Read more!

English | Telugu

జక్కన్న లెక్కే వేరు.. 'SSMB 29' టార్గెట్ 3000 కోట్లు!

ప్రస్తుతం ఇండియాలో నెంబర్ వన్ దర్శకుడు ఎవరంటే అందరూ ముక్తకంఠంతో చెప్పే పేరు ఎస్.ఎస్.రాజమౌళి. సినిమా సినిమాకి తన స్థాయిని పెంచుకోవడమే కాకుండా.. తెలుగు సినిమాని ప్రపంచస్థాయికి తీసుకెళ్లిన దర్శకధీరుడు రాజమౌళి. సినిమాని గొప్పగా తెరకెక్కించడమే కాదు.. ఆ సినిమాని ఎక్కువ మందికి చేరువయ్యేలా ప్రమోట్ చేయడంలో ఆయన దిట్ట. అందుకే ఇప్పుడు ఆయన పేరు, ఆయన సినిమాల పేర్లు ప్రపంచవ్యాప్తంగా వినిపిస్తున్నాయి.

మిగతా దర్శకులతో పోలిస్తే ఆలోచనల్లో రాజమౌళి చాలా ఏళ్ళు ముందుంటాడు. కలలో కూడా అసాధ్యం అనుకున్న విషయాలను సాధ్యం చేసి చూపించడం ఆయనకు అలవాటు. వంద కోట్లకు పైగా బడ్జెట్ తో రాజమౌళి 'బాహుబలి' సినిమాని ప్రకటించినప్పుడు.. తెలుగు సినిమా మార్కెట్టే అంత లేదు. అలాంటిది ఇంత బడ్జెట్ తో సినిమా అంటే చేతులు కాల్చుకోవడం గ్యారెంటీ అనే కామెంట్స్ వినిపించాయి. కానీ ఆయన తెరకెక్కించిన 'బాహుబలి-1', 'బాహుబలి-2' చిత్రాలు ఎంతటి సంచలనం సృష్టించాయో తెలిసిందే. ఇండియన్ సినిమాలో సరికొత్త రికార్డులను సృష్టించడమే కాకుండా.. తెలుగు సినిమాని ప్రపంచస్థాయికి తీసుకెళ్లారు.

అసలు ఓ తెలుగు సినిమాకి ఆస్కార్ వస్తుందని ఎవరూ కలలో కూడా ఊహించలేదు. అలాంటిది 'ఆర్ఆర్ఆర్'లోని 'నాటు నాటు' పాటతో ఆస్కార్ ని తెలుగుగడ్డకు తీసుకొచ్చాడు రాజమౌళి. 'ఆర్ఆర్ఆర్'ని ఆస్కార్ బరిలో నిలపడం కోసం కోట్లకు కోట్లు ఖర్చు పెట్టి రాజమౌళి తన టీమ్ తో కలిసి ప్రమోట్ చేయడంపై ఎందరో పెదవి విరిచారు. అందని ద్రాక్ష అయిన ఆస్కార్ కోసం కోట్ల రూపాయలు వేస్ట్ చేస్తున్నారనే కామెంట్స్ వినిపించాయి. కానీ రాజమౌళి ఆలోచనలు, అడుగులు అంత తేలికగా అర్థంకావు. ఆయన ఆస్కార్ అద్భుతాన్ని ముందే ఊహించారు. ఆస్కార్ వేదిక మీద తెలుగు సినిమా గురించి, తెలుగు సినిమా పాట గురించి మాట్లాడితే.. తదుపరి తెలుగు భారీ చిత్రాల మార్కెట్ గ్లోబల్ స్థాయిలో ఏ రేంజ్ లో పెరుగుతుందో ఆయనకు తెలుసు. ఆయన నమ్మకం నిజమై నాటు నాటు ఆస్కార్ గెలిచింది. ఇప్పుడు ఆర్ఆర్ఆర్ పేరు ప్రపంచవ్యాప్తంగా మారుమోగిపోతోంది.

'బాహుబలి', 'ఆర్ఆర్ఆర్' సినిమాలతో ప్రపంచస్థాయిలో రాజమౌళి తన బ్రాండ్ ను క్రియేట్ చేసుకున్నాడు. ఈ బ్రాండ్ తో ఆయన తదుపరి సినిమా మార్కెట్ వాల్యూ ఎన్నో రెట్లు పెరుగుతుంది అనడంలో అనుమానమే లేదు. ఇప్పటిదాకా ఇండియన్ భారీ సినిమాల వసూళ్ళు వెయ్యి కోట్లు, రెండు వేల కోట్లకు పరిమితమయ్యాయి. మహేష్ బాబు హీరోగా రాజమౌళి రూపొందించనున్న తన తదుపరి చిత్రం 'ఎస్ఎస్ఎంబి 29'తో అది మూడు, నాలుగు వేల కోట్లకు వెళ్లినా ఆశ్చర్యంలేదు. 'బాహుబలి'తో పాన్ ఇండియా సినిమాలకు బాటలు వేసిన రాజమౌళి.. 'ఆర్ఆర్ఆర్'తో గ్లోబల్ రీచ్, ఆస్కార్ ఆశలు కలిగేలా చేశాడు. ఇక 'ఎస్ఎస్ఎంబి 29'తో భారీ హాలీవుడ్ సినిమాల తరహాలో విభిన్న దేశాల్లో భారీ స్థాయిలో విడుదల చేసి వేల కోట్లు కొల్లగొట్టే దిశగా అడుగులు వేస్తాడు అనడంలో సందేహం లేదు.