English | Telugu
దయా వెబ్ సిరీస్ రివ్యూ
Updated : Aug 5, 2023
వెబ్ సిరీస్ : దయా
నటీనటులు: జేడీ చక్రవర్తి, ఈషా రెబ్బా, విష్ణుప్రియ, రమ్య నంబీసన్, కమల్ కామరాజు, బబ్లూ పృథ్విరాజ్, కేశవ్, జోష్ రవి, గాయత్రీ గుప్తా, భాను, మోయిన్, తదితరులు.
స్క్రీన్ ప్లే: వసంత్
ఎడిటింగ్: విప్లవ్ న్యాశాడం
సినిమాటోగ్రఫీ: వివేక్ కాలేపు
డైలాగ్స్: రాకెందు మౌళి.
మ్యూజిక్: శ్రవణ్ భరద్వాజ్
నిర్మాతలు: శ్రీకాంత్ మొహ్తా, మహేంద్ర సోని
దర్శకత్వం: పవన్ సాధినేని
విలక్షణ నటుడు జేడీ చక్రవర్తి నటించిన తొలి వెబ్ సిరీస్ ' దయా'.. అతని నటనకి ఇప్పటికి ఫ్యాన్స్ ఉన్నారు. జేడి చక్రవర్తి కమ్ బ్యాక్ కథగా ఈ 'దయా' వచ్చింది. మరి డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లోని ఈ వెబ్ సిరీస్ ఎలా ఉందో ఒకసారి చూసేద్దాం.
కథ:
దయా(జేడీ చక్రవర్తి).. పోర్ట్ ఏరియాలోని చేపలను ఒకచోటు నుండి మరొక చోటుకి ఫ్రీజర్ వ్యాన్ లో తీసుకెళ్తాడు. అయితే తన భార్య కవిత(ఈషా రెబ్బా) ప్రెగ్నెంట్ గా ఉంటుంది. తన డెలివరీకి డేట్ దగ్గర పడుతుండటంతో, డబ్బుల కోసం దయా.. ఎక్కువ సమయం నిద్ర లేకుండాకష్టపడుతుంటాడు. అయితే రెండు రోజులు కష్టపడ్డాక ఇంటికి వెళ్దామనుకునే సమయంలో.. రాజమండ్రికి లోడ్ తీసుకెళ్ళాలని ఒక డీల్ వస్తుంది. ఎక్కువ మొత్తం డబ్బులని ఇస్తామని చెప్పి లోడ్ చేస్తారు. అయితే అతను లోడ్ తీసుకుని వెళ్తుండగా ఒక దగ్గర ఆగి చూస్తే ఆ వ్యాన్ లో ఒక అమ్మాయి శవం కనిపిస్తుంది. అయితే అదే విషయం అతనితో పాటు ఉండే క్లీనర్ ప్రభా(జోష్ రవి) తో చెప్తాడు. అయితే అతను(జోష్ రవి) శవాన్ని వదిలించుకుందామని ఒక దగ్గర పాతిపెట్టడానికి ప్లాన్ చేస్తారు. అయితే అక్కడ నుండి అసలు ట్విస్ట్ స్టార్ట్ అవుతుంది. అతను వదిలించుకుందామనుకున్న శవం.. ఒక ప్రముఖ టీవి ఛానెల్ జర్నలిస్ట్ కవితా నాయుడు( రమ్య నంబీసన్) ది అని తెలుస్తుంది. కవితా నాయుడు గురించి తెలుసుకోవాలని ఆమె భర్త కౌశిక్( కమల్ కామరాజ్) మిస్సింగ్ కంప్లైంట్ ఇస్తాడు. దాంతో ఒక స్పెషల్ ఆఫీసర్ తో ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేస్తారు పోలీసులు. అయితే ఈ కవితా నాయుడుని హత్య చేసిందెవరు? దయా ఈ కేస్ నుండి బయటపడ్డాడా? అసలు ఆ శవం దయా వ్యాన్ లోకి ఎవరు తీసుకొచ్చి పెట్టారో తెలియాలంటే ఈ సిరీస్ చూడాల్సిందే.
విశ్లేషణ:
గొడవలన్న, పోలీసులన్న భయపడే దయా(జేడీ చక్రవర్తి).. తన ఫ్యామిలీని చూసుకుంటూ ఫ్రీజర్ వ్యాన్ నడుపుతుంటాడు. అయితే అలా సాఫీగా సాగుతున్న అతని లైఫ్ లోకి అనుకోకుండా ఒక సమస్య ఎదురవుతుంది. తను నడుపుతున్న వ్యాన్ లో ఒక శవం.. ఆ శవం ఎవరిది, ఎవరు తీసుకొచ్చారు. దయా ఏం చేశాడనేదే ఈ కథ.
ఈ సిరీస్ మొత్తంగా ఎనిమిది ఎపిసోడ్ లు ఉన్నాయి. ప్రతీ ఎపిసోడ్ లో ఒక్కో క్లూని, ఒక్కో ట్విస్ట్ ని ఇస్తూ ఆసక్తికరంగా సాగుతుంది. మొదటి మూడు ఎపిసోడ్ ల వరకు కథలోని పాత్రల పరిచయం, వారి వెనుక ఉన్న కథ, వాటిని లింక్ చేస్తూ ప్రస్తుతం సాగుతున్న క్రైమ్ ఇన్వెస్టిగేషన్.. ఇలా ఒక ఫ్లోలో వెళ్తుందనుకునే సమయంలో కథ ఒక మలుపు తిరుగుతుంది. కవితా నాయుడు చివరి సారిగా ఒక ఇంటర్వ్యూ చేస్తుంది. దానికి సంబంధించిన పెన్ డ్రైవ్ ఒకటి మిస్ అవుతుంది. దానికోసం ఎమ్మెల్యే పరశురామ రాజు(బబ్లూ పృథ్విరాజ్) ని కలిసిన తర్వాత మిస్ అయిందని తెలుస్తుంది. దీంతో కథ మరింత ఇంటెన్స్ గా వెళుతుంది.
మొదటి ఎపిసోడ్ నుండి మూడు ఎపిసోడ్ ల వరకు కాస్త నెమ్మదిగా సాగుతుంది. నాల్గవ ఎపిసోడ్ ' ది ట్విస్ట్ ' తో కథ పూర్తిగా మలుపు తిరుగుతుంది. ఈ ఎపిసోడ్ చివర్లో దయా(జేడీ చక్రవర్తి) ఎవరనే ఇంటెన్స్ స్టార్ట్ అయి చివరి ఎపిసోడ్ వరకు సాగుతుంది. అయితే అయిదవ ఎపిసోడ్ లో ' ది ఎవిడెన్స్ ' లో దయా గతమేంటని, అతని భార్య అలివేలు గురించి చిన్న క్లూతో మరింత ఆసక్తిని పెంచుతూ ముగుస్తుంది.
దయా చుట్టూ కథ తిరుగుతూనే ఒక నిజాన్ని వెలికితీయడంలో ఎంత మంది బలి అవుతున్నారో తెలుస్తుంది. ప్రయోగాల పేరిట చేస్తున్న ఒక సీక్రెట్ ఆపరేషన్ బయటపడుతుంది. మరి ఆ సీక్రెట్ గా చేస్తున్న ప్రయోగాలకి ఎమ్మెల్యే పరశురామ రాజు(బబ్లూ పృథ్విరాజ్) కి గల సంబంధం ఏంటి.. లాంటి ట్విస్ట్ లు ప్రేక్షకులని కట్టిపడేస్తాయి. ఆ తర్వాత ఏం జరుగుతుందనే ఆసక్తిని కలుగజేస్తుంది.
ఇలా ఎపిసోడ్ ఎపిసోడ్ కి అంచనాలు మారిపోతుంటాయి. కథలో వేగం పెరుగుతుంది. చివరి ఎపిసోడ్ వరకు దయా ఎవరనే క్యూరియాసిటిని ఉంచేసి, లానే వదిలేశాడు డైరెక్టర్. దయా భార్యా అలివేలు గతమేంటో కూడా పూర్తిగా చూపించలేదు. అలాగే కబీర్ అనే వ్యక్తి వరుసగా హత్యలు చేస్తుంటాడు. అతనెవరి మనిషి అనేది అలానే వదిలేశాడు. ఇలా కొన్నింటికి సరైన ముగింపుని ఇవ్వకుండా అలానే వదిలేశాడు డైరెక్టర్. గ్రిస్పింగ్ కథకి, శ్రవణ్ భరద్వాజ్ ఇచ్చిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ప్లస్ అయింది. ఎడిటింగ్ లో విప్లవ్ మొదటి మూడు ఎపిసోడ్ లలో కత్తెరని వాడాల్సింది. వివేక్ కాలేపు సినిమాటోగ్రఫీ ఆకట్టుకుంది. నిర్మాణ విలువలు బాగున్నాయి.
నటీనటుల పనితీరు:
దయా పాత్రలో జేడీ చక్రవర్తి ప్రాణం పెట్టి చేశాడు. అమాయకుడిగా, ఫ్యామిలీ మెన్ లా, అండర్ కవర్ లా జేడీ చక్రవర్తి ఒదిగిపోయాడు. అలివేలు పాత్రలో చేసిన ఈషా రెబ్బా స్క్రీన్ స్పేస్ తక్కువే అయిన ఎక్కువ ఇంపాక్ట్ క్రియేట్ చేసింది. గట్స్ ఉన్న జర్నలిస్ట్ కవితా నాయుడు పాత్రలో రమ్య నంబీసన్ ఒదిగిపోయింది. కవితా నాయుడు భర్త కౌశిక్ పాత్రలో కమల్ కామరాజు ఆకట్టుకున్నాడు. క్లీనర్ ప్రభా పాత్రలో జోష్ రవి, జర్నలిస్ట్ గా విష్ణుప్రియ ఆకట్టుకుంది. ఇక మిగిలిన వాళ్ళు వారి పాత్రలకు న్యాయం చేశారు.
తెలుగువన్ పర్ స్పెక్టివ్:
జేడీ చక్రవర్తి కమ్ బ్యాక్ గా వచ్చిన ఈ దయా అన్ని వర్గాల వారిని ఆకట్టుకుంది. క్రైమ్ థ్రిల్లర్ సినిమాలలో అడల్ట్ సీన్స్ కామన్ గా ఉండేవే.. అలాగే ఇందులోనూ కొన్ని అడల్ట్ సీన్స్ ని, ల్యాగ్ సీన్స్ ని పక్కన పెడితే చివరి వరకు థ్రిల్ ని ఇచ్చే ఈ వెబ్ సిరీస్ ని హ్యాపీగా చూసేయొచ్చు.
రేటింగ్: 3 / 5
✍🏻. దాసరి మల్లేశ్