూ ఊహించని విధంగా ఈ సినిమా ఉంటుంది. ఇదొక అద్భుతమైన స్క్రిప్ట్. ఈ సినిమాలో ఒక సీక్వెన్స్ ఉంటుంది. మైండ్ బ్లోయింగ్‌గా ఉంటుంది. ఆ సీక్వెన్స్‌కి సంబంధించిన విజువల్స్ చూశాను. మీరంతా ఆ సీక్వెన్స్ చూసి సర్‌ప్రైజ్ అవుతారు. ఇంతకంటే సినిమా గురించి ఎక్కువగా చెప్పలేను’ అంటూ సినిమా గురించి ఎంతో ఎక్సైటింగ్ చెప్పారు దేవి.