Read more!

English | Telugu

'క్రిస్టఫర్' మూవీ రివ్యూ

సినిమా పేరు: క్రిస్టఫర్
తారాగణం: మమ్ముట్టి, స్నేహ, అమలా పాల్, ఐశ్వర్య లక్ష్మి, వినయ్ రాయ్, శరత్ కుమార్ తదితరులు.
ఎడిటింగ్: మనోజ్
సంగీతం: జస్టిన్ వర్గీస్
సినిమాటోగ్రఫీ: ఫైయిజ్ సిద్ధిక్
కథ: ఉదయ్ కృష్ణ
డైరెక్టర్: బి. ఉన్నికృష్ణన్
ఓటీటీ: అమెజాన్ ప్రైమ్ వీడియో

మమ్ముట్టి కీలకపాత్రలో నటించి‌న క్రిస్టఫర్ గత నెలలో మలయాళంలో థియేటర్లలో విడుదలైంది. కాగా ఇప్పడు ఓటీటీ వేదిక అమెజాన్ ప్రైమ్ వీడియోలో తెలుగులోకి డబ్ చేసారు. ఈ సినిమా కథ ఏంటి? సినిమా ఎలా ఉందో? ఒకసారి చూసేద్దాం...


కథ:

కేరళలోని ఓ ఊరిలో ఒకమ్మాయిని గుర్తు తెలియని కొందరు దుండగులు అతి దారుణంగా రేప్ చేసి పడేయడంతో కథ మొదలవుతుంది. ఆ కేస్ ని పదే పదే టెలికాస్ట్ చేస్తూ లోకల్ మీడియా, నేషనల్ మీడియా హైలైట్ చేయడంతో.. ఇది రాష్ట్రం మొత్తం హాట్ టాపిక్ అవుతుంది. దీంతో ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి ఇన్వెస్టిగేషన్ చేయడానికి ఈ కేస్ ని ఎన్ కౌంటర్ స్పెషలిస్ట్ అయిన క్రిస్టఫర్(మమ్ముట్టి)కి అప్పగిస్తాడు. ఆ కేస్ ని సాల్వ్ చేసిన క్రిస్టఫర్.. గ్యాంగ్ రేప్ చేసిన వాళ్ళని పట్టుకొని ఎన్ కౌంటర్ చేస్తాడు. దాంతో క్రిస్టఫర్ కి జనాలు, మీడియా ప్రశంసలు కురిపిస్తాయి. ఇదిలా ఉండగా అక్కడి కలెక్టర్ బీనా మరియం(స్నేహ) అక్కడి ఏడీజీపీ తో కలిసి రీ-ఇన్వెస్టిగేషన్ చేపిస్తుంది. ఆ ఇన్వెస్టిగేషన్ భాధ్యతలు సులేఖ(అమలా పాల్) తీసుకుంటుంది. దీంట్లో భాగంగా తను క్రిస్టఫర్ ఇలా ఎందుకు మారాడని, అతని కంప్లీట్ బయోగ్రఫీ తెలుసుకోవాలని తన కింద స్థాయిలో ఉన్న ఆఫీసర్స్ ని ఆదేశిస్తుంది. సులేఖ ఈ ఇన్వెస్టిగేషన్ లో ఏం తెలుసుకుంది? క్రిస్టఫర్ ఇలా మారడానికి కారణం ఏంటి? తెలియాలంటే సినిమా చూడాల్సిందే.


విశ్లేషణ:

హ్యుమన్ రైట్స్ కి వ్యతిరేకంగా ఒక సిన్సియర్ ఆఫీసర్ చేసే డ్యూటీని వివరిస్తూ ఈ కథ మొదలవుతుంది. గ్యాంగ్ రేప్ చేసినవాళ్ళను పోలీసులు అరెస్టు చేసి తీసుకెళ్తుంటారు. వాళ్ళు నేరస్తులా కాదా అనే విషయం న్యాయ విచారణ జరుగకుండానే ఎన్ కౌంటర్ చేస్తాడు క్రిస్టఫర్ (మమ్ముట్టి). దీన్ని సమర్థిస్తూ నేషనల్ మీడియా పబ్లిసిటీ. అసలు కథ మొత్తం క్రిస్టఫర్ గురించి తెలుసుకోవడమే.. కానీ ఈ కథలో అతనితో పాటు మిగిలిన పాత్రలను ఎందుకు తీసుకున్నాడో అర్థం కాదు. కలెక్టర్, డీజీపి, ఏడీజీపి, సీఎమ్ అంటూ ఇన్ని పాత్రల మధ్య క్రిస్టఫర్ ని ఎలివేట్ చేయడమనేది చూడటానికి కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. ఇదే ఈ సినిమా కథ. గొప్పగా చెప్పడానికి ఏమీ లేదు.

క్రిస్టఫర్ అని టైటిల్ పెట్టి అతనికి ఎలివేషన్ ఇవ్వడం కోసం డైరెక్టర్ మిగిలిన పాత్రలను వాడుకున్నాడంతే.. క్రిస్టఫర్ ఫ్లాష్ బ్యాక్ సీన్లు కూడా ఎందుకు ఉన్నాయా అనిపించేలా తీసాడు. సినిమా నిడివి రెండు గంటల ముప్పై నిమిషాలు. ఈ కథకి గంట కూడా చాలా ఎక్కువ. అసలు ఏమీ లేని కథకి గంట సేపు చూడటం కూడా ఎక్కువే. స్ట్రాంగ్ క్యారెక్టర్ అంటూ ఈ సినిమా మొత్తంలో ఒక్కటి కూడా లేదు. ఏ పాత్ర ఎందుకు వస్తుందో అర్థం కానీ ప్రశ్నగా మిగిలిపోతుంది. ఐదారు క్రైమ్, సస్పెన్స్ థ్రిల్లర్ సినిమాలని కలిపి తీసినట్టుగా సీన్లు కనిపిస్తుంటాయి. రోటీన్ పోలీస్ డ్రామా. ఈ సినిమా మొత్తంలో విలన్ ఉన్నాడంటే ఆశ్చర్యపోవాల్సిందే. మొదట జైలులో అతడిని చూపిస్తారు.. చివరిదాకా జైలులోనే ఉంటాడు. మధ్యలో ఒకట్రెండు నిమిషాలు బయట కన్పిస్తాడంతే.

కొచ్చిన్ లో కలెక్టర్ గా బీనా మరియం(స్నేహ) చేస్తుంటుంది. కానీ పవర్స్ అన్నీ క్రిస్టఫర్ కి ఉన్మట్టుగా చూపిస్తారు. అతను ఏం చేసినా అతనికే అందరూ సపోర్ట్ చేయడం లాంటి కొన్ని సీన్లు ఉన్నాయి. కొంచెం కూడా లాజిక్ లేని సీన్స్. దీనికి తోడు చాలా ల్యాగ్ సీన్లు. ఎడిటర్ మనోజ్ ట్రిమ్ చేయడం మర్చిపోయినట్టున్నాడు. కథని డైరెక్టర్ ఎలా తీసాడో అలాగే పేర్చేసాడు. ఇలాంటి క్రైమ్ థ్రిల్లర్ కి బిజిఎమ్ బాగుంటేనే కథలో ప్రేక్షకుడు లీనమవుతాడు. జస్టిన్ వర్గీస్ సంగీతం కుదరలేదు. ఫైయిజ్ సిద్ధిక్ సినిమాటోగ్రఫీ పర్వాలేదనిపించింది. క్రిస్టఫర్ (మమ్ముట్టి) ని బాగా చూపించాడు. రీపీటెడ్ సీన్స్, స్లో స్క్రీన్‌ప్లే, సస్పెన్స్ కూడా ఏమీ లేకపోగా థ్రిల్లింగ్ ఎక్కడో మిస్ అయింది. కంటెంట్ లేని కథని లాగ్ చేస్తూ క్రైమ్ థ్రిల్లర్ పేరుతో తీసాడు డైరెక్టర్. నిర్మాణ విలువలు బాగున్నాయి.

నటీనటుల పనితీరు:

క్రిస్టఫర్ గా మమ్ముట్టి తన ఇంపాక్ట్ క్రియేట్ చేసాడు. అతని క్యారెక్టర్ డిజైన్ ఇంకా బలంగా ఉంటే బాగుండేది. బీనా మరియంగా స్నేహ ఆకట్టుకుంది. సులేఖ పాత్రలో అమలా పాల్ పర్వాలేదనిపించింది. విలన్ పాత్రలో వినయ్ రాయ్ ఉన్నంతలో ఆకట్టున్నాడు. శరత్ కుమార్ పవర్‌ఫుల్ గెస్ట్ అప్పీరెన్స్ ఇచ్చాడు. మిగిలిన వాళ్ళు వాళ్ళ పాత్రలకి తగ్గట్టుగా బాగా నటించారు.

తెలుగువన్ పర్ స్పెక్టివ్:

కామన్ ఆడియన్స్ ఒకసారి చూడొచ్చు. క్రైమ్ థ్రిల్లర్ సినిమాలని ఎక్కువగా చూసేవాళ్ళు, ఇష్టపడేవాళ్ళు దీన్ని చూడకుండా ఉండటమే బెటర్. ఎందుకంటే వారికి ఈ సినిమా అంతగా నచ్చకపోవచ్చు.

రేటింగ్: 2 / 5

- దాసరి మల్లేశ్