English | Telugu
కళ్ళు తిరిగి పడిపోయిన సీఎం.. నందమూరి హీరో పనేనా!
Updated : Nov 13, 2023
నందమూరి కుటుంబం నుంచి మరో కొత్త హీరో వస్తున్నాడు. ఆ కుటుంబంలో ఎన్టీఆర్ తర్వాత బాలకృష్ణ, జూనియర్ ఎన్టీఆర్ ఆ స్థాయిలో పేరు తెచ్చుకున్నారు. హరికృష్ణ, తారకరత్న నటులుగా ఆకట్టుకున్నారు కానీ స్టార్స్ కాలేకపోయారు. కళ్యాణ్ రామ్ ఉన్నంతలో బాగానే రాణిస్తున్నాడు. ఇక ఇప్పుడు నందమూరి కుటుంబం నుంచి మరో నటుడు ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమవుతున్నాడు. అతనే నందమూరి చైతన్య కృష్ణ.
ఎన్టీఆర్ పెద్ద కొడుకు జయకృష్ణ కుమారుడైన చైతన్య కృష్ణ 'బ్రీత్' అనే సినిమాతో హీరోగా పరిచయమవుతున్నాడు. బసవతారకరామ క్రియేషన్స్ బ్యానర్ లో రూపొందుతోన్న ఈ చిత్రానికి వంశీకృష్ణ ఆకెళ్ళ దర్శకుడు. 'వైద్యో నారాయణో హరి' అనేది ఈ చిత్ర ఉప శీర్షిక. ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్, టీజర్ ఆకట్టుకున్నాయి. తాజాగా ట్రైలర్ ను విడుదల చేశారు.
తెలంగాణ ముఖ్యమంత్రి కళ్ళు తిరిగి పడిపోవడం, ఆయన చికిత్స పొందుతోన్న హాస్పిటల్ లోకి పేషెంట్ లా హీరో ఎంటర్ అవ్వడం వంటి సన్నివేశాలతో 'బ్రీత్' ట్రైలర్ ఆసక్తికరంగా ప్రారంభమైంది. "వీడు పేషెంట్ అయితేనే మన సిచువేషన్ ఇలా ఉంటే.. డాక్టర్ అయితే మన పరిస్థితి ఏంట్రా?", "ఇప్పటి వరకు ప్రపంచం చూడని ఒక కొత్త క్రైమ్ జరుగుతుంది" వంటి డైలాగ్ లు, అదిరిపోయే బ్యాక్ గ్రౌండ్ స్కోర్ తో ట్రైలర్ ఎంతో ఇంటెన్స్ తో సాగింది. సీఎం ఆస్పత్రిపాలు కావడానికి హీరోనే కారణమా?.. అసలు అతను ఎవరు?, ఇదంతా ఎందుకు చేస్తున్నాడు? అనే ఆసక్తిని రేకెత్తిస్తూ రూపొందించిన 'బ్రీత్' ట్రైలర్ ఆకట్టుకుంటోంది. మరి బ్రీత్ సినిమాతో ఈ నందమూరి కొత్త హీరో ఎలాంటి ఫలితాన్ని అందుకుంటాడో చూడాలి.