English | Telugu
జోరుమీదున్న విక్రమ్... నయా రిలీజ్ డేట్!
Updated : Jun 27, 2023
ఈ మధ్య కాలంలో హీరో విక్రమ్ నటించిన మూవీ చూసినన్ని వాయిదాలను మరే సినిమా చూసి ఉండదేమో. అన్ని సార్లు వాయిదా పడింది ధ్రువ నక్షత్రం. గౌతమ్ వాసుదేవ మీనన్ దర్శకత్వం వహిస్తున్న సినిమా ఇది. విక్రమ్ హీరోగా నటించారు. ఆ సినిమాను అనౌన్స్ చేసినప్పుడు జనాల్లో మామూలు క్యూరియాసిటీ లేదు. ఇప్పుడు మామూలుగా కూడా క్యూరియాసిటీ కనిపించడం లేదు. గౌతమ్ వాసుదేవమీనన్ ఈ సినిమా గురించి మాట్లాడుతూ ``చాలా మంది ఈ సినిమా రిలీజ్ గురించి ఓ నిర్ణయానికి వచ్చి ఉంటారేమో. వాళ్లందరూ అనుకున్నదానికన్నా త్వరగానే రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నాం`` అని అన్నారు. గౌతమ్ వాసుదేవమీనన్ ప్రకారం ధ్రువ నక్షత్రం సినిమాను వచ్చే నెల విడుదల చేస్తారు. ఈ సినిమాకు సంబంధించి షూటింగ్ పార్ట్ మొత్తం పూర్తయింది. పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా దాదాపుగా పూర్తయినట్టే.
గౌతమ్ మాట్లాడుతూ ``వచ్చే నెల్లో సినిమా విడుదల చేస్తాం. జులై 28న ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలన్నది మా సంకల్పం. ట్రైలర్‌ని జులై మధ్యలో విడుదల చేయాలనుకుంటున్నాం. సినిమా నిర్మాణానికి చాన్నాళ్లు పట్టింది. మధ్యలో అనుకోని ఘటనలు తలెత్తాయి. అయినా కూడా వాటన్నిటినీ దాటి ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలన్నది ప్లాన్`` అని అన్నారు. ధ్రువనక్షత్రం స్పై థ్రిల్లర్ తరహా కథతో తెరకెక్కింది. విక్రమ్ పక్కన రీతువర్మ నటించారు. ఐశ్వర్య రాజేష్, పార్తిబన్, సిమ్రన్, దివ్యదర్శిని, వినాయకన్ కీలక పాత్రల్లో నటించారు. హ్యారిస్ జైరాజ్ సంగీతం అందించారు. 2013లో ఈ సినిమాను ప్రకటించారు డైరక్టర్. పలువురు నటీనటులు మారిన తర్వాత ఈ షేప్‌కి వచ్చింది ఈ సినిమా.